Keyboard Tactile Markers: ఈ రోజుల్లో కంప్యూటర్, ల్యాప్‌టాప్ వాడకం సర్వసాధారణమైపోయింది. అయితే రోజూ గంటల తరబడి కీబోర్డ్ ఉపయోగించే వారు కూడా దానిపై ఉన్న ఆసక్తికర విషయాలను పెద్ద గుర్తించరు. అందులో ఒకటి.. కీబోర్డ్‌లోని ‘F’, ‘J’ అక్షరాల కీలపై ఉండే చిన్నపాటి బుడిపెలాంటి గీతలు (టాక్టెల్ మార్కర్లు) . చాలామంది ఇవి డిజైన్‌లో భాగంగానే ఉన్నాయని అనుకుంటారు. కానీ శ్రమలేకుండా, వేగంగా టైప్ చేయడానికి ఇవే అత్యంత కీలకమైనవని చాలమందికి తెలియదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
‘F’, ‘J’ కీలపై ఉండే ఈ చిన్న గీతలు లేదా ఎత్తులను సాంకేతిక భాషలో ‘టాక్టైల్ మార్కర్లు’ (Tactile Markers) అంటారు. కీబోర్డ్ వైపు చూడకుండానే వేళ్లను సరైన స్థానంలో ఉంచడానికి ఇవి సహాయపడతాయి. మనం టైప్ చేసేటప్పుడు వేళ్లు విశ్రాంతి తీసుకునే మధ్య వరుసను ‘హోమ్ రో’ (Home Row) అంటారు. జూన్ ఇ. బోటిచ్ (June E. Botich) అనే వ్యక్తి.. 2002లో టచ్ టైపిస్ట్‌లకు హోమ్ రోను సులభంగా గుర్తు పట్టడానికి వీలుగా ఈ విధానానికి పేటెంట్ పొందారు. సాధారణ QWERTY కీబోర్డ్‌లో ఎడమచేతి చూపుడు వేలు ‘F’ పైనా, కుడిచేతి చూపుడు వేలు ‘J’ పైనా ఉండాలి. ఈ చిన్న మార్కర్లు వేళ్లకు స్పర్శ ద్వారా సరైన స్థానాన్ని చూపుతాయి.
కీబోర్డ్‌ను చూడకుండా, కేవలం జ్ఞాపకశక్తి ఆధారంగా టైప్ చేయడాన్ని ‘టచ్ టైపింగ్’ అంటారు. వేళ్లను హోమ్ రోలో ఉంచిన తర్వాత మిగిలిన కీలను తాకడానికి వేళ్లను పైకి, కిందకు లేదా పక్కకు జరిపి, మళ్లీ పాత స్థానానికి తీసుకువస్తారు. హోమ్ రో అమరిక విషయానికి వస్తే.. ఎడమ చేయి వేపు A, S, D, F పదాలు, కుడి చేతి వైపు J, K, L, ; పదాలు ఉంటాయి. ‘F’, ‘J’ పై ఉండే ఈ గీతలు సరైన హోమ్ రో పొజిషన్ లోకి వేళ్లు తిరిగి వచ్చేలా ఉపయోగపడతాయి. దీనివల్ల టైపింగ్ చాలా సులువుగా, ఖచ్చితత్వంతో సాగుతుంది.
ఈ గీతల వల్ల కేవలం టైపింగ్ వేగం పెరగడంతో కాకుండా శరీర భంగిమ (Posture) కూడా మెరుగవుతుంది. కీబోర్డ్ వైపు పదే పదే కిందకు చూడాల్సిన అవసరం లేకపోవడం వల్ల మెడ, భుజాలపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా వేళ్లను సరైన పద్ధతిలో ఉంచడం వల్ల చేతులు, మణికట్టుపై భారం పడదు. ఇది దీర్ఘకాలంలో వచ్చే ‘రిపిటిటివ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ’ (RSI) వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.
Also Read: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చెల్లింపులు మునుపటిలాగే ఫ్రీ.. NPCI కీలక ప్రకటన!
దృశ్య లోపం ఉన్నవారికి ఈ డిజైన్ గొప్ప వరమని చెప్పవచ్చు. వారు ఎవరి సహాయం లేకుండా కేవలం స్పర్శ ద్వారానే కీబోర్డ్‌పై వేళ్లను సరిగ్గా ఉంచి టైప్ చేయగలుగుతారు. అందుకే నేడు అన్ని రకాల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కొన్ని రకాల టచ్‌స్క్రీన్ డివైజెస్, బ్రెయిలీ ఇన్‌పుట్ టూల్స్‌లో కూడా ఈ రకమైన సాంకేతికతను తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు.
Also Read: హోటల్ గదిలో రహస్య కెమెరాలు.. కచ్చితంగా చెక్ చేయాల్సిన 10 సీక్రెట్ ప్రదేశాలు!