Auction Two Bedroom Flat| సొంత ఇల్లు కొనాలంటే లక్షలు, కోట్లు ఖర్చు చేయాల్సిందేనని అనుకుంటున్నారా? కానీ ఓ వ్యక్తి కేవలం రూ.155కే రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నాడు. అది కూడా వేలాది మంది పోటీపడిన ఆన్‌లైన్ వేలంలో! ఈ రోజుల్లో సాధారణంగా ఒక చిన్న వస్తువు కొనడానికి కూడా ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తాం. అలాంటిది ఏకంగా ఓ అపార్ట్‌మెంట్ ఇంత తక్కువ ధరకు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఇవిగో
చైనాలో జరిగిన డబుల్ 11 షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా ఓ వ్యక్తికి ఊహించని అదృష్టం కలిసొచ్చింది. కేవలం 11 యువాన్లు (సుమారు రూ.155) చెల్లించి రెండు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నాడు. అలీబాబా ఆక్షన్ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఈ ఫ్లాట్ అమ్ముడైంది. ఈ వేలంలో 1,600 మందికి పైగా పాల్గొనడం విశేషం. ఈ అపార్ట్‌మెంట్ 68 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ఇల్లు ఈశాన్య చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ఉంది. ఓ నివాస భవనంలోని ఏడో అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది.
ఈ అపార్ట్‌మెంట్ వేలం ప్రారంభ ధర కేవలం ఒక యువాన్ మాత్రమే. బిడ్డర్లు ప్రతి సారి 0.01 యువాన్ చొప్పున ధర పెంచుకునే అవకాశం కల్పించారు. అయితే, గరిష్ఠ బిడ్‌ను 11 యువాన్లుగా నిర్ణయించారు. నవంబర్ 5న వేలం ముగిసే సమయానికి మొత్తం 1,677 మంది పాల్గొన్నారు. వీరంతా కలిసి 1,001 బిడ్లు వేశారు. తూర్పు చైనాలోని జియాంగ్సు-జెజియాంగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మొదటగా 11 యువాన్ల గరిష్ఠ బిడ్ వేశాడు. దీంతో అతనికే ఫ్లాట్ దక్కింది.
కొనుగోలుదారుడు ఫ్లాట్ ధరతో పాటు ప్లాట్‌ఫామ్ లావాదేవీ ఛార్జీలను కూడా చెల్లించాడు. అయితే, ఆస్తి బదిలీ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత మొత్తం చెల్లించాలి. స్టాట్యూటరీ డీడ్ ట్యాక్స్ రూపంలో సుమారు 2,000 యువాన్లు ఖర్చవుతాయి. ఈ ఫ్లాట్‌లో శాశ్వతంగా నివసించే ఉద్దేశం తనకు లేదని కొనుగోలుదారుడు వెల్లడించాడు. చలికాలంలో అప్పుడప్పుడు హాలిడే హోమ్‌గా ఉపయోగించుకునే ప్లాన్ ఉందని తెలిపాడు.
ఈ వేలం అలీబాబా డబుల్ 11 ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగింది. అసలు ఆస్తి విలువకు, వేలంలో నిర్ణయించిన ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్లాట్‌ఫామ్ భరించినట్లు వేలం ఏజెన్సీ మేనేజర్ వెల్లడించారు. స్థానిక ప్రాపర్టీ యాప్‌ల ప్రకారం ఈ ఫ్లాట్ మార్కెట్ విలువ సుమారు 40,000 యువాన్లు. అదే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో చదరపు మీటరుకు సగటున 2,700 యువాన్ల ధర ఉంది.
Also Read: ఉద్యోగానికి దరఖాస్తు చేయనే లేదు.. విద్యార్థికి రూ.50 లక్షలు జీతం ఇస్తామని రెండు కంపెనీ ఆఫర్లు
ఇలాంటి వేలంలో పాల్గొనే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్తి యాజమాన్య పత్రాల్లో సమస్యలు ఉండవచ్చు. అలాగే చెల్లించని పన్నులు, మెయింటెనెన్స్ బకాయిలు ఉండే అవకాశం ఉంది. బీజింగ్‌కు చెందిన న్యాయవాది వాంగ్ యుచెన్ కూడా కొనుగోలుదారులు అన్ని పత్రాలను పరిశీలించాలని సూచించారు. కొన్ని ఆస్తులకు సంబంధించి కోర్టు వివాదాలు కూడా ఉండవచ్చని హెచ్చరించారు.
Also Read: కాలేజీ చదువుతో పాటు బిజినెస్.. కేవలం 50 రోజుల్లో రూ.15 లక్షలు సంపాదించిన స్టూడెంట్.. ఎలాగంటే
2024 నవంబర్‌లో షాండాంగ్ ప్రావిన్స్‌లోని వీహైలో ఓ మహిళ 11 యువాన్లకే బీచ్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. 40 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న ఆ ఫ్లాట్ విలువ 50,000 యువాన్ల కంటే తక్కువగా ఉంటుందని అంచనా.
చైనాలో 2009లో ప్రారంభమైన డబుల్ 11 షాపింగ్ ఫెస్టివల్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ కార్యక్రమాల్లో ఒకటిగా మారింది. ఇలాంటి స్పెషల్ వేలం పాటలు.. బిజినెస్ పబ్లిసిటీతో కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడానికి నిర్వహిస్తారని పరిశ్రమ నిపుణులు అభిప్రాయం.