Minimum Balance Account: మనందరికీ తెలిసిన విషయమే మనం బ్యాంకులో ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే, దాన్ని కొనసాగించడానికి ఒక మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలి. కానీ ఈ మినిమమ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి, ఎందుకు ఉంచాలి, దాన్ని ఉంచకపోతే ఎందుకు జరిమానా వేస్తారు అన్నది చాలా మందికి పూర్తిగా తెలియదు. వాటి గురించి పూర్తీ వివరణ మీకోసం.
మినిమమ్ బ్యాలెన్స్ అంటే?
బ్యాంకు కస్టమర్ తన ఖాతాలో ఎప్పటికీ ఉంచుకోవలసిన కనీస మొత్తం. ఇది ఒక బ్యాంకులో 2,000 రూపాయలు కావొచ్చు, మరొక బ్యాంకులో 10,000 రూపాయలు కావొచ్చు, ప్రతి బ్యాంకుకు తనతనదైన రూల్స్ ఉంటాయి. ఈ మొత్తాన్ని కస్టమర్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు పెనాల్టీ ఛార్జీలు వేస్తాయి. దీనిని బ్యాంకులు మెయింటెనెన్స్ ఖర్చులు అని చెబుతాయి.
ATM సౌకర్యం, మొబైల్ బ్యాంకింగ్, కస్టమర్ సపోర్ట్, బ్రాంచ్ ఆఫీస్‌ల నిర్వహణ, స్టాఫ్ జీతాలు — ఇవన్నీ బ్యాంకు కోసం ఖర్చుతో కూడుకున్నవి. ఈ సేవలను నిరంతరం అందించడానికి కస్టమర్ల నుంచి కొంత మొత్తాన్ని ఎప్పటికీ ఖాతాలో ఉంచుకోవాలని వారు అడుగుతారు. ఈ విధంగా మినిమమ్ బ్యాలెన్స్ ఉంచడం వల్ల బ్యాంకులకి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది.
కానీ ఇటీవల RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉంచుకోవాలి అన్నది RBI నిర్ణయించదు, ప్రతి బ్యాంకు తన ఇష్టానికి నిర్ణయించుకోవచ్చు. కొంతమంది బ్యాంకులు 10,000 రూపాయలు అడుగుతారు, మరికొందరు 2,000 మాత్రమే అడుగుతారు, మరికొందరు కస్టమర్లకు మినహాయింపు ఇస్తారు. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ బ్యాంకులు ప్రస్తుతం మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా చేసాయి. ఇది సాధారణ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే నిర్ణయం.
అయితే ప్రైవేట్ బ్యాంకుల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ICICI బ్యాంక్ ఉదాహరణ తీసుకుంటే, ఆగస్టు 1 నుండి కొత్తగా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసే కస్టమర్లకు మినిమమ్ అవరేజ్ మంత్లీ బ్యాలెన్స్‌ను 10,000 రూపాయల నుంచి నేరుగా 50,000 రూపాయలకు పెంచింది. అంటే ఐదు రెట్లు పెరిగినట్లే. ఈ విషయాన్ని వారి అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ప్రకటించారు.
ఈ మార్పులతో ఎక్కువ లాభం బ్యాంకులకు, నష్టం సాధారణ ప్రజలకు. బ్యాంకులకు పెద్ద మొత్తంలో డబ్బు ఎప్పటికీ ఖాతాల్లో ఉండటం వల్ల ఆ డబ్బును వారు ఇతర పెట్టుబడుల కోసం ఉపయోగించుకోగలరు. కానీ మధ్యతరగతి, తక్కువ ఆదాయం కలిగినవారు అంత మొత్తాన్ని ఎప్పటికీ ఖాతాలో ఉంచడం కష్టమవుతుంది. ఉంచలేకపోతే పెనాల్టీలు పడతాయి.
అందుకే మీరు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసే ముందు, ఆ బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ ఎంత అడుగుతోంది, దాన్ని మీరు మెయింటైన్ చేయగలరా లేదా అన్నది ఆలోచించాలి. మీకు సాధ్యం కాకపోతే, మినిమమ్ బ్యాలెన్స్ లేని బ్యాంకును ఎంచుకోవడం మంచిది. ప్రభుత్వ బ్యాంకులు ఈ విషయంలో కొంత సౌకర్యం ఇస్తున్నాయి కాబట్టి అలాంటి వాటిని కూడా పరిశీలించవచ్చు.
మొత్తానికి RBI ఇకపై ఈ విషయంలో ఎలాంటి నియంత్రణ పెట్టదని, ప్రతి బ్యాంకు తన విధానాన్ని తానే నిర్ణయించుకుంటుందని గుర్తుంచుకోవాలి. మన డబ్బు మనకు సౌకర్యంగా, భద్రంగా ఉండేలా ఏ బ్యాంకు ఎంచుకోవాలో మనమే జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి.