Gold Monetisation Scheme: ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని మోదీ స్వయంగా పిలుపునివ్వడంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చను లేవనెత్తింది. ఈ క్రమంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీని ద్వారా ఇంట్లో ఉన్న బంగారంపై వడ్డీ పొందే అవకాశాన్ని సామాన్యులకు కల్పించబోతోంది. కేవలం 10 గ్రాముల గోల్డ్ ఉన్నా బ్యాంకులో డిపాజిట్ చేసే వెసులుబాటును కేంద్రం కల్పించనుంది.
దేశంలోని భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానిని వెలికితీసేందుకు ప్రధాని మోదీ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో తీసుకొచ్చిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో కొన్ని మార్పులు చేసి.. మరింత వేగంగా, సులభతరంగా వడ్డీలు చెల్లించేలా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ బంగారం డిపాజిట్లపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు సైతం కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా 2000 టన్నుల వరకూ బంగారం డిపాజిట్ అయితే మూడేళ్ల వరకు గోల్డ్ దిగుమతి అవసరమే ఉండదని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు గోల్డ్ పాలసీలో కీలక మార్పుల దిశగా ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది.
చాలామంది తమ వద్ద ఉన్న బంగారాన్ని లాకర్లలో దాచుకుంటారు. దీనివల్ల భద్రత ఉంటుందే తప్ప, అదనపు ఆదాయం రాదు. పైగా లాకర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి చెక్ పెడుతూ కేంద్రం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (Gold Monetisation Scheme – GMS) ను 2015 నవంబర్ 5వ తేదీనే తీసుకొచ్చింది. ఇళ్లల్లో, దేవాలయాల్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సేకరించి.. దానికి వడ్డీ ఇస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక ప్రయోజనాలకు ఉపయోగించడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పుడు దీనిలోనే మరిన్ని మార్పులు చేసేందుకు మోదీ సర్కార్ సిద్దమవుతోంది.
ఈ గోల్డ్ స్కీమ్ కింద.. ఎవరైనా కనీసం 10 గ్రాముల బంగారాన్ని ఈ పథకం కింద డిపాజిట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఆభరణాలు, నాణేలు లేదా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారాన్ని బ్యాంకుకు ఇవ్వొచ్చు. అయితే.. ఆభరణాలలోని రాళ్లు, ఇతర లోహాలను తొలగించి కేవలం స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. బంగారాన్ని బ్యాంకుకు తీసుకెళ్లినప్పుడు ప్రభుత్వం గుర్తించిన కలెక్షన్ సెంటర్లలో దాని క్వాలిటీని పరీక్షించి అది ఎన్ని గ్రాముల బంగారం ఉందో ఫైనల్ చేస్తారు.
ఈ పథకంలో ప్రధానంగా మూడు రకాల డిపాజిట్ కాలపరిమితులు ఉన్నాయి. స్వల్పకాలిక (1-3 ఏళ్లు) గోల్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఆయా బ్యాంకులు నిర్ణయిస్తాయి. మధ్యకాలిక (5-7 ఏళ్లు) డిపాజిట్లపై సాధారణంగా ఏడాదికి 2.25 శాతం వడ్డీ లభిస్తుంది. అలా కాకుండా దీర్ఘకాలిక (12-15 ఏళ్లు) డిపాజిట్ చేస్తే.. ఏడాదికి 2.5% వడ్డీ వస్తుందని బ్యాంక్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ స్కీమ్ వల్ల సామాన్యులకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. డిపాజిట్ చేసిన బంగారం.. బ్యాంకు వద్ద సురక్షితంగా ఉండటమే కాకుండా దానిపై వడ్డీ కూడా సామాన్యులకు లభిస్తుంది. ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉండటం.. పెట్టుబడిదారులకు పెద్ద ఊరట. డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత అప్పటి మార్కెట్ విలువ ప్రకారం నగదును గానీ, బంగారాన్ని గానీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
Also Read: బండి భగీరథ్ ఉదంతాన్ని రచ్చకెక్కించిన బీజేపీ నిజామాబాద్ కీలక నేత..!? ఎవరాయన..? ఎందుకు??
భారత్ తన అవసరాల కోసం ప్రతి ఏటా టన్నుల కొద్దీ బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం (డాలర్లు) భారీగా ఖర్చవుతోంది. ప్రజల వద్ద ఉన్న బంగారం గనుక మార్కెట్లోకి వస్తే.. దిగుమతులు చేసుకునే పరిస్థితి తగ్గుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వడ్డీతో పాటు భద్రతను ఇచ్చే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్.. బంగారాన్ని ఒక ఆస్తిగా భావించే వారికి ఒక అద్భుతమైన అవకాశమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: ఇంటిపైన నీటి కుండలు.. తర్వాత జరిగే అద్భుతం తెలిస్తే.. ఆశ్చర్యపోవడం పక్కా!