Mukesh Ambani Gautam Adani: స్టాక్ మార్కెట్ అనేది సముద్రం లాంటిది. ఎప్పుడూ ఒక్కలా ఉండదు. గంటల్లోనే అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంంలోనే మంగళవారం కూడా భారత స్టాక్ మార్కెట్‌లో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. దీంతో మార్కెట్ క్షీణత కారణంగా దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల సంపద భారీగా పడిపోయింది. ఇదే సమయంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి బిలియనీర్ వ్యాపారవేత్తలు కూడా ఈ ఆటుపోట్ల ప్రభావానికి గురికాక తప్పలేదు.
స్టాక్ మార్కెట్‌లో భారీ ఒడిదొడుకులు
బీఎస్‌ఈ సెన్సెక్స్ మంగళవారం 78,017 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే ట్రేడింగ్ సమయంలో 77,745 పాయింట్లకు పడిపోయింది. మార్కెట్‌లో ఈ రాకపోకల ప్రభావం పెద్ద కంపెనీల స్టాక్స్‌పై తీవ్రంగా కనిపించింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్‌లోని షేర్లకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండు గ్రూపుల కంపెనీలు భారతీయ స్టాక్ మార్కెట్‌లో అత్యంత కీలకంగా ఉంటాయి.
ముఖేష్ అంబానీ సంపదలో కోత
ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద మంగళవారం నాటికి 1.42 బిలియన్ డాలర్లు (రూ.12,100 కోట్లు) తగ్గిపోయింది. దీంతో ఆయన నికర సంపద 91.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే ఏడాది జనవరి నుంచి ముఖేష్ అంబానీ సంపద మొత్తం 1.20 బిలియన్ డాలర్లు పెరిగినా, తాజా మార్కెట్ క్షీణత ఆయన సంపదపై తీవ్ర ప్రభావం చూపింది. అయినా, ప్రపంచ స్థాయిలో చూస్తే ఆయన 17వ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.
అంబానీ బిజినెస్
ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం ప్రధానంగా చమురు శుద్ధి, టెలికాం, రిటైల్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ సర్వీసెస్ రంగాల్లో విస్తరించింది. ఈ మార్కెట్ మార్పులు ఆయన పెట్టుబడులను తాత్కాలికంగా ప్రభావితం చేసినప్పటికీ, దీర్ఘకాలంలో రిలయన్స్ వ్యూహాలు మార్కెట్‌ను మళ్లీ పెంచే అవకాశముంది.
Read Also: Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్.. ..
గౌతమ్ అదానీకి ఎంత నష్టమంటే..
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద 1.91 బిలియన్ డాలర్లు (రూ.16,300 కోట్లు) తగ్గిపోయింది. తాజా మార్కెట్ క్షీణత తర్వాత ఆయన సంపద 73 బిలియన్ డాలర్లకు చేరింది. 2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు గౌతమ్ అదానీ సంపద మొత్తం 5.71 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇది భారతీయ పారిశ్రామిక రంగంలో పెద్ద కోతగా చెప్పుకోవచ్చు.
అదానీ వ్యాపారం
గౌతమ్ అదానీ వ్యాపారం ప్రధానంగా పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్స్, ఎయిర్‌పోర్ట్స్ తదితర రంగాల్లో విస్తరించింది. ఇటీవల అదానీ గ్రూప్‌పై వచ్చిన కొన్ని విమర్శలు, విదేశీ పెట్టుబడిదారుల ఒత్తిళ్లు, మార్కెట్ క్షీణత ఇవన్నీ కలిసి ఆయన సంపదపై ప్రభావం చూపించాయి. అయినా, భవిష్యత్తులో అదానీ గ్రూప్ వ్యాపార వ్యూహాలు మార్పులు తెస్తాయా లేదా అనేది చూడాలి మరి.
ప్రపంచంలో బిలియనీర్ లిస్టులో మార్పులు
స్టాక్ మార్కెట్ క్షీణత వల్ల కేవలం భారత పారిశ్రామికవేత్తలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది బిలియనీర్స్ భారీగా నష్టపోయారు. ప్రత్యేకించి టెస్లా, స్పేస్‌ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 84.8 బిలియన్ డాలర్ల నష్టం చవిచూశారు.
అత్యంత ధనవంతుడు
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 348 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలోన్ మస్క్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. టెస్లా స్టాక్స్‌లో క్షీణత, మార్కెట్‌లో ఆటుపోట్లు, ఎలాన్ మస్క్ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు ఇవన్నీ కలిసి ఆయన సంపద తగ్గడానికి కారణంగా నిలిచాయి. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. దీని స్వభావం గమనిస్తే, ఒకరోజు లాభాలు, మరొకరోజు నష్టాలు ఉండడం సహజమే.