Blue Aadhaar Card: ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ ప్రతిఒక్కరికీ అత్యంత కీలకమైన గుర్తింపు కార్డుగా మారింది. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఇలా అనేక అవసరాలకు ఇది తప్పనిసరి అయ్యింది. అయితే సాధారణంగా మనం చూసే తెల్లటి ఆధార్ కార్డులతో పాటు కొన్ని నీలిరంగు (బ్లూ) ఆధార్ కార్డులు కూడా కనిపిస్తుంటాయి. చాలామంది వీటి మధ్య కేవలం రంగు, డిజైన్ లో మాత్రమే వ్యత్యాసం ఉందనుకుంటారు. అసలు తేడా ఎక్కడ ఉందో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బ్లూ ఆధార్ ను ఐదేళ్ల లోపు పిల్లల కోసం జారీ చేస్తారు. ఈ నీలిరంగు ఆధార్ కార్డును ‘బాల్ ఆధార్’ అని కూడా పిలుస్తారు. చిన్న పిల్లలలో వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) గుర్తులు పూర్తిగా అభివృద్ధి చెందవు. అందుకే ఈ కార్డును కేటాయించే సమయంలో పిల్లల బయోమెట్రిక్ వివరాలను తీసుకోరు. బాల్ ఆధార్‌లో కేవలం చిన్నారి పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, వారి ఫోటో మాత్రమే ఉంటాయి.
సాధారణంగా పెద్దలకు ఇచ్చే ఆధార్ కార్డు తెల్లటి కాగితంపై ప్రింట్ అయి ఉంటుంది కాబట్టి కొందరు దీనిని ‘వైట్ ఆధార్’ అని పిలుస్తుంటారు. అయితే యుఐడిఏఐ (UIDAI) అధికారికంగా వైట్ ఆధార్ వర్గాన్ని వేరుగా పేర్కొనలేదు. ఈ సాధారణ ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలతో పాటు వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో వంటి పూర్తి బయోమెట్రిక్ సమాచారం నమోదు అవుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం రంగు కాదు. వయస్సు, బయోమెట్రిక్స్ మాత్రమేనని గుర్తించారు.
ఐదేళ్లలోపు పిల్లలకు బాల్ ఆధార్ కార్డు తీసుకోవడానికి కొన్ని నిర్దిష్ట పత్రాలు అవసరమవుతాయి. చిన్నారి జనన ధృవీకరణ పత్రంతో పాటు, తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరి ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లల ఆధార్ కార్డు తల్లిదండ్రుల ఆధార్‌తో లింక్ అయి ఉంటుంది. ఆధార్ సేవా కేంద్రంలో చిన్నారి ఫోటో మాత్రమే తీసుకుంటారు. కాబట్టి సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి దీనిని సులభంగా పొందవచ్చు.
Also Read: యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!
బ్లూ ఆధార్ తీసుకోవడం వల్ల చిన్నారులకు అనేక రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. చిన్నారి గుర్తింపును అధికారికంగా ధృవీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. స్కూల్ అడ్మిషన్ల సమయంలో గుర్తింపు కార్డుగా ఇది పనిచేస్తుంది. పిల్లలకు సంబంధించి ప్రభుత్వం అందించే వివిధ రకాల సంక్షేమ పథకాలు, ప్రయోజనాలను పొందడానికి కూడా ఇది తప్పనిసరి. అయితే చిన్నారికి ఐదేళ్లు నిండిన తర్వాత వారి వేలిముద్రలు, ఐరిస్ వివరాలను ఆధార్ కేంద్రంలో అప్‌డేట్ చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని మాత్రం తల్లిదండ్రులు మర్చిపోవద్దు.
Also Read: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులపై తీవ్ర ప్రభావం.. అలా చేయకపోతే సబ్సిడీ బంద్!