NSC vs SBI FD:పెట్టుబడి దారులు ఫిక్స్ డిపాజిట్ల (FD)పై మెుగ్గుచూపుతున్నారు. అధిక రాబడితో పాటు పెట్టిన ప్రతీ రూపాయికి భద్రత ఉండటమే ఇందుకు కారణం. అయితే ఈ విభాగంలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అందిస్తున్న 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ రెండింటి పెట్టుబడి కాలపరిమితి 5 సంవత్సరాలే అయినప్పటికీ.. వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు, ముందస్తు విత్‌డ్రా నిబంధనల్లో స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వం మద్దతుతో తపాలా కార్యాలయాల (India Post) ద్వారా లభించే ఒక చిన్న పొదుపు స్కీమ్. దీని కాలపరిమితి ఐదేళ్లు. ఇందులో పెట్టుబడిదారులకు ఇచ్చే వడ్డీ.. వార్షిక ప్రాతిపదికన చక్రవడ్డీ రూపంలో లెక్కించబడుతుంది. అయితే ఈ మెుత్తాన్ని కాలవ్యవధి పూర్తైన తర్వాతే చెల్లిస్తారు. ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి గాను ప్రభుత్వం NSCపై 7.7% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. అంతేకాకుండా.. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
పోస్టాఫీసు ఎన్ఎఫ్ సీ స్కీమ్ విషయానికి వస్తే.. రూ.1000 కనీస పెట్టుబడితో జాయిన్ అవ్వొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఏటా వడ్డీ, చక్రవడ్డీ లెక్కించి.. ఐదేళ్ల కాల వ్యవధి పూర్తైన తర్వాత అసలుకు వడ్డీని కలిపి పెట్టుబడిదారుకు అందిస్తారు. అయితే చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తుంటుంది. కాబట్టి 7.7% రేటు ఈ త్రైమాసికంలో చేసిన పెట్టుబడులకు మాత్రమే వర్తిస్తుంది.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ.. 5 ఏళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీ పథకాన్ని అందిస్తోంది. ఇందులో పెట్టుబడిదారులు ‘క్యుములేటివ్’ ఆప్షన్ ఎంచుకుంటే వడ్డీని అసలుతో కలిపి మెచ్యూరిటీ సమయంలో ఇస్తారు. కనీసం రూ. 1,000 నుండి డిపాజిట్ ప్రారంభించవచ్చు. పెట్టుబడిదారుడి అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు వడ్డీని పొందే వెసులుబాటు కూడా ఉంటుంది.
ఎస్‌బీఐ ఎఫ్‌డీలో వడ్డీ చెల్లింపులు రెండు విధాలుగా ఉండనుంది. సాధారణ పౌరులకు 6.05% వడ్డీని ఇస్తే.. సీనియర్ సిటిజన్లకు సాధారణ రేటు కంటే అదనంగా 0.50% వరకు ఎక్కువ వడ్డీ అందించనున్నారు. ఇక ముందస్తు విత్ డ్రా.. బ్యాంక్ నిబంధనలు, పెనాల్టీలకు లోబడి ఉంటాయి. ఇక డిపాజిట్ ఇన్సూరెన్స్ (DICGC) కింద బ్యాంక్ డిపాజిట్లకు రూ. 5 లక్షల వరకు భద్రతను ఎస్ బీఐ కల్పిస్తోంది.
పోస్టాఫీస్, ఎస్‌బీఐ ఎఫ్ డీలను పోల్చి చూస్తే వడ్డీల విషయంలో రెండిటికి ప్రధాన తేడా కనిపిస్తోంది. NSC 7.7% వడ్డీ రేటు ఇస్తుంటే.. SBI మాత్రం 6.05% ఆఫర్ చేస్తోంది. SBIతో పోలిస్తే NSCలో 1.65% ఎక్కువ వడ్డీని పెట్టుబడిదారులకు ఇస్తోంది. ప్రతి ఏటా ఈ వడ్డీ చక్రవడ్డీగా మారడం వల్ల ఐదేళ్ల పిరియడ్ ముగిసేసరికి NSC మంచి రాబడిని అందిస్తుంది.
Also Read: తెల్లటి ఆధార్ తెలుసు.. మరి ఈ ‘బ్లూ ఆధార్’ కథేంటి? దీని వల్ల ఎవరికి బెనిఫిట్?
సాధారణంగా పెట్టుబడి ఎంపిక అనేది రాబడిపైనే కాకుండా అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అత్యవసరంగా డబ్బు వెనక్కి తీసుకోవాలనుకుంటే SBI ఎఫ్‌డీలో కొన్ని షరతులతో అవకాశం ఉంటుంది. కానీ NSCలో ముందస్తు విత్‌డ్రాపై కఠినమైన నిబంధనలు ఉంటాయి. నెలకు లేదా త్రైమాసికానికి కొంత ఆదాయం కావాలనుకునే వారికి ఎస్‌బీఐ ఎఫ్‌డీ పీరియాడిక్ పేఅవుట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. NSCలో మొత్తం డబ్బు మెచ్యూరిటీలోనే వస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ FD మంచి ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.
Also Read: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!