Bank Holiday Eid Ul Fitr | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి రోజు అయిన మార్చి 31న దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు సెలవును రద్దు చేసింది. ఆ రోజు పబ్లిక్ హాలిడేగా ఉన్నప్పటికీ అన్ని బ్యాంకులు పనిచేయాలని సెలవు రద్దు చేసింది. అన్ని లావాదేవీలు ఆర్థిక సంవత్సరం ముగింపుకు ముందే పూర్తి కావాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ రోజు ఉద్యోగులు సెలవు తీసుకుంటే.. లావాదేవీలు ఆలస్యమై కొత్త ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాల్సి వస్తుంది. దీనివల్ల లావాదేవీల రికార్డు చాలా ఆలస్యమైపోతుంది. అందువల్ల.. ఏ ఆర్థిక సంవత్సరంలోని లావాదేవీలు ఆ సంవత్సరంలోనే నమోదు కావాలన్న లక్ష్యంతో ఈ సెలవును రద్దు చేసింది.
Also Read: సొంతింటి కల నిజం చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి..
మార్చి 31న రంజాన్-ఈద్ ఉల్-ఫితర్ (ID-Ul-Fitr) సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే.. హిమాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ సెలవును రద్దు చేసింది ఆర్‌బీఐ. ఈ నిర్ణయం ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు తెలిపింది.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో, మార్చి 31న పాత సంవత్సరం ముగింపు రోజున ప్రభుత్వ ఆదాయం, చెల్లింపులు, ఇతర లావాదేవీలు పూర్తి కావాలి. అందువల్ల, ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ వంటి ప్రభుత్వ పన్ను చెల్లింపులు, పెన్షన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు, జీతభత్యాలు.. ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించడానికి బ్యాంకులు పని చేయాల్సిదే.
కొత్త రూ.50 నోట్లు జారీ
అలాగే.. ఆర్‌బీఐ త్వరలో కొత్త రూ.50 నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో విడుదల కానున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ఉన్నాయి. కొత్త రూ.50 నోట్లు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా ఫ్లోర్ సెంట్ నీలం రంగులో డిజైన్ చేయబడతాయి. నోటు వెనుక భాగంలో హంపి చిత్రంతో కూడిన రథం ఉంటుంది, ఇది భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నోటు పరిమాణం 66 మి.మీ x 135 మి.మీ ఉంటుంది. కొత్త నోట్లు జారీ అయినప్పటికీ.. ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.