Nominee vs legal heir| కుటుంబ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు. కొందరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తారు. మరికొందరు షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడతారు. అయితే, పెట్టుబడిదారుడు అకస్మాత్తుగా మరణిస్తే ఆ డబ్బు ఎవరికి చెందుతుంది? నామినీకి వస్తుందా? లేక చట్టబద్ధమైన వారసులకు దక్కుతుందా? ఈ విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. భారతదేశంలో చట్టాలు, నిబంధనలు తెలుసుకుంటే కుటుంబ సభ్యులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండవచ్చు.
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే, వారసత్వ చట్టాల ప్రకారం ఆస్తుల పంపిణీ జరుగుతుంది. భారతదేశంలో మతాన్ని బట్టి వారసత్వ నిబంధనలు మారుతాయి. హిందువులకు హిందూ వారసత్వ చట్టం వర్తిస్తుంది. ఇతర మతాల వారికి సంబంధిత వ్యక్తిగత చట్టాలు వర్తిస్తాయి. మరణించిన వ్యక్తి నామినీ నియమించకపోతే, చట్టబద్ధమైన వారసులు సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలి. మరణ ధ్రువీకరణ పత్రం, గుర్తింపు పత్రాలు, చిరునామా ఆధారాలు సమర్పించాలి. అవసరమైతే ఇతర పత్రాలను కూడా అందించాలి.
డీమ్యాట్ అకౌంట్‌లో షేర్లు ఉన్న వ్యక్తి మరణిస్తే, నామినీ సంబంధిత డిపాజిటరీ పార్టిసిపెంట్‌ను సంప్రదించవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించిన తర్వాత షేర్లు నామినీ అకౌంట్‌కు బదిలీ అవుతాయి.
మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కూడా ఇదే విధమైన ప్రక్రియ ఉంటుంది. నామినీ లేదా అర్హులైన వారసులు సంబంధిత అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీని సంప్రదించాలి. సెబీ (SEBI) చిన్న మొత్తాల పెట్టుబడుల ట్రాన్స్‌ఫర్ కోసం సరళమైన విధానాలు ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం నిర్దేశించిన పరిమితుల్లో ఉన్న పెట్టుబడులకు తక్కువ పత్రాలతో బదిలీ ప్రక్రియ పూర్తిచేసే అవకాశం ఉంటుంది.
అయితే, నామినీ అంటే ఆస్తికి తుది యజమాని అని అర్థం కాదు. వారసత్వ చట్టాలు, వీలునామా ఆధారంగా అసలు హక్కులు నిర్ణయమవుతాయి.
Also Read: ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు
ఎఫ్‌డీ చేసిన వ్యక్తి మరణిస్తే, బ్యాంకు ముందుగా నామినీ వివరాలను పరిశీలిస్తుంది. డెత్ సర్టిఫికెట్ (మరణ ధ్రువీకరణ పత్రం)తో బ్యాంకును నామినీ సంప్రదించాలి. నామినీ లేకపోతే వారసులు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. ఆర్‌బీఐ (RBI) నిబంధనల ప్రకారం అర్హమైన కొన్ని క్లెయిమ్‌లకు సరళమైన పరిష్కార విధానాలు ఉన్నాయి.
జాయింట్ ఎఫ్‌డీలో ‘ఎనీన్ ఆర్ సర్వైవర్’ సదుపాయం ఉంటే, జీవించి ఉన్న ఖాతాదారుడు డబ్బు పొందవచ్చు. అయితే, వారసత్వ హక్కులు వేరుగా పరిశీలించాల్సి ఉంటుంది.
Also Read: ఏడాదికి రూ. కోటి వరకు జీతం కావాలా? వెంటనే ఈ కెరీర్ ఎంచుకోండి
సంపదను సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని కుటుంబ సభ్యులకు సక్రమంగా అందేలా చూడటం కూడా అంతే ముఖ్యం. సరైన ఆర్థిక ప్రణాళిక మీ కుటుంబానికి భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గిస్తుంది.