Oil Companies Profits| పెట్రోల్ ధరలు పెరిగినా, తగ్గినా సామాన్యుల జేబుపై భారం తప్పడం లేదు. ఇప్పుడు పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం కూడా వాహనదారుల్లో ఆందోళనలకు కారణమవుతోంది. ఒకవైపు చమురు కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తుంటే, మరోవైపు చెరకు రైతులు తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు బైక్‌లు, స్కూటర్లు ఉపయోగించే వాహనదారులు మైలేజీ ఇంకా తగ్గిపోతుందని, రిపేర్ల భారం తప్పదని బాధపడుతున్నారు. మరోవైపు కర్ణాటకలో పెట్రోల్ పరీక్షల్లో ఇథనాల్ లెవెల్స్ మోతాదుకి మించి ఉన్నాయనే కొత్త వివాదం రావడంతో ఈ భయాందోళనలు మరింత పెరిగాయి.
తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ మూడు కంపెనీల మొత్తం నికర లాభం రూ.29,896.1 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.17,990.4 కోట్లతో పోలిస్తే ఇది 66.2 శాతం ఎక్కువ. మార్చిలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గడం కూడా కంపెనీలకు కలిసొచ్చింది. అయితే, ఈ ప్రయోజనం ప్రజలకు ధరల తగ్గింపు రూపంలో అందలేదు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ చమురు, రసాయనాల విభాగం కూడా రూ.22,347 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
E20 పెట్రోల్ అంటే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిసి ఉందని అర్థం. అయితే కర్ణాటకలో కొన్ని పెట్రోల్ బంకుల్లో నుంచి పెట్రోల్ నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా ఇథనాల్ శాతం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని నమూనాల్లో 31.2 శాతం వరకు ఇథనాల్ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని సమాచారం. మరోవైపు చమురు కంపెనీలు ఈ ఫలితాలను ప్రశ్నించాయి. తమ పరీక్షల్లో సగటున 19.3 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపాయి. దీంతో పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని స్వతంత్రంగా పరీక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే కంపెనీలు తమ సొంత ల్యాబ్స్‌లో చేసిన పరీక్షల ఫలితాలే చూపిస్తున్నాయి. తయారీదారే తమ సరుకు నాణ్యత గురించి చెబితే అందుకు విలువ లేదని ఆర్థిక నిపుణులు వాదిస్తున్నారు. అందుకే స్వతంత్ర ల్యాబ్స్ పరీక్షించడం అవసరమంటున్నారు.
ఇథనాల్ తయారీతో చెరకు రైతులకు మంచి ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ రైతులకు బకాయిల సమస్య కొనసాగుతోంది. 2026 ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా చెరకు బకాయిలు రూ.16,087 కోట్లకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో కర్ణాటక వాటా రూ.4,956 కోట్లు. మహారాష్ట్రలోనూ రైతులు చెల్లింపుల కోసం ఆందోళనలు చేస్తున్నారు.
Also Read: పోస్టాఫీస్ RD vs SBI RD.. పదేళ్ల పాటు నెలకు రూ.10,000 పొదుపు చేస్తే ఏది బెటర్?
దేశంలోని మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాల వాటా సుమారు 70 నుంచి 75 శాతం. ఇథనాల్‌లో పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ శక్తి ఉంటుంది. అందువల్ల మైలేజీ తగ్గుతుంది. ముఖ్యంగా పాత వాహనాల్లో ఇంధన వ్యవస్థ అనుకూలత, తుప్పు, రిపేర్ ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఢిల్లీ వాయు కాలుష్యం 3036.. లండన్ 100 కంటే తక్కువ.. అయినా హై అలర్ట్ జారీ
చమురు కంపెనీలు లాభాలు పొందుతుండగా, రైతులు బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. వాహనదారులు మైలేజీ, మెయిన్‌టనెన్స్ ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారు. అందుకే పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా వెల్లడించాలి. స్వతంత్ర పరీక్షలు నిర్వహించాలి. రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలి. దీంతో పాటు E10 పెట్రోల్ కూడా అందుబాటులో ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే రైతులు, కంపెనీలు, వినియోగదారులు అందరికీ ప్రయోజనం కలుగుతుంది.