Indian Post Office Scheme: దేశ వ్యాప్తంగా ప్రజలు పోస్టాఫీసు పొదుపు పథకాల పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగి ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు మధ్య తరగతి కుటుంబాలు పోస్ట్ ఆఫీస్ పథకాల్లో డబ్బును ఆదా చేసుకునేందుకు మొగ్గు చూపుతారు. ఈ పథకాలకు ప్రభుత్వం సపోర్టు ఉండటంతో పోస్ట్ ఆఫీస్ లో డబ్బును దాచుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉంటాయని భావిస్తారు. ఇక పోస్ట్ ఆఫీస్ అందించే ఓ బెస్ట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పథకం
పోస్ట్ ఆఫీస్ అందించే పథకాలలో పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పథకం అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ (FD) లాగా పని చేస్తుంది. ఇందులో తక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేనా దానిపై వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. నమ్మకమైన రాబడిని అందించే తక్కువ రిస్క్ పెట్టుబడి ఎంపికలను ఇష్టపడే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ TD పథకం 1, 2, 3, 5 సంవత్సరాల కాలా పరిమితులను ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది. వడ్డీ ఏటా చెల్లించబడుతుంది. వీటిలో 5 సంవత్సరాల పథకం అత్యంత ప్రజాదరణ పొందింది. ఇది అధిక లాభాన్నిఅందించడమే కాకుండా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హతను కలిగి ఉంటుంది.
రూ. 5 లక్షల పెట్టుబడితో రూ. 10 లక్షల ఆదాయం
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం కింద అందించే ప్రస్తుత వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. 1-సంవత్సరం డిపాజిట్ కోసం, వడ్డీ రేటు 6.9%గా ఉంది. 2-సంవత్సరాల డిపాజిట్ 7.0% అందిస్తున్నారు. 3-సంవత్సరాల డిపాజిట్ 7.1% ఉంటుంది. 5-సంవత్సరాల పథకంలో అత్యధిక రాబడిని అందిస్తుంది. ఇది సంవత్సరానికి 7.5% వడ్డీ రేటును అందిస్తుంది. 5-సంవత్సరాల TD పథకం కాంపౌండ్ వడ్డీతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇది మీ పెట్టుబడిని మరింత వేగంగా వృద్ధి చెందేలా చేస్తుంది. 7.5% వడ్డీతో 5 సంవత్సరాలకు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టడం వల్ల దాదాపు రూ. 7.21 లక్షలకు పెరుగుతుంది. మీరు ఆ మొత్తాన్ని మరో 5 సంవత్సరాల పాటు అదే రేటుతో తిరిగి పెట్టుబడి పెడితే, అది దాదాపు రూ. 10.40 లక్షలకు పెరుగుతుంది. ఒకసారి తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు 10 సంవత్సరాలలో మీ పెట్టుబడిని దాదాపు రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుంది.
బ్యాంకు పొదుపు ఖాతాల కంటే మెరుగైన లాభం
ప్రభుత్వ హామీతో పాటు, ఈ పథకం బ్యాంకు పొదుపు ఖాతాల కంటే మెరుగైన లాభాలను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. వారికి వడ్డీ చెల్లింపుల నుంచి నమ్మకమైన వార్షిక ఆదాయాన్ని అందిస్తుంది. తక్కువ రిస్క్, ప్రభుత్వ సపోర్టుతో ఒక దశాబ్దంలో రూ. 5 లక్షలను రూ. 10 లక్షలకు పెంచే అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడిగా చెప్పుకోవచ్చు.
Read Also: రోజూ 2జీబీ డేటా, 160 రోజుల వ్యాలిడిటీ.. సెప్టెంబర్ లో BSNL బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఇదే!