Post Office TD Scheme: ఈ రోజుల్లో ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందేందుకు బ్యాంకుల ఫిక్స్ డ్ డిపాజిట్ (FD) స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పోస్టాఫీసు తీసుకొచ్చిన టైమ్ డిపాజిట్ (TD) పథకం కూడా మంచి ప్రత్యామ్నయంగా నిలుస్తోంది. ఇందులో పెట్టిన డబ్బుకు భద్రత ఉండటమే కాకుండా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు పెట్టుబడిదారులకు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టాఫీసు టీడీ స్కీమ్ లో రూ.లక్ష పెట్టుబడి పెడితే ఐదేళ్ల కాలానికి ఎంత వస్తుందో ఈ కథనంలో పరిశీలిద్దాం.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో ఇన్వెస్టర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా 1, 2, 3 లేదా 5 సంవత్సరాల కాలపరిమితితో డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏడాది డిపాజిట్‌పై 6.9 శాతం, రెండేళ్ల డిపాజిట్‌పై 7 శాతం, మూడేళ్ల డిపాజిట్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఇక అత్యధికంగా ఐదేళ్ల కాలపరిమితి గల డిపాజిట్‌పై వార్షికంగా 7.5 శాతం వడ్డీని అందిస్తున్నారు.
పోస్టాఫీస్ టీడీ పథకంలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే కాలపరిమితిని బట్టి వచ్చే రాబడి మారుతుంది. ఉదాహరణకు ఏడాది కాలానికి 6.9 శాతం వడ్డీ చొప్పున సుమారు రూ. 7,081 వడ్డీ లభిస్తుంది. అంటే గడువు ముగిశాక మొత్తం రూ. 1,07,081 చేతికి అందుతాయి. రెండేళ్ల కాలానికి 7 శాతం వడ్డీతో రూ. 14,888 వడ్డీ రూపంలో వస్తుంది. మూడేళ్ల డిపాజిట్‌పై 7.1 శాతం వడ్డీతో సుమారు రూ. 23,508 వడ్డీ జమ అవుతుంది. అయితే ఐదేళ్ల కాలానికి రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే 7.5 శాతం వడ్డీ చొప్పున మెచ్యూరిటీ తర్వాత ఏకంగా రూ. 1,44,995 పొందవచ్చు. అంటే ఐదేళ్లలో కేవలం వడ్డీ రూపంలోనే సుమారు రూ. 44,995 ఆదాయం లభిస్తుందన్నమాట.
Also Read: స్పామ్ కాల్స్ లొల్లి.. జియో vs ఎయిర్‌టెల్ vs వీఐ.. ట్రాయ్ షాకింగ్ రిపోర్ట్!
పోస్టాఫీస్ టీడీ పథకం గడువు ముగిసిన తర్వాత కూడా ఇన్వెస్టర్లు కొన్ని నిబంధనలకు లోబడి తమ డిపాజిట్ కాలపరిమితిని పొడిగించుకునే వెసులుబాటు ఉంది. ఏడాది డిపాజిట్‌ను గడువు ముగిసిన 6 నెలలలోపు రెండేళ్ల డిపాజిట్‌ను 12 నెలలలోపు పొడిగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడేళ్లు, ఐదేళ్ల డిపాజిట్ల విషయంలో గడువు ముగిసిన 18 నెలలలోపు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఐదేళ్ల డిపాజిట్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.
Also Read: వందే భారత్ vs విమానం.. ప్రయాణికులకు ఇచ్చే ఫుడ్ పరంగా ఏది బెస్ట్? నెట్టింట ఆసక్తికర చర్చ!