meal subscription startup| ఉదయం ఆఫీసుకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి చేరేసరికి అలసిపోవడం.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారం వండుకోవడం చాలామందికి కష్టంగా మారుతుంది. బయట ఆహారం తిన్నా ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. బెంగళూరుకు చెందిన దంపతులు కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నారు. అయితే వారు ఆ సమస్యకు పరిష్కారం వెతకడమే కాకుండా, అదే ఆలోచనతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. ఐటీ ఉద్యోగాలను వదిలి మొదలుపెట్టిన వారి ఫుడ్ స్టార్టప్ ఇప్పుడు రూ.56 లక్షల ఆదాయాన్ని సాధించింది.
దియా కృష్ణకుమార్, ఆదిత్య నటరాజన్ బెంగళూరులో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే ఐటీ కంపెనీలో ఉద్యోగాలు సంపాదించారు. మూడేళ్లకు పైగా అక్కడ పనిచేశారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా ప్రతిరోజూ ఇంట్లో వంట చేసుకోవడం వారికి కష్టంగా మారింది. కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేసేవారు. మరికొన్నిసార్లు రాత్రి భోజనం సిద్ధం చేసుకోవడానికి ఇబ్బందిపడేవారు.
ఆరోగ్యకరమైన, తక్కువ ధరలో లభించే ఇంటి భోజనం అందించే సేవలు ఉండాలని వారు భావించారు. ఈ ఆలోచనతోనే ఇద్దరూ ఉద్యోగాలను వదిలి 2024 సెప్టెంబర్‌లో ‘వెల్‌ఫెడ్’ పేరుతో ఫుడ్ సబ్‌స్క్రిప్షన్ స్టార్టప్ ప్రారంభించారు.
ఈ వ్యాపారం ప్రారంభించేందుకు ఇద్దరూ కలిపి రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రధానంగా తమ పొదుపు మొత్తాన్నే ఉపయోగించారు. ప్రారంభంలో ఆరుగురు సభ్యులతో టీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు వ్యవస్థాపకులతో పాటు పోషకాహార నిపుణుడు, వంటవారు, ఇతర సిబ్బంది ఉన్నారు. పోషకాహార నిపుణుడి సాయంతో సమతుల్యమైన ఆహార వంటకాల మెను రూపొందించారు. తొలుత స్నేహితులు, కుటుంబ సభ్యులకు భోజనం అందించారు. వారి సూచనల ఆధారంగా సేవలను మెరుగుపరిచారు.
మెనూలో పప్పు, కూరగాయలు, జొన్న రొట్టెలు, చికెన్ వంటకాలు, పనీర్, టోఫు వంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. బిర్యానీలు, ర్యాప్స్, ఇండో చైనీస్ వంటకాలు కూడా అందిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ పోషకాహార నిపుణురాలు సోషల్ మీడియాలో వెల్‌ఫెడ్ గురించి వీడియో షేర్ చేశారు. దీంతో మొదటి 100 మంది కస్టమర్లు వచ్చారు.
వెల్‌ఫెడ్ తొలి ఏడాది సుమారు రూ.45 లక్షల ఆదాయం సంపాదించింది. 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మరో రూ.56 లక్షల ఆదాయం సాధించింది.
ఇప్పటివరకు 1,500 మందికి పైగా కస్టమర్లకు సేవలు అందించింది. మొత్తం 55,000కు పైగా ఫుడ్ డెలివరీలు చేసింది. అయితే 2026 ప్రారంభంలో గ్యాస్ కొరత కారణంగా వంటగది నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. పరిస్థితులకు అనుగుణంగా మెనూలో మార్పులు చేశారు.
Also Read: మనుషుల కంటే కాకులు డబుల్ ఫాస్ట్.. ఆ విషయంలో యమ స్పీడ్
మూడు రోజుల ట్రయల్ ప్లాన్‌లో ఒక్కో భోజనానికి రూ.289 వసూలు చేస్తున్నారు. రెండు వారాల ప్లాన్ ధర ఒక్కో భోజనానికి రూ.279. నెలవారీ ప్లాన్‌లో ఒక్కో భోజనానికి రూ.269 చెల్లించాలి. ఈ ప్లాన్లలో మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు ఉచిత డెలివరీ, పోషకాహార నిపుణుల సూచనలు అందిస్తున్నారు.
Also Read: అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే
ప్రస్తుతం బెంగళూరులో తమ కంపెనీ సేవలు మరింత విస్తరించాలని దియా, ఆదిత్య లక్ష్యంగా పెట్టుకున్నారు. వంటగది సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కొత్త ప్రాంతాలకు చేరుకోవాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. సాధారణ ఆహార సమస్యతో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు వేలమందికి భోజనం అందించే వ్యాపారంగా ఎదిగింది.