PPF vs SSY vs SIP: పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తల్లిదండ్రులకు ముందుగా గుర్తొచ్చేది చదువు ఖర్చులే. రోజురోజుకూ ఫీజులు పెరుగుతున్నాయి. పైచదువుల కోసం లక్షల రూపాయలు అవసరమవుతున్నాయి. అందుకే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కొంత డబ్బు పక్కన పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. అయితే నెలకు ఎంత పొదుపు చేయాలి? ఆ డబ్బును ఎక్కడ పెట్టాలి? అనే విషయంలో మాత్రం చాలామందికి స్పష్టత ఉండదు. నెలకు రూ.3,000 మాత్రమే పెట్టుబడి పెట్టగలిగినా, 15 ఏళ్లలో మంచి మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు. ఇందుకోసం PPF, సుకన్య సమృద్ధి యోజన, మ్యూచువల్ ఫండ్ SIP వంటి మూడు మార్గాలు ఉన్నాయి. మరి వీటిలో ఏది ఎక్కువ డబ్బు అందిస్తుంది?
ప్రతి నెలా రూ.3,000 చొప్పున ఏడాదికి రూ.36,000 పొదుపు చేస్తే, 15 ఏళ్లలో మనం పెట్టే మొత్తం రూ.5.40 లక్షలు. దీనిపై వచ్చే వడ్డీ లేదా రాబడిని బట్టి చివరికి చేతికి అందే డబ్బు మారుతుంది. ప్రస్తుతం PPFలో 7.1 శాతం వడ్డీ లెక్కన చూస్తే సుమారు రూ.9.34 లక్షలు రావచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో 8.2 శాతం వడ్డీతో దాదాపు రూ.10.30 లక్షలు సమకూరవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్ SIPలో ఏడాదికి సగటున 12 శాతం రాబడి వస్తే సుమారు రూ.15 లక్షలు అందే అవకాశం ఉంటుంది. అంటే పెట్టిన రూ.5.40 లక్షలపై దాదాపు రూ.9.60 లక్షల లాభం రావచ్చు. అయితే SIPలో ఈ రాబడికి ఎలాంటి హామీ ఉండదు. మార్కెట్ పరిస్థితులను బట్టి తుది మొత్తం మారుతుంది.
పెట్టిన డబ్బుకు భద్రత ఉండాలని, ముందే రాబడి ఎంతో అంచనా వేసుకోవాలని అనుకునేవారికి PPF ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న ఈ పథకంలో ప్రస్తుతం ఏడాదికి 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఖాతా కాలపరిమితి 15 ఏళ్లు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం పొడిగించుకోవచ్చు. ఇక సుకన్య సమృద్ధి యోజన విషయానికి వస్తే.. ఇది ఆడపిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన పథకం. పదేళ్లలోపు వయసున్న కుమార్తె పేరుతో తల్లిదండ్రులు ఖాతా తెరవవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇందులో 15 ఏళ్ల పాటు డబ్బులు కట్టినా, ఖాతా ప్రారంభించిన 21 ఏళ్లకు మాత్రమే మెచ్యూరిటీ వస్తుంది. కుమార్తెకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఉన్నత చదువుల కోసం నిబంధనల ప్రకారం కొంత డబ్బు తీసుకోవచ్చు.
ఇక మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెడితే మార్కెట్ రిస్క్ ఉంటుంది. కొన్నిసార్లు రాబడి ఎక్కువగా రావచ్చు.. మరికొన్నిసార్లు ఆశించినంత ఉండకపోవచ్చు. అయితే 15 ఏళ్ల వంటి సుదీర్ఘ కాలం పెట్టుబడి కొనసాగిస్తే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. 12 శాతం సగటు వార్షిక రాబడిని ఊహిస్తే నెలకు రూ.3,000 పెట్టుబడితో దాదాపు రూ.15 లక్షలు రావచ్చు. కానీ ఇది కేవలం అంచనా మాత్రమే. కాబట్టి ఏది ఎంచుకోవాలన్నది మీ అవసరంపై ఆధారపడి ఉంటుంది. డబ్బు భద్రంగా ఉండాలంటే PPF, కుమార్తె కోసం ప్రత్యేకంగా పొదుపు చేయాలంటే SSY, కొంత రిస్క్ తీసుకుని ఎక్కువ రాబడి ఆశిస్తే SIPను పరిశీలించవచ్చు. పిల్లల చదువుల కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు రాబడితో పాటు ఎప్పుడు డబ్బు అవసరమవుతుందో కూడా ముందుగానే ఆలోచించాలి.
Read Also: 8.20 శాతం వడ్డీ రేటు… ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఇచ్చే ఈ 7 పథకాల గురించి తెలుసా ?