Tata Nano EV Look: దివంగత రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ టాటా నానో. 2008లో ప్రారంభించిన ఈ ఐకానిక్ కాంపాక్ట్ కారు కేవలం రూ. లక్షకే వినియోగదారుల ముందుకు వచ్చింది. సరసమైన మొబిలిటీలో ఓ విప్లవాన్ని సృష్టించింది. సొంతకారు కల నెరవేర్చుకోవాలనుకునే మధ్య తరగతి ప్రజల మదితో ప్రత్యేక స్థానాన్నిసంపాదించుకుంది. అయితే, వినియోగదారుల నుంచి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించకపోవడంతో నెమ్మదిగా నానో అమ్మకాలు తగ్గిపోయాయి.
సరికొత్త హంగులతో మళ్లీ మార్కెట్లోకి ఎంట్రీ
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో టాటా నానో సరికొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ లో రాబోతోంది. చాలా కాలంగా టాటా కంపెనీ ఈ కారుపై ఫోకస్ పెట్టింది. ఇండియాలో ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్ లో దీన్ని తీసుకురాబోతున్నది. రతన్ టాటా కలల ప్రాజెక్టుకు మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. వాస్తవానికి 2015 నుంచి టాటా మోటార్స్, కోయంబత్తూరుకు చెందిన ఇంజినీరింగ్ సంస్థ జయం ఆటోమోటివ్స్ తో కలిసి.. ‘జయెమ్ నియో’గా పిలువబడే ఎలక్ట్రిక్ నానో మోడల్ ను డెవలప్ చేస్తున్నది. త్వరలో ఈ కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.
టాటా నానో EV ప్రత్యేకతలు
టాటా నానో EV అత్యాధునిక ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ను కలిగి ఉంది. ఈ కారు 72V లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ పై 315 కిలో మీటర్ల రేంజ్ ను అందిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ కారు ఎలక్ట్రిక్ మోటార్ 23 హార్స్ పవర్ ను కలిగి ఉండి, 85 Nm టార్క్ ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 110 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
టాటా మోటార్స్ నానో EV పవర్ ట్రెయిన్ పై దృష్టి పెట్టడమే కాకుండా కారు డిజైన్, ఫీచర్లపై కూడా చాలా శ్రద్ధ చూపించింది. కొత్త నానో EV చూడ్డానికి చాలా చక్కటి లుక్ ను కలిగి ఉంది. గత మోడల్ తో పోల్చితే చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నది. ఇంటీరియర్ కూడా కంఫర్టబుల్ గా డిజైన్ చేశారు. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రో ల్ లాంటి ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తున్నది.
నానో EV ధర ఎంత అంటే?
ఈ సరికొత్త నానో EV 2025లో మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఈ కారు ధర రూ. 2 లక్షల నుంచి 9 లక్షల వరకు ఉంటుందని తెలుస్తున్నది. బేస్ వేరియంట్ ధర రూ. 2 లక్షలు ఉండగా, హైఎండ్ ఫీచర్స్ కలిగిన టాప్ వేరియండ్ ధర రూ. 9 లక్షలు ఉండవచ్చని టాక్ వినిపిస్తున్నది. ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో అత్యంత పోటీనిచ్చే ధరగా ఉండబోతున్నది. సాంప్రదాయ పెట్రోల్ ఆధారిత హ్యాచ్ బ్యాక్ లకు ప్రత్యామ్నాయంగా నానో EV మార్కెట్లో గణనీయమైన వాటాను పొందే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సిటీ డ్రైవింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తక్కువ ధర, మంచి స్టైల్, కంఫర్ట్ గా ఉండేలా ఈ కారును రూపొందించారు. ఈ కారు 2025 డిసెంబర్ లోగా మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది.
Read Also: ఇకపై బస్సుల్లో UPI పేమెంట్స్, ఆర్టీసీ కీలక నిర్ణయం!