ఆర్టీసీ బస్సులలో టికెట్ తీసుకోవాలంటే కొన్నిసార్లు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. టికెట్ కు సరిపడ చిల్లర లేక ప్రయాణీకులను దించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, ప్రయాణీకులు కండక్టర్లకు టికెట్ కోసం పెద్ద నోట్లు ఇచ్చిన సందర్భంలో రావాల్సిన మొత్తాన్ని చాలా మంది టికెట్ వెనుక రాసి, దిగేటప్పుడు తీసుకోమని చెప్తారు. కొన్నిసార్లు హడావిడిలో మార్చిపోయే అవకాశం ఉంటుంది. ఇకపై ఆ ఇబ్బందులకు చెక్ పడనుంది. ఆర్టీసీ బస్సులలో UPI పేమెంట్స్ ను యాక్సెప్ట్ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వెల్లడించింది. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం పేమెంట్ ద్వారా టికెట్ కు సరిపడా డబ్బులు చెల్లించే అవకాశం ఉంటుంది.
త్వరలో అన్ని బస్సులలో UPI పేమెంట్స్ అమలు
తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన అన్ని బస్సులలో త్వరలో UPI పేమెంట్స్ అమలు చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. చిల్లర కష్టాలను తీర్చడంతో పాటు డిజిటల్ పేమెంట్స్ ను పెంచే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం కండక్టర్లు ఉపయోగించే TIM మెషీన్ల స్థానంలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ మెషీన్లను(AFCS ) అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ లో పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్
బస్సులలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. ఇప్పటికే దిల్ సుఖ్ నగర్, బండ్లగూడ బస్ డిపోలలో మొదట అమలు చేసింది. ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభించింది. పైలెట్ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో అన్ని ఆర్టీసీ బస్సుల్లో Google Pay, Paytm, PhonePe, క్రెడిట్, డెబిట్ కార్డులు సహా ఇతర డిజిటల్ చెల్లింపులు అమలు చేయాని TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ RTC అధికారులను ఆదేశించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం కండక్టర్లు వినియోగిస్తున్న టిమ్ మిషన్ల స్థానంలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ మెషీన్లను రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
కండక్టర్లు, డ్రైవర్లకు AFCS మెషీన్లపై అవగాహన
TIM మిషన్ల స్థానంలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ మెషీన్లు రానున్న నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లకు వీటిపై అవగాహన కల్పించనున్నారు. తొలుత హైదరాబాద్ లోని అన్ని డిపోలలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని బస్సులలో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. పల్లె వెలుగు లాంటి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సుల్లోనూ డిజిటల్ చెల్లింపులను యాక్సెప్ట్ చేయనున్నారు. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులలో మాత్రమే డిజిటల్ పేమెంట్ విధానం అమలు అవుతున్నది. అదీ టెంపరరీగా కొనసాగుతున్నది. AFCS మెషీన్లు అమలులోకి వస్తే ప్రయాణీకులకు మరింత మేలు కలగనుంది.
పలు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులలో UPI చెల్లింపుల
ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో ఇప్పటికే UPI చెల్లింపులు తీసుకుంటున్నాయి. దశల వారీగా అన్ని బస్సులలో డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో తెలంగాణ కూడా చేరబోతున్నది.
Read Also:‘సూపర్ యాప్’పై స్పందించిన రైల్వే మంత్రి.. టికెట్లు బుక్ చెయ్యడం అంత ఈజీనా?