RBI Cheque Book Rules: సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. 2027 జనవరి 1 నుంచి ఆర్‌బీఐ (RBI) కొత్త చెక్ బుక్ నిబంధనలను తీసుకువస్తోందని.. దీంతో పాత చెక్ బుక్కులు చెల్లకుండా పోతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో బ్యాంక్ ఖాతాదారుల్లో ఒక విధమైన టెన్షన్ గందరగోళం నెలకొంది. అయితే ప్రచారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెక్ పెట్టింది. సోషల్ మీడియా ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తి అబద్దాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం వాడుకలో ఉన్న సీటీఎస్ (చెక్ ట్రంకేషన్ సిస్టమ్) చెక్కులు 2026 డిసెంబర్ 31 తర్వాత చెల్లవని కొన్ని వాట్సప్ మేసెజ్ లు, నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. 2027 జనవరి 1 నుంచి ఖాతాదారులు అదనపు భద్రతా ఫీచర్లు ఉన్న కొత్త చెక్ బుక్కులను తీసుకోవాలని పైగా రూ. 50,000 కంటే ఎక్కువ మెుత్తం ట్రాన్స్ ఫర్ చేసేందుకు పాత చెక్కులను అంగీకరించరని ఆయా మెసేజుల్లో పేర్కొన్నారు.
ఈ వదంతులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి పూర్తి స్పష్టత ఇచ్చింది. సీటీఎస్ చెక్ బుక్కులకు సంబంధించి ఆర్‌బీఐ ఎలాంటి కొత్త మార్పులను లేదా నిబంధనలను తీసుకురావడం లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అది తప్పుదోవ పట్టించే సమాచారమని అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించింది.
కొత్త ఏడాదిలోనూ పాత చెక్ బుక్కులు కచ్చితంగా పనిచేస్తాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 2027 జనవరి 1 నుంచి పాత చెక్ బుక్కులను మార్చుకోవాలని తాము ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని పేర్కొంది. రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తమున్న పాత చెక్కులు చెల్లవనే ప్రచారంలో కూడా నిజం లేదని వెల్లడించింది. బ్యాంకు ఖాతాదారులు తమ వద్ద ఉన్న పాత చెక్ బుక్కులనే ఎప్పటిలాగే, ఎలాంటి ఆంక్షలు లేకుండా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
Also Read: దేశంలో వింత స్టేషన్.. రైలు ఎక్కాలంటే టికెట్ ఒక్కటే సరిపోదు.. వీసా, పాస్‌పోర్ట్ కూడా ఉండాల్సిందే!
ఇలాంటి ఆధారం లేని, నిరూపణ కాని మెసేజ్ లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని బ్యాంక్ ఖాతాదారులకు ఆర్‌బీఐ సూచించింది. ఇందుకు సంబంధించిన ఫేక్ మెసేజ్ తమ దృష్టికి వచ్చినా.. దానిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కోరింది. బ్యాంకింగ్ నిబంధనలకు సంబంధించిన ఏవైనా సమాచారాన్ని కేవలం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్, అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని సూచించింది.
Also Read: విమానం కాదని రైలు ఎక్కితే.. 8 గంటలు లేట్.. రైల్వే శాఖపై సీఈఓ ఫైర్!