Lifestyle Inflation Trap| ఉద్యోగంలో జీతం పెరిగిందంటే ఆ ఆనందమే వేరు. ఇక ఖర్చుల గురించి పెద్దగా ఆలోచించకుండా ఇష్టమైన రెస్టారెంట్‌లో భోజనం చేయొచ్చు, ఖరీదైన కాఫీ తాగొచ్చు, వీకెండ్‌లో ట్రిప్‌కు వెళ్లొచ్చని అనుకుంటారు. కానీ నెలాఖరుకు వచ్చేసరికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాత్రం కనిపించవు. జీతం పెరిగినా పొదుపు పెరగకపోవడానికి కారణమేంటి? మరి జీతం పెరిగినా డబ్బు మిగలకపోవడానికి గల 5 ముఖ్యమైన కారణాలేంటో తెలుసుకుందాం.
జీతం పెరిగిన వెంటనే చాలామంది తమ జీవనశైలిని మార్చుకుంటారు. గతంలో సాధారణ రెస్టారెంట్‌కు వెళ్లేవారు ఇప్పుడు ఖరీదైన హోటళ్లను ఎంచుకుంటారు. తరచూ ఫుడ్ ఆర్డర్లు చేయడం, కొత్త మొబైల్, ట్యాబ్, స్మార్ట్ వాచ్ లాంటి గాడ్జెట్లు కొనడం, పెద్ద ఇంటికి మారడం వంటివి మొదలుపెడతారు.
ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు కూడా పెరిగే ఈ అలవాటును లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. మొదట్లో చిన్నగా అనిపించే ఖర్చులు క్రమంగా నెలవారీ అలవాట్లుగా మారతాయి. దీంతో పెరిగిన జీతం కూడా ఖర్చులకే సరిపోతుంది.
ప్రతిసారీ పెద్ద మొత్తంలో ఖర్చు చేసినప్పుడే డబ్బు తగ్గిపోదు. రోజూ తాగే కాఫీ, క్యాబ్ ప్రయాణాలు, ఫుడ్ డెలివరీలు కూడా మీ ఆదాయాన్ని తగ్గిస్తాయి. వీటితోపాటు ఎంటర్‌టైన్మెంట్ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్లు కూడా అదనపు భారంగా మారవచ్చు. ఉపయోగించకపోయినా చాలామంది వాటికి ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తుంటారు. అందుకే మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించండి. అవసరం లేని సబ్‌స్క్రిప్షన్లు రద్దు చేయండి.
జీతం పెరిగినా ఖర్చులు తగ్గకపోవడానికి పెరుగుతున్న జీవన వ్యయాలు కూడా కారణం కావచ్చు. ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, కిరాణా సరుకులు, ప్రయాణ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆదాయంలో ఎక్కువ భాగాన్ని తీసుకుంటాయి. నగరాల్లో నివసించే ఉద్యోగులకు ఈ భారం మరింత ఎక్కువగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, వైద్య ఖర్చులు, ప్రయాణాలు, ఈఎంఐలు కూడా పొదుపును ప్రభావితం చేస్తాయి. అందుకే నెలకు రూ.లక్ష సంపాదిస్తున్నా కొందరికి డబ్బు మిగలడం లేదు.
Also Read: ఆ దేశంలో అంతా రివర్స్.. ప్రజలకు కరెంట్ బిల్లు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఎలాగంటే
జీతం పెరిగినప్పుడు ఖర్చులను కూడా పెంచుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా మీ ఆదాయానికి తగిన బడ్జెట్ సిద్ధం చేసుకోండి. జీతం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని పొదుపు ఖాతాకు బదిలీ చేయండి. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టండి. అనవసరమైన కొనుగోళ్లను తగ్గించండి. కొత్త ఈఎంఐలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అవసరాలు, వినోదం, షాపింగ్, పొదుపు కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించండి.
Also Read: నెలకు రూ.68 కోట్లు సంపాదిస్తున్న మిస్టర్ బీస్ట్.. పెద్ద యూట్యూబర్ కావాలంటే ఏం చేయాలి
ఎక్కువ జీతం రావడం మాత్రమే ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వదు. సంపాదించిన డబ్బు ఎంత తెలివిగా ఖర్చు చేస్తున్నామన్నదే ముఖ్యం. చిన్నచిన్న ఖర్చులను నియంత్రించి, పొదుపుకు ప్రాధాన్యత ఇస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. జీతం పెరిగిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే నెలాఖరులో కూడా మీ బ్యాంక్ అకౌంట్‌లో తగినంత డబ్బు మిగలాలి.