Maoist Party: వరుస లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల లొంగిపోయిన పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను మరియు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ సతీశ్లను విప్లవ ద్రోహులుగా.. పార్టీ విచ్ఛిన్నకారులుగా అభివర్ణిస్తూ వారిని.. వారి అనుచరులను పార్టీ నుంచి బహిష్కరించింది.
కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదల చేసిన లేఖలో, మల్లోజుల, ఆశన్న ముఠా కేంద్ర కమిటీతో చర్చించకుండానే తమ అనుచరులతో లొంగిపోయారని ఆరోపించింది. వీరు పార్టీకి, ప్రజలకు చెందిన సుమారు 50 ఆయుధాలను శత్రువులకు అప్పగించడం విప్లవ ద్రోహమేనని మండిపడింది.
2011 చివరి నుండి విప్లవోద్యమం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండగా, 2025 మేలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత మల్లోజులలోని బలహీనతలు బహిర్గతమయ్యాయని లేఖలో పేర్కొన్నారు. మల్లోజుల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు కొనసాగిస్తూ కోవర్టుగా మారారని ఆరోపించారు. సతీశ్ కూడా ఛత్తీస్గఢ్ పోలీసు మంత్రితో సంబంధాలు పెట్టుకున్నారని పేర్కొన్నారు.
లొంగిపోయిన మల్లోజుల, ఆశన్న ముఠాను “తన్ని తరమాలని” విప్లవ ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రాణభీతితో లొంగిపోవాలనుకునేవారు లొంగిపోవచ్చు కానీ, ఆయుధాలను శత్రువులకు అప్పగించకూడదని హెచ్చరించింది. ఈ లొంగుబాట్ల వల్ల విప్లవోద్యమానికి నష్టం తాత్కాలికమేనని, పార్టీ శత్రువుకు లొంగిపోదని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.
ALSO READ: RRC JOBS: ఇండియన్ రైల్వే నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు, డోంట్ మిస్