RBI: దేశ ప్రజలకు మళ్లీ టెన్షన్. కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. త్వరలో కొత్త రూ.500, రూ.10 నోట్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ స్వయంగా వెల్లడించింది. కొత్తగా విడుదల చేయబోయే నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉండనుంది.
ఆర్బీఐ కొత్త నిర్ణయం
ఆర్బీఐ వర్గాలు చెబుతున్న ప్రకారం.. కొత్తగా విడుదల కానున్న కరెన్సీ నోట్లు మహాత్మా గాంధీ సిరీస్‌లోని డిజైన్ కంటిన్యూ అవుతుందని చెబుతున్నాయి. రూపకల్పనలో పెద్దగా మార్పులేమీ ఉండవని, కాకపోతే కొత్త నోటుపై గవర్నర్ సంతకం ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు ఉన్న నోట్ల మాదిరిగానే కొత్తవి ఉంటాయని స్పష్టం చేసింది.
కొత్త నోట్ల విడుదలతో పాత నోట్లపై ఎలాంటి అనుమానాలు, అపోహాలు అవసరం లేదన్నది ఆర్బీఐ మాట. చలామణిలో ఉన్న రూ.10, రూ.500 నోట్లు ఇకపై చట్టబద్ధంగా ఉంటాయి. పాత నోట్లను మార్చాల్సిన అవసరం లేదని అంటోంది.
గతేడాది డిసెంబర్‌లో ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు సంజయ్ మల్హోత్రా. నార్మల్‌గా అయితే కొత్త గవర్నర్ రాగానే కొత్త సంతకాలతో నోట్లు విడుదల చేయడం సహజంగా జరిగే ప్రక్రియ. దీనివల్ల ప్రజలు తొందరపడాల్సిన అవసరం లేదన్నది ఆర్బీఐ మాట.
ALSO READ: బంగారం రేటు తగ్గిందండోయ్.. ఇది కదా కావాల్సింది
చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం దేశంలో బ్యాంకు నోట్లను జారీ చేసే అధికారం రిజర్వ్ బ్యాంకుకు ఉంది.సెక్షన్ 25 ప్రకారం నోట్ల రూపకల్పన, సామగ్రి ఆర్బీఐ సెంట్రల్ బోర్డు చేసిన సిఫార్సులు చేయనుంది. దాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత కేంద్రం ఆమోదించనుంది.
కొత్త కరెన్సీ నోట్లు
ఇప్పటి వరకు ఉన్న రూ.500 నోట్లు బూడిద రంగులో ఉండనున్నాయి. కొత్త నోట్లలో రంగు, పరిమాణం, డిజైన్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశముందని చెబుతున్నారు. అందులో కొత్త టెక్నాలజీని చేర్చే యత్నాలు జరుగుతున్నట్లు వార్తలు లేకపోలేదు. కొత్త రూ.500 నోట్ల పరిమాణం 66 ఎంఎం x 150ఎంఎంగా ఉండబోతోందని తెలుస్తోంది.
కొద్దిరోజుల కిందట ఆర్బీఐ మరో ప్రకటన చేసింది కూడా. త్వరలో కొత్తవి రూ.100, రూ.200 నోట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇలా కొత్త నోట్లు విడుదల చేయడం వల్ల మార్కెట్‌లో కొత్త నోట్ల ప్రవాహం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన నాలుగు డినామినేషన్లలో రూ.10, రూ.100, రూ.200, రూ.500 నోట్లు రాబోతున్నాయి.
ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రజలకు ఆందోళన అవసరం లేదని చెబుతోంది. కేవలం డిజైన్‌లో మార్పులతో మాత్రమే వాటిని విడుదల చేస్తున్నట్లు చెబుతోంది. రానున్నరోజుల్లో కొత్త సంతకాలతో, కొత్త డిజైన్‌తో, మరింత భద్రతగా కరెన్సీ నోట్లు హంగామా చేయనున్నాయి.
ఆనాటి అనుభవాలు
సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట పెద్ద కరెన్సీ నోట్లు మోదీ సర్కార్ రద్దు చేసింది. 2016 నవంబర్ 8న రాత్రి ఎనిమిది గంటల సమయంలో రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత జనాలు ఏటీఎంల ముందు బారులు తీరారు. కరెన్సీ లేకపోవడంతో ప్రజలు నానాఇబ్బందులు పడ్డారు. రద్దు చేయబడిన నోట్లకు బదులుగా కొత్తగా రూ.500, రూ. 2,000 తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే.