బంగారం ధర రోడు రోజుకీ పెరిగిపోతోంది, ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలో బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే అప్పుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. అంటే అప్పుల విలువ, మొండిబాకీలు కూడా అదే స్థాయిలో ఉంటాయని అర్థం చేసుకోవాలి. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ల విషయంలో కాస్త గందరగోళం ఏర్పడుతోంది. దీన్ని సరిదిద్దేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. బంగారం రుణాలకు సంబంధించి ఆర్బీఐ ముసాయిదా విడుదల చేసింది. ఈ ముసాయిదాపై కొన్ని అభ్యంతరాలు కూడా వినిపించాయి. స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ.. కొన్ని నిర్ణయాలలో మూర్పుని కోరుతూ ఆర్బీఐకి లేఖ రాసింది. ఆ లేఖను పరిగణలోకి తీసుకుని కొత్త ముసాయిదా నిర్ణయాలను ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది.. అంటే 2026 జనవరి-1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి. అయితే 2 లక్షల లోపు రుణాలు తీసుకునే వారిని ఈ నిబంధనల పరిధి నుంచి తప్పించారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు కాస్త ఊరట దక్కిందనే చెప్పాలి.
ఎందుకీ నిబంధనలు..?
మిగతా రుణాల విషయంలో డిఫాల్టర్లపై చర్యలు తీసుకోకపోతే బ్యాంకులు నష్టపోతాయి. అయితే గోల్డ్ లోన్ల విషయంలో బంగారం తాకట్టులో ఉంటుంది కాబట్టి రుణాల ఎగవేత తక్కువగానే ఉంటుంది. కానీ ఇక్కడ కూడా కొన్ని సమస్యలున్నాయి. 2024 డిసెంబర్ నాటికి వాణిజ్య బ్యాంకుల వద్ద రూ. 2,040 కోట్ల బంగారు రుణాలు నిరర్థక ఆస్తుల రూపంలో ఉన్నాయి. ఫైనాన్స్ కంపెనీల వద్ద రూ. 3,904 కోట్ల విలువైన నిరర్థక ఆస్తులు ఉన్నాయి. అయితే ఇక్కడ రుణాలు ఎగ్గొడితే బంగారం వేలం వేయడం అంత సులభం కాదు. సుదీర్ఘ ప్రక్రియ. అంటే అప్పటి వరకు రుణదాతలకు ద్రవ్య లభ్యత తగ్గుతుంది. తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తే రుణం తీసుకున్న వ్యక్తుల క్రెడిట్ స్కోర్ దెబ్బతినవచ్చు. సెంటిమెంట్ గా వారు భావిస్తున్న బంగారాన్ని వేలం వేస్తే అది వారి గౌరవ ప్రతిష్టలకు భంగంగా భావించవచ్చు. అంటే ఇది ఆర్థిక నష్టం కంటే ఎక్కువ. అందుకే బంగారం వేలం అంత త్వరగా జరగదు. అప్పు తీసుకోడానికి తాకట్టు పెట్టిన బంగారం విలువ కంటే, తీసుకున్న అప్పు దాని వడ్డీ ఎక్కువయితే వేలం వేసి కూడా లాభం ఉండదు. అకస్మాత్తుగా బంగారం విలువ పడిపోయినా ఇదే సమస్య ఎదురవుతుంది. లోన్ విలువ, తాకట్టు పెట్టిన బంగారం విలువ మధ్య ఉన్న నిష్పత్తిని లోన్ టు వేల్యూ (LTV) నిష్పత్తిగా పిలుస్తారు.
కొత్త ముసాయిదా ఏంటి..?
బంగారంపై రుణాలు అంటే.. కేవలం ఆభరణాలు, బ్యాంకులు జారీ చేసే నాణేలపై మాత్రమే రుణాలు ఇస్తారు. బంగారు కడ్డీలు, బిస్కెట్లపై రుణాలు ఇవ్వరు. బంగారం విలువలో గరిష్టంగా 75శాతానికి మాత్రమే రుణం ఇస్తారు. అంటే లక్ష రూపాయల బంగారం తాకట్టుపెడితే గరిష్టంగా 75 వేల రూపాయల రుణం మాత్రమే వస్తుంది. ఇక తాకట్టు పెట్టే బంగారం స్వచ్ఛతను కచ్చితంగా పరీక్షించాలి. దానికోసం ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. ఆ సమయంలో బంగారం యజమాని కూడా ఉండాలి. 22 క్యారెట్ల బంగారం ధర ఆధారంగా పూచీకత్తు నిర్ణయిస్తారు. అంటే తక్కువ నాణ్యతగల బంగారం ఇస్తే దానికి వచ్చే రుణం కూడా తక్కువగానే ఉంటుంది.
యాజమాన్య ధృవీకరణ..
గతంలో ఎవరైనా బంగారం తాకట్టు పెట్టవచ్చు. వారు దానికి యజమానా కాదా అనే విషయాన్ని బ్యాంకులు అడగవు. కానీ ఇప్పుడు యాజమాన్య ధృవీకరణ సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఏదో ఒక బిల్లు ఇవ్వాలి, లేదా స్వీయ ధృవీకరణ అయినా చేయాల్సి ఉంటుంది. స్వల్పకాలిక బుల్లెట్ లోన్ అయితే ఏడాది లోగా అసలు, వడ్డీ.. మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
గరిష్టంగా ఎంత బంగారం..?
బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలపై గరిష్ట పరిమితి కూడా విధించబోతోంది ఆర్బీఐ. రుణం కోసం తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండి ఆభరణాల మొత్తం బరువు ఒక్కో రుణగ్రహీతకు 1 కేజీకి మించకూడదు. బంగారు నాణేల విషయంలో గరిష్టంగా 50 గ్రాములు, వెండి నాణేలు అయితే గరిష్టంగా 500 గ్రాములకు పరిమితం చేస్తారు. ఈ మార్పులన్నీ 2026 జనవరి-1 నుంచి అమలులోకి వస్తాయి.