హైదరాబాద్ లో కాస్త లగ్జరీ ఏరియాలో అపార్ట్ మెంట్ మినిమమ్ కోటి రూపాయల వరకు ఉంటుంది. ఆ తర్వాత ప్రాంతాన్ని బట్టి, అంతస్తుని బట్టి రేట్లు మారిపోతూ ఉంటాయి. పాతిక కోట్ల అపార్ట్ మెంట్ అంటే వామ్మో అనుకుంటాం. ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతుందా అని ఆశ్చర్యపోతాం. ముంబై రేట్లు వింటే మాత్రం మనం కచ్చితంగా షాకవుతాం. తాజాగా అక్కడ ఒక అపార్ట్ మెంట్ 320 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ముంబై లోని వర్లి ప్రాంతంలో రెండు అపార్ట్ మెంట్లను రూ.639 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు లీనా గాంధీ తివారీ. అంటే అక్కడ చదరపు అడుగు రూ.2.83 లక్షలు పలికిందనమాట. ప్రస్తుతం భారత దేశంలో ఇదే అత్యంత కాస్ట్ లీ డీల్ గా చెబుతున్నారు.
వర్లీనా మజాకా..?
మన దేశంలో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత ఖరీదైన నగరం ముంబై. అందులోనూ వర్లీ ప్రాంతం అక్కడ మరింత కాస్ట్ లీ ఏరియా. అక్కడ ఇల్లు కొనాలంటే కోటీశ్వరులకు కూడా సాధ్యపడదు. పెద్ద పెద్ద కంపెనీల అధిపతులు, అందులోనూ ఇంటికి ఆ స్థాయిలో ఖర్చు పెట్టే ఆసక్తి ఉన్నవారు, వర్లీలో కచ్చితంగా తమకు ఓ ఇల్లు ఉండాలనుకునేవారు మాత్రమే అటువైపు చూస్తారు. ఇప్పటి వరకు వర్లిలోనే కాస్ట్ లీ డీల్స్ జరిగాయి. ఉదయ్ కోటక్ అనే వ్యాపారవేత్త ఈ ఏడాది వర్లిలో రూ.400 కోట్లకు ఒక పూర్తి భవనాన్ని కొనుగోలు చేశారు. డిమార్ట్‌కు చెందిన రాధాకిషన్ దమాని గ్రూప్ 2023లో వర్లిలో రూ.1,238 కోట్లకు 28 ఇళ్లను కొనుగోలు చేయడం కూడా అప్పట్లో ఒక రికార్డ్. ముంబైలోని మరో కాస్ట్ లీ ఏరియా కఫే పరేడ్. ఈ ప్రాంతంలో యోహాన్, మిచెల్ పూనవాలా 2024లో 30వేల చదరపు అడుగుల ఇంటిని రూ.500 కోట్లకు కొనుగోలు చేశారు. వీటన్నిటికంటే ఇప్పుడు లీనా తివారి కొన్న డూప్లెక్స్ అపార్ట్ మెంట్లు అత్యంత ఖరీదైనవి.
ఎవరీ తివారీ..?
చదరపు అడుగుకి రూ.2.83 లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరబ్బా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. అంత కాస్ట్ లీ ఇంటిని కొనుగోలు చేసింది ఓ మహిళ కావడం విశేషం. ఆమె పేరు లీనా గాంధీ తివారీ. ఫార్మాస్యూటికల్ – బయోటెక్ కంపెనీ USV ప్రైవేట్ లిమిటెడ్ కు ఆమె యజమాని. ఈ కంపెనీని ఆమె తాత విఠల్ బాలకృష్ణ గాంధీ 1961లో ప్రారంభించారు. ప్రస్తుతం USV కంపెనీ 75 దేశాలకు పైగా ఫార్మాస్యుటికల్ ప్రోడక్ట్స్ ని ఎగుమతి చేస్తోంది. ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో పట్టా పొందిన లీనా, బోస్టన్ యూనివర్శిటీ నుండి MBA పట్టా పొందారు. వ్యాపార సామ్రాజ్యంలో తన బ్రాండ్ నిలబెట్టుకున్నారు. ఇప్పుడు వర్లిలో అత్యంత కాస్ట్ లీ ఇంటిని ఖరీదు చేసి మరో అరుదైన ఘనత సాధించారు. సోషల్ మీడియాలో ఆమె పేరు ఇప్పుడు వైరల్ గా మారింది.
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బూమ్ విపరీతంగా పెరుగుతోంది. పెట్టుబడి సాధనాల్లో భూమిని అత్యంత సురక్షితమైనదిగా చెబుతున్నారు. మిగతా వస్తువుల రేట్లు ఎలా ఉన్నా.. భూమి విలువ, భూమికి సంబంధంచిన ఇళ్లు, అపార్ట్ మెంట్ల విలువ మాత్రం ఊహించనంతగా పెరుగుతున్నాయి. అందులోనూ ముంబై లాంటి మహానగరాల్లో సామాన్యులకు కొత్తగా ఇంటిని కొనుగోలు చేసే అవకాశమే లేదు. ఆ స్థాయిలో రేట్లు పెరుగుతున్నాయి. ఇక ధనవంతులు పోటీపడి మరీ వర్లీ లాంటి ప్రాంతాలను కాస్ట్ లీగా మార్చేశారు.