Bhogapuram Airport: విశాఖపట్నం సమీపంలో గల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోజులు వచ్చాయి. ఇక ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇక పెద్ద పండగే. దీనితో స్థానిక యువతకు ఉపాధితో పాటు, విమానయాన సేవలు మరింత చేరువ కానున్నాయి. మరి అంతటి మంచి రోజులు వచ్చేలా ప్రభుత్వ తాజా ప్రకటన ఏమిటో తెలుసుకుందాం.
భోగాపురం విమానాశ్రయం
ఈ విమానాశ్రయం పేరు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. విశాఖపట్నం నగరానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధిలో ఓ కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
నిర్మాణ పురోగతి
2025 మే నాటికి భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో 71% పనులు పూర్తయ్యాయి. రన్‌వే 97% పనులు పూర్తయ్యుండగా, టాక్సీవే 92%, రూఫింగ్ 60% స్థాయిలో పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్‌ను 2026 జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా అధికారులు పనులను ముమ్మరం చేస్తున్నారు.
నిర్మాణ బాధ్యతలు
ఈ ప్రాజెక్ట్‌ను జీఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (GVIAL) నిర్మిస్తోంది. ఇది దేశంలో ప్రముఖ విమానాశ్రయ అభివృద్ధి సంస్థలలో ఒకటి. మొదటి దశలో ఈ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటుంది. భవిష్యత్తులో ఈ సామర్థ్యం మరింతగా విస్తరించనుంది.
విశాఖ విమానాశ్రయ భవిష్యత్?
ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం భారత నావికాదళం ఆధీనంలో ఉంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత, ఈ విమానాశ్రయాన్ని మూసివేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల భోగాపురం విమానాశ్రయం కొత్త గమ్యంగా మారనుంది.
అదనపు భూముల కేటాయింపు
మొత్తం 2,703 ఎకరాల మాస్టర్ ప్లాన్ ప్రకారం విమానాశ్రయ అభివృద్ధి జరగనుంది. గత ప్రభుత్వ కాలంలో 2,203 ఎకరాలు మాత్రమే కేటాయించగా, ప్రస్తుతం ప్రభుత్వం మిగిలిన లోటును పూడ్చేందుకు మరో 500 ఎకరాలను కేటాయించింది. ఈ భూముల్లో నివాస, వాణిజ్య, లాజిస్టిక్, హోటల్ వంటి అనుబంధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు.
Also Read: AP Tourism Homestay: విశాఖ వాసులకే ఈ ఆఫర్.. నెలకు రూ. 50 వేలు దక్కే ఛాన్స్..
అభివృద్ధి కేంద్రమవుతున్న పరిసరాలు
విమానాశ్రయ పరిసర ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మేఫెయిర్ రిసార్ట్స్ సంస్థ రూ. 400 కోట్లతో సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది. అలాగే దేశంలోని ప్రముఖ హోటల్ సంస్థలు కూడా ఇక్కడ తమ పెట్టుబడులను పెడతున్నాయి. ఇందువల్ల భోగాపురం ప్రాంతం ఒక కొత్త టూరిజం, ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా మారే అవకాశం ఉంది.
ప్రాంతీయ అభివృద్ధికి ఊతం
ఈ విమానాశ్రయం పూర్తిగా సిద్ధమైన తర్వాత ఉత్తరాంధ్రలోని ఉద్యోగావకాశాలు, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు పెద్ద ప్రోత్సాహం కలగనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం ద్వారా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పాటు విదేశీ గమ్యస్థలాలకు నేరుగా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి.
భవిష్యత్తు దిశగా అడుగులు
ఈ విమానాశ్రయం పూర్తయిన తర్వాత, ఇది రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా నిలవనుంది. ఒకే ప్రదేశంలో కార్గో హబ్, హోటల్స్, షాపింగ్ మాల్స్, ట్రాన్స్‌పోర్ట్ సెంటర్స్ వంటి అనేక మౌలిక సదుపాయాలను కలిగి ఉండే ఈ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనుంది. మొత్తం మీద విమానాశ్రయం పరిసరాల్లో నివాస, వాణిజ్య అవసరాల కోసం మరో 500 ఎకరాలను కేటాయించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.