WorkHours CapeGemini CEO Ashwin Yarde | భారతదేశంలో పని గంటల అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ-స్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని సూచిస్తే.. ఎల్ & టీ చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రమణ్యన్ మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటలు పని చేయాలని.. ఆదివారాలు సెలవు ఎందుకు అవసరమా? అని పెద్ద ప్రశ్నే వేశారు. ఈ కోవలో ఇప్పుడు క్యాప్జెమిని సీఈఓ అశ్విన్ యార్డి చేరారు. కానీ ఆయన పని గంటలు కాదు ఫలితాలు ముఖ్యమని అభిప్రాయపడ్డార. వారానికి 47.5 గంటల పని అంటే అయిదు రోజులు పనిచేస్తే సరిపోతుందని తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఉన్నత స్థాయి అధికారులు ఎక్కువ పని గంటలు పాటించాలని పిలుపులు ఇస్తున్న సమయంలో.. క్యాప్జెమిని సీఈఓ అశ్విన్ యార్డి వారానికి 47.5 గంటల పని సరిపోతుందని, వారాంతాల్లో ఉద్యోగులకు పని సంబంధిత ఈమెయిల్స్ పంపకూడదని స్పష్టం చేశారు. రోజుకు 9.5 గంటలు, వారానికి ఐదు రోజులు (47.5 గంటలు) పని చేస్తే సరిపోతుందని నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరమ్లో వెల్లడించారు. నాలుగు సంవత్సరాలుగా ఈ ఫార్ములాను అనుసరిస్తున్నానని, కొన్ని అత్యవసర సందర్భాల్లో మాత్రమే వారాంతాల్లో పని చేస్తున్నానని తెలిపారు. అయితే, వారాంతాల్లో తాను పని చేసినప్పుడు కూడా ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపనని స్పష్టం చేశారు. అశ్విన్ యార్డి మాటలకు నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్ కూడా సమర్థన తెలిపారు. పని గంటల కంటే ఫలితాలు ముఖ్యమని నొక్కి చెప్పారు. మారికో సీఈఓ సౌగత గుప్తా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, కానీ కొన్నిసార్లు రాత్రి 11 గంటల వరకు ఈమెయిల్స్ పంపినట్లు అంగీకరించారు.
Also Read: ఐటీ రంగంలో జీతాల పెంపు నామమాత్రమే.. ఎందుకంటే?..
గత ఏడాది ఇన్ఫోసిస్ సహ-స్థాపకుడు నారాయణ మూర్తి భారతదేశ అభివృద్ధి కోసం యువత వారానికి 70 గంటలు పని చేయాలని సూచించిన విషయం తెలిసిందే. తర్వాత కొద్ది రోజుల క్రితమే ఎల్ & టీ చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రమణ్యన్ వారానికి 90 గంటలు పని చేయాలని.. “ఇంట్లో కూర్చుని భార్య ముఖం ఎంత సేపు చూస్తుంటారు? ఆదివారం కూడా పని చేయండి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వివాదం రేగింది. అనేక మంది దిగ్గజ వ్యాపారవేత్తలు ఈ వ్యాఖ్యలను ఖండించారు వ్యతిరేకత వ్యక్తం చేశారు.
నారాయణ మూర్తి వివరణ
ఆ తరువాత తన 70 గంటల పని వ్యాఖ్యలపై నారాయణ మూర్తి వివరణ ఇచ్చారు. వారానికి 70 గంటల పనిని ఎవరూ ఎవరిపైనా బలవంతంగా రుద్దలేరని స్పష్టం చేశారు. “మీరు ఇలా పని చేయాలి లేదా ఇలా చేయకూడదు అని ఎవరూ ఎవరికీ చెప్పలేరు” అని వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన లెక్బర్ ఇస్తూ.. “నేను చెప్పినట్లు ప్రజలందరూ చేయాలని నేను అనట్లేదు. ఎవరిష్టం వచ్చినట్లు వారు పని చేసుకోవచ్చు. ఎవరైనా తమ పరిస్థితులకు తగినట్లుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి” అని అన్నారు. తాను రోజూ ఉదయం 6:20 కి ఆఫీసుకు వెళ్లి, సాయంత్రం 8:30 కి బయటకు వచ్చేవాడినని, ఈ విధంగా 40 ఏళ్ల పాటు పనిచేసినట్లు వివరించారు. ఇది తనకు ఎవరూ బలవంతం చేయలేదని, కాబట్టి ఈ విషయంపై చర్చలు అనవసరం అని అన్నారు.
పనిగంటలు ఎక్కువైతే మెరుగైన ఉత్పాదకత సాధించలేం
మరోవైపు ఈ చర్చల క్రమంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా కూడా మాట్లాడారు. ప్రతిరోజూ 8-9 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తే, ఆ తర్వాత మెరుగైన ఉత్పాదకత సాధించలేమని అన్నారు. రోజూ ఇలా పనిచేయడం కష్టమేనని, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎక్కువ సమయం కాకుండా, వ్యూహాత్మకంగా, నాణ్యమైన పని చేయడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. పరిస్థితులను బట్టి ఎక్కువ పని చేయాలా లేదా ఎలా పని చేయాలి అనేది నిర్ణయించుకోవాలని సూచించారు.