IT sector Salary Hike Nominal | కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26)లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వేతనాల పెంపు తక్కువ స్థాయిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం పెరగడం, నైపుణ్యాల్లో మార్పులు వంటి కారణాల వల్ల ఇలా జరుగుతుందని ఆర్థికవేత్తలు, టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2025-26 ఫైనాన్షియల్ ఇయర్‌లో సగటు వేతనాల పెంపు 4% నుంచి 8.5% మధ్య ఉండే అవకాశం ఉందని.. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉంటుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు వేతనాల విషయంలో మితవ్యయాన్ని పాటిస్తున్నాయని టీమ్‌లీజ్ డిజిటల్ ఉపాధ్యక్షుడు కృష్ణ తెలిపారు. వేతన బడ్జెట్ విషయంలో కంపెనీలు పొదుపు చర్యలు అనుసరిస్తున్నాయని, సాధారణంగా వేతన పెంపులు జరిగే ఏప్రిల్-జూన్ కాలానికి మించి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. “సంస్థలు నైపుణ్య ఆధారిత వేతనాలకు మారుతున్నాయి. ఖర్చులను నియంత్రించడానికి ద్వితీయ శ్రేణి నియామకాలు చేపడుతున్నాయి. వేతన పెంపులు, రిటెన్షన్ బోనస్‌లు, ఈఎస్ఓపీల బదులు ప్రాజెక్ట్ ఆధారిత ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నాయి” అని ఆయన వివరించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వేతన పెంపులు 5% నుండి 8.5% మధ్య ఉండే అవకాశం ఉందని రీడ్ అండ్ విల్లో సీఈఓ జానూ మోతియానీ అంచనా వేసారు. “ఇప్పటికే రెండంకెల వేతన వృద్ధి ఉండే అవకాశం లేదు. ఐటీ రంగంలో అన్ని కంపెనీలు మితవ్యయాన్ని పాటిస్తున్నాయి. 2025 ఏప్రిల్ నుంచి 4-8% శ్రేణిలో వేతన పెంపులు ఉంటాయని టీసీఎస్ ప్రకటించింది. పరిశ్రమ కూడా ఇదే మార్గంలో నడుస్తుంది. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు తమ తుది ప్రకటనలు చేయాల్సి ఉంది” అని ఆయన తెలిపారు. ఏఐ ఆధారిత సామర్థ్యాలు పెరగడం, క్లయింట్ డిమాండ్‌ల్లో మార్పులు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని ఆయన వివరించారు. వలసల రేటు తగ్గడం కూడా వేతన పెంపు విషయంలో కంపెనీలు తొందరపడకపోవడానికి కారణమని తెలిపారు. 2023లో 18.3% ఉన్న సగటు వలసల రేటు, 2024లో 17.7%కి తగ్గింది.
Also Read: భారత్ లో టెస్లా కార్లు గిట్టుబాటవుతాయా?.. మస్క్ కంపెనీకి ఇండియాలో గట్టి పోటీ
సగటు వేతన పెంపులు 6-10% మధ్య ఉండే అవకాశం ఉందని అడెకో ఇండియా అంచనా వేసింది. నైపుణ్యం కలిగిన మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులు, ఏఐతో సంబంధం ఉన్నవారు, మంచి పనితీరు చూపిన వారికి అధిక వేతన పెంపులు ఉంటాయని వారు తెలిపారు. ఫ్రెషర్‌ల నైపుణ్యాల విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉన్నాయని, వీరికి 2-4% వేతన పెంపులు ఉంటాయని తెలిపారు.
ఫ్రెషర్లకు ఈ ఏడాది అధిక అవకాశాలు
ఈ ఏడాది ఫ్రెషర్లకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఫ్రెషర్ల నియామకాల ఉద్దేశ్యం కంపెనీల్లో 74%కి చేరుకుందని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్‌కు చెందిన కెరీర్ అవుట్‌లుక్ సర్వే నివేదిక వెల్లడించింది. రాబోయే నెలలకు సంబంధించి వ్యాపార విశ్వాసాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. ముఖ్యంగా ఐటీ రంగం కోలుకోవడం ఫ్రెషర్లకు ఎక్కువ అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల కాలానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
డీప్‌టెక్ ఉద్యోగాలైన రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సర్టిఫైడ్ రోబోటిక్ ఇంజనీర్ కోర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, ఏఐ అప్లికేషన్లలో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లకు డిమాండ్ ఉందని వెల్లడించారు. ఈ సర్వేలో 649 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే కొన్ని రంగాలు నియామకాలకు సంబంధించి బలమైన ధోరణిని వ్యక్తం చేశాయి. ఈ-కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌ల్లో ఫ్రెషర్ల నియామక ధోరణి 61% నుంచి 70%కి పెరిగింది. తయారీ రంగంలో 52% నుంచి 66%కి, ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాలో 59% నుంచి 69%కి పెరిగింది.
ఐటీ రంగంలో జోష్
“ఐటీ రంగం గణనీయంగా కోలుకుంది. ఆరంభ స్థాయి ఉద్యోగుల నియామకాల ఉద్దేశ్యం 2024 రెండవ ఆరు నెలల కాలంలో 45% నుంచి, 2025 మొదటి ఆరు నెలల కాలానికి 59%కి పెరిగింది. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగంలో కూడా ఇది 47% నుంచి 52%కి పెరిగింది” అని ఈ నివేదిక వెల్లడించింది. విద్యుత్, ఇంధన రంగం, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ రంగాలు కూడా బలమైన వృద్ధిని చూపించాయని తెలిపారు.
భౌగోళికంగా చూస్తే బెంగళూరు 78%, ముంబై 65%, ఢిల్లీ ఎన్‌సీఆర్ 61%, చెన్నై 57% చొప్పున తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు కల్పించే అవకాశం ఉందని పేర్కొంది. క్లినికల్ బయోఇన్ఫర్మాటిక్స్ అసోసియేట్, రోబోటిక్స్ సిస్టమ్ ఇంజనీర్, సస్టెయినబిలిటీ అనలిస్ట్, ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వంటి కెరీర్ మార్గాలు ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. సమకాలీన వ్యాపార అవకాశాల దృష్ట్యా కంపెనీలు ముఖ్యంగా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ రిస్క్ అనలైసిస్ నైపుణ్యాలు కలిగిన వారి కోసం చూస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.