Mutual Funds Warning| “మీ PF (ప్రావిడెంట్ ఫండ్) డబ్బును ఉపసంహరించి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి. నేను మీకు 12% హామీ రాబడిని ఇప్పిస్తాను.” ఇది ఇటీవల ఒక ఆర్థిక నిపుణుడు మరొకరికి చెప్పిన సలహా. అయితే ఇదేమీ తెలివైన సలహా కాదని “ఇది నిజానికి ప్రమాదకరమైన సలహా,” అని సెబీ-రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ అన్నారు.
“మ్యూచువల్ ఫండ్స్‌లో 10-13 శాతం రాబడి హామీ ఇస్తామని ఎవరూ చెప్పలేరు. మార్కెట్‌తో లింక్ అయిన ఉత్పత్తులు అలా పనిచేయవు,” అని ఆయన తాజాగా లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో తెలిపారు.
15 సంవత్సరాలకు పైగా ఆర్థిక ప్రణాళిక రంగంలో ఉన్న కుమార్.. ఇలాంటి అనేక సందర్భాలను చూశారని చెప్పారు. “ఎక్కువ రాబడి వస్తుందని చెబుతూ.. మధ్య తరగతి కుటుంబాలు తప్పుదారి పట్టించబడుతున్నాయి,” అని ఆయన అన్నారు.
ఈ రకమైన సలహాను ఆయన ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ (PF) నిధులను ఇందులో పెట్టుబడి పెట్డడం ఏమాత్రం వివేకం కాదన్నారు. “పిఎఫ్ డబ్బులు మీ రిటైర్మెంట్ సేఫ్టీ కోసం. ఆ డబ్బులు సురక్షితంగా ఉంచాలి. నెమ్మదిగా అవే కాలక్రమేణా పెరుగుతాయి. పైగా వాటిపై పన్నులు కూడా ఉండవు. వాటిని రిస్క్ ఉన్న చోట పెట్టుబడి పెడితే.. మీ భవిష్యత్తుకు భద్రత లేకుండా పోతుంది.” అభిషేక్ కుమార్ అన్నారు.
మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడి తప్పకుండా వస్తుందనే మాటలతో జాగ్రత్త.. లాభాలే కాదు నష్టాలు పొంచి ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలిక సంపద సృష్టికి గొప్ప సాధనాలు అయినప్పటికీ, హామీ ఆదాయం కోసం కాదని కుమార్ నొక్కి చెప్పారు. “మ్యూచువల్ ఫండ్స్ అద్భుతమైనవి, కానీ హామీ రాబడి కోసం కాదు. రాబడి మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. ఒక సంవత్సరం 15 శాతం రాబడి ఇవ్వవచ్చు, మరొక సంవత్సరం -2 శాతం కూడా ఇవ్వవచ్చు.”
రాబడి తప్పకుండా ఉంటుందని మ్యూచువల్ ఫండ్స్ కొనాలని ఒత్తిడి చేసే వారు తరచూ పెట్టుబడిదారుల శ్రేయస్సు కంటే తమ సొంత ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుంటారని ఆయన చెప్పారు. “చాలా మంది ‘సలహాదారులు’ వెంటనే మ్యూచువల్ ఫండ్స్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని చెప్పినప్పుడు.. వారు అలా చెప్పేది వారి కమిషన్ కోసమే తప్ప పెట్టబడి పెట్టే వారికి ఆదాయం వస్తుందని కాదు అనేది గమనించాలి” అని అన్నారు.
పిఎఫ్ (PF) ఉపసంహరణ సాధ్యమైనప్పటికీ, అది సరైన ఎంపిక కాదని కుమార్ సూచించారు. “అత్యవసర పరిస్థితి లేదా బలమైన రిటైర్మెంట్ బ్యాకప్ లేకపోతే, PF నిధులను ఉపయోగించకండి.” “ప్రమాదం ఎల్లప్పుడూ ముందుగా కనిపించదు. మార్కెట్ క్రాష్ అయినప్పుడు, నష్టపోయేది సలహాదారు కాదు, మీరే,” అని ఆయన హెచ్చరించారు.
Also Read: చిన్న వ్యాపారులకు స్వర్ణావకాశం.. ష్యూరిటీ లేకుండానే రూ.10 లక్షల లోన్
మార్కెట్‌తో లింక్ అయిన రాబడి గురించి హామీలపై జాగ్రత్తగా ఉండాలని కుమార్ సలహా ఇచ్చారు. “హామీలను చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీ సలహాదారు ప్రమాదకరమైన ఉత్పత్తులను నకిలీ హామీలతో ఒత్తిడి చేస్తే, వారిని తొలగించండి. నిజమైన సలహాదారు మీ ఆర్థిక భవిష్యత్తును పణంగా పెట్టకుండా, మీ మనశ్శాంతిని కాపాడతాడు.”