CM Revanth Reddy: పాశమైలారంలోని సిగాచి సంస్థలో జరిగిన ప్రమాదంపై అధికారులతో రివ్యూ నిర్వహించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి.. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాధితుల కుటుంబాలను కూడా పరామర్శించారు. వారందరికి భోజనాలు, వసతి గృహాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక లక్ష, గాయపడిన వారికి 50 వేలు తక్షణ సాయంగా అందించాలని సీఎం ఆదేశించారు. ఇది నష్టపరిహారం కాదు, కేవలం తక్షణ సాయం అని సీఎం చెప్పారు. క్షతగాత్రుల ట్రీట్‌మెంట్ ఖర్చుకు వెనకాడొద్దన్నారు సీఎం. అవసరమైతే ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాల్లో చదువుకునే పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదివించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
పాశమైలారం ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రమాదానికి కారకులైన వారందరిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదానికి కారణాలు, సహాయకచర్యల్లో పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్.. సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనలు పునరావృతం కాకుండా రసాయన కంపెనీల్లో.. తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించాలన్నారు సీఎం. కంపెనీలలో లోపాలను గుర్తించి రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎక్స్‌పర్ట్స్‌తో డీటైల్డ్ రిపోర్ట్ రూపొందించాలన్నారు సీఎం రేవంత్. సహాయక చర్యలకు సంబంధించి విభాగాల మధ్య సమన్వయం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.
అనంతరం సిగాచి ప్రమాదంపై అధికారులతో రివ్యూ నిర్వహించారు ముఖ్యమంత్రి. ప్రమాదం జరిగిన పరిశ్రమలో గతంలో ఏమైనా తనిఖీలు నిర్వహించారా అంటూ అధికారులను ప్రశ్నించారు సీఎం. బాయిలర్లను తనిఖీ చేసి ఏవైనా లోపాలను గుర్తించారా అంటూ అడిగారు. అసలు బాయిలర్ల పనితీరు గురించి సంస్థ యాజమాన్యానికి ఏమైనా చెప్పారా.. అని అధికారులను ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ప్రమాదం జరిగిందని రెండు రోజులు హడావిడి చేసి వదలొద్దన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరో ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అందుకు అధికారులు, కంపెనీ ప్రతినిధులు కలిసి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో సంస్థలో జరిగిన ప్రమాదంలో స్కిల్డ్ లేబర్, అన్ స్కిల్డ్ లేబర్ ఎంత మంది మృతిచెందారని, గాయపడ్డారంటూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
బీమా, నష్టపరిహారం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని సంస్థ ఉన్నతాధికారిని ప్రశ్నించారు. అయితే.. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతున్నా యాజమాన్యం ఇంకా ఎందుకు రాలేదని అసహనం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. సిగాచి యాజమాన్యం వచ్చి మంత్రులను కలవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read: యాజమాన్యం తీరుపై సీఎం రేవంత్ అసహనం.. పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
పాశమైలారం ప్రమాద ఘటనకు సంబంధించి.. పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో 36 మృతదేహాలు ఉన్నాయి. వాటిలో పది మృతదేహాలను పోలీసుల గుర్తించారు. కొన్ని గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయని తెలిపారు. డాక్టర్లు డీఎన్‌ఏ శాంపిల్స్ తీసుకున్నారు. రిజల్ట్ వచ్చిన తరువాత వాళ్ల కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే గుర్తించిన డెడ్‌బాడీస్‌లో మంచిర్యాలకు చెందిన నాగేశ్వరరావు, కడపకు చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి, శ్రీరమ్య, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రసన్న, చిత్తూరుకు చెందిన హేమ్‌సుందర్ ఉన్నారు.