Aadhaar Enabled Payment System: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. చిన్న చిన్న ఖర్చులకు సైతం UPI పేమెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ, కొన్నిసార్లు నగదు అవసరం ఉంటుంది. అప్పుడు మామూలుగా ఏటీఎం ఉపయోగిస్తారు. ఏ సమయంలోనైనా సింపుల్ గా డబ్బులు డ్రా చేసుకునేందుకు ఈజీ మార్గం ఏటీఎం. కానీ, ఇకపై ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ కు లింకై ఉంటే సరిపోతుంది. పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (AEPS) అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీ ఆధార్ నంబర్, బయోమెట్రిక్ తో డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ పద్దతి ద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవడంతో పాటు డబ్బులను వేరే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంది.
ఆధార్ నెంబర్ తో డబ్బులు ఎలా డ్రా చేసుకోవాలి?
ఆధార్ నెంబర్ సాయంతో డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే, ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ తో లింక్ చేయాలి. ఆ తర్వాత ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయితే డబ్బులు తీసుకునే అవకాశం ఉంది.
⦿AEPS మద్దతుతో డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకింగ్ ఏజెంట్, మైక్రో-ATMకి వెళ్లాలి.
⦿గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో బ్యాంకింగ్ అవుట్ లెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.
⦿మైక్రో-ATM దగ్గరికి వెళ్లిన తర్వాత మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను చెప్పాలి.
⦿ఆ తర్వాత, ఫింగర్ ప్రింట్ స్కానర్ సాయంతో బయోమెట్రిక్ ధృవీకరణను పూర్తి చేయాలి.
⦿ఆ తర్వాత మనీ విత్ డ్రా ఆప్షన్ ను ఎంచుకోవాలి.
⦿విత్ డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
⦿లావాదేవీ విజయవంతం అయిన తర్వాత, బ్యాంకింగ్ ఏజెంట్ మీకు నగదును అందజేస్తారు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు లావాదేవీకి సంబంధించిన మెసేజ్ వస్తుంది.
ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి
⦿నమ్మకస్తులైన మైక్రో బ్యాంకింగ్ ఏజెంట్లకు మాత్రమే మీ ఆధార్ నంబర్ ఇవ్వాలి.
⦿మీ బ్యాంక్ లింకేజీ నెంబర్ ను ఎల్లప్పుడూ అప్ డేట్ గా ఉంచుకోవాలి.
⦿ఫింగర్ ప్రింట్ స్కానర్ సేఫ్ గా, సరిగ్గా పని చేస్తుందని నిర్థారించుకోవాలి.
⦿AEPS పద్దతి ATM సెంటర్లకు దూరంగా నివసించే వారికి లేదంటే డెబిట్ కార్డ్ లేని వారికి ప్రత్యేకంగా సాయపడుతుంది.
⦿ఈ ప్రక్రియ చాలా సులభం ఉంటుంది. మీ ఆధార్, ఫింగర్ ప్రింట్ ద్వారా నగదును పొందే అవకాశం ఉంటుంది.
వాస్తవానికి ఈ పద్దతి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. వాళ్లకు ఏటీఎం సెంటర్లు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో తమ గ్రామాల్లోని మైక్రో బ్యాంకింగ్ సెంటర్ కు వెళ్లి సింపుల్ గా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.
Read Alos: ఫ్లాట్ కొంటున్నారా? కచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే!