నెయ్యి రోజుకో స్పూన్ తింటే ఎంతో ఆరోగ్యమని చెబుతారు. అయితే డయాబెటిస్ బారిన పడిన వారు మాత్రం ఏది తినాలన్నా భయపడుతూ ఉంటారు. అందులో నెయ్యి కూడా ఒకటి. నెయ్యి తింటే శరీరంలో కొవ్వు చేరుకుపోతుందని, ఊబకాయం బారిన పడతామని దీని వల్ల మధుమేహం సమస్య ఇంకా పెరిగిపోతుందని భావిస్తారు. దీనివల్ల మధుమేహం బారిన పడినవారు నెయ్యి తినడమే తగ్గించేశారు. ఈ విషయంలో పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.
నెయ్యి మన వంటలలో కచ్చితంగా కనిపించే ఒక పదార్థం. స్వీట్లు చేయాలంటే కచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. బిర్యానీ, పలావుల్లో కూడా నెయ్యి రుచి తగలాల్సిందే. మధుమేహం బారిన పడిన వారు మాత్రం నెయ్యిని వాడేందుకు భయపడుతూ ఉంటారు. తినాలా వద్దా అని ఆలోచిస్తారు. నిజానికి మధుమేహం బారిన పడినవారు నెయ్యి తినడం వల్ల మేలే జరుగుతుంది. ఎందుకంటే నెయ్యి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి నెయ్యి తిన్నాక ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఆకస్మికంగా లేదా హఠాత్తుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నెయ్యి పెంచదు. కాబట్టి రోజుకు ఒక స్పూను నెయ్యిని మధుమేహంలో తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు.
నెయ్యిలోని పోషకాలు
నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ డి వంటివి నిండి ఉంటాయి. అలాగే బ్యూట్రిక్ యాసిడ్, లినోలెయిక్ యాసిడ్ వంటివి కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరుస్తాయి. శరీరం పోషకాలను శోషించుకునేలా చేస్తాయి. కాబట్టి మధుమేహలు నెయ్యి తినడం వల్ల వారికి మేలే జరుగుతుంది. నెయ్యిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని, పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఈ రెండిటితో పోల్చుకుంటే ఆవు నెయ్యిని తినడమే మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిర్వహిస్తుంది. చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా స్థిరంగా ఉండేలా చూస్తుంది. అయితే అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం నెయ్యి ఎవరికైనా హానే చేస్తుంది. రోజుకి ఒక స్పూను లేదా రెండు స్పూన్లను ఆహారంలో కలుపుకొని తినడం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదు. పైగా ఎంతో ఆరోగ్యం కూడా.
రోజుకో స్పూను నెయ్యి
మధుమేహలు తమ రోజువారి ఆహారంలో ఒక స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవాలి. అంతకుమించి తినకపోవడం ఉత్తమం. ఎందుకంటే దీనిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అంతకుమించి తింటే మధుమేహం బారిన పడిన వారి బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థకు నెయ్యి ఎంతో మేలు చేస్తుంది. అలాగే చర్మాన్ని మెరిపించడంలో కూడా నెయ్యి ముందుంటుంది. నెయ్యి తినడం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. చర్మంపై పడిన ముడతలు, గీతలు, పగుళ్ళు వంటివి నయం చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు నిండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి.