Vaibhav Taneja: టెస్లా సీఎఫ్‌ఓ భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా వార్తల్లోకి వచ్చేశారు.కార్పొరేట్ చరిత్రలో అత్యధికంగా వార్షిక ఆదాయం పొందుతున్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌లను అధిగమించారు. ఇంతకీ వైభవ్ వార్షిక ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాలా 139 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 1,150 కోట్లు అన్నమాట.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ వర్గాలలో భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా గురించే చర్చ జరుగుతోంది. కేవలం రెండేళ్ల కిందట టెస్లా సీఎఫ్‌ఓ బాధ్యతలు చేపట్టిన వైభవ్, తక్కువ సమయంలో ఆ రేంజ్‌కు ఎలా ఎదిగాడు అనేదానిపై చర్చ మొదలైపోయింది. 47 ఏళ్ల వైభవ్ గతేడాది ఊహించని రీతిలో రూ. 1,150 కోట్లు సంపాదించాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వార్షిక ఆదాయాలను అధిగమించాడు వైభవ్.
టెస్లా నుంచి వైభవ్ తనేజా తీసుకుంటున్న వేతనం $ 400,000 (సుమారు రూ. 3.33 కోట్లు). అయితే మిగిలిన ఆదాయం వివిధ స్టాక్ ఆప్షన్లు,ఈక్విటీల నుంచి ఎక్కువగా వచ్చింది. ఈక్విటీ ప్రయోజనాలను ఎన్‌క్యాష్ చేసే సమయంలో టెస్లా షేర్లు 250 డాలర్ వద్ద ఉంది. తద్వారా తనేజా అధిక వార్షిక ఆదాయం సంపాదించడంలో సహాయపడింది.
దశాబ్ద కాలంలో ఓ చీఫ్ ఫైనాన్స్‌కు లభించిన అత్యధిక ప్యాకేజీలలో ఇదొకటి. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల 2024లో ఆయన ఆదాయం అక్షరాలా రూ. 650 కోట్లు.అదే సమయంలో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ రూ. 88 కోట్లు. వీరిద్దరినీ వైభవ్ రూ. 1,150 కోట్లు అధిగమించాడు. గతంలో నికోలా కార్పొరేషన్ సీఎఫ్‌ఓ 86 మిలియన్ డాలర్ల రికార్డును అధిగమించారు.
ALSO READ: రాత్రికి రాత్రే జెండా ఎత్తేసిన దుబాయ్ కంపెనీ, భారతీయులకు కోట్లలో నష్టం
2012 తర్వాత టెస్లా కంపెనీ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. వార్షిక అమ్మకాలు క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరగడం లాంటి సమస్యలు ఎదుర్కొంది. దీనికితోడు సీఈఓ ఎలాన్ మస్క్ వివాదాలు కూడా కంపెనీకి మరిన్ని సవాళ్లను తెచ్చిపెట్టాయి. గడిచిన నాలుగైళ్లు కంపెనీ అమ్మకాలు బాగుండడం కలిసి వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మస్క్ మద్దతు ఇవ్వడం కలిసి వచ్చిందని అంటున్నాయి వ్యాపారవర్గాలు.
వైభవ్ తనేజా ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బీకాం పట్టా పొందాడు. వృత్తిపరంగా చార్టర్డ్ అకౌంటెంట్ రంగంలో అడుగుపెట్టాడు. పాతికేళ్ల కిందట ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా అర్హత సంపాదించాడు. 2006లో యూఎస్‌లో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్‌గా మారారు.
వైభవ్ 17 ఏళ్లు గ్లోబల్ ఆడిట్ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్‌లో తన ప్రయాణం కొనసాగించాడు. భారతదేశంతో పాటు అమెరికాలోనూ సేవలందించి సీనియర్ మేనేజర్ స్థాయికి చేరాడు. 2017లో టెస్లాలో కార్పొరేట్ కంట్రోలర్‌గా జాయిన్ అయ్యాడు. ఆయన టాలెంట్ గుర్తించిన ఆ కంపెనీ ఆరేళ్ల కిందట చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా నియమించింది.
రెండేళ్ల కిందట అంటే 2023 ఆగస్టులో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్-సీఎఫ్‌ఓ స్థాయికి చేరారు. భారతదేశంలో టెస్లా తన కార్యకలాపాలను విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర. నాలుగేళ్ల కిందట టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా నియామకం జరిగింది.