EMI Trap Indians| భారత్‌లో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం గతంలో కంటే ఇప్పుడు చాలా సులభమైంది. చాలా మంది యువత నెలవారీ ఈఎంఐల(EMI)ల ద్వారా ప్రీమియం ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, సులభంగా లభించే ఈ ఫైనాన్సింగ్ వల్ల మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది.
మహారాష్ట్రలో జరిగిన ఒక విషాద ఘటన వినియోగదారులు.. రుణాల ఒత్తిడి వల్ల ఎదుర్కొనే ప్రమాదాలపై చర్చకు దారితీసింది. ఆ ఘటనలో ఐఫోన్ ఈఎంఐ చెల్లింపుల వివాదం వల్ల ఒక కుటుంబం మొత్తం చనిపోయింది. తనకు ఐఫోన్ కొనివ్వాల్సిందేనంటూ ఒక టీనేజ్ బాలుడు డిమాండ్ చేశాడు. అతని తండ్రి పేదవాడు. ఐఫోన్ కొనాల్సిన అవసరం లేదని, అలాంటి కోరికలు చేయకూడదని మందలించినందుకు ఆ టీనేజ్ కుర్రాడు ఏకంగా కొండ అంచున నిలబడి తాను దూకేస్తానని బెదిరించాడు.
ఈ విషయం ఆ గ్రామంలో తెలిసిపోవడంతో గ్రామ సర్పంచ్, పోలీసులు అందరూ అక్కడికి చేరుకున్నారు. సుమారు మూడు గంటలపాటు ఆ కుర్రాడిని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. చివరికి గ్రామ సర్పంచ్ ఫోన్ కొనిస్తామని హామీ ఇచ్చినా.. ఆ కుర్రాడు వెంటనే కావాలని మొండి చేశాడు. ఇంతలో అతను కాలు జారి కొండనుంచి కిందకు పడ్డాడు. అది చూసి అతని తండ్రి వెంటనే అతడిని కాపాడేందుకు పరుగు తీశాడు. ఆయన కూడా కింద పడ్డాడు. ఇదంతా చూసి షాక్ కు గురైన అతని తల్లి కాసేపు ఏడ్చి తరువాత తను కూడా దూకి ఆత్మ హత్య చేసుకుంది.
ఈ విషాదకర ఘటన.. దేశవ్యాప్తంగా కోట్ల మంది సామాన్యులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి గురించి చర్చ మొదలైంది. అయితే ఈ ఒక్క ఘటనతో దేశంలో ఉన్న రుణ సమస్యను అంచనా వేయలేము. ఇలాంటి ఘటనలు ఉదాహరణకు చాలా ఉన్నాయి. సమయానికి రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలున్నాయి.
ఫిన్‌టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ (FACE) సర్వే ప్రకారం.. జీవనశైలిలో మార్పుల ఖర్చులు పెరగడంతో భారతీయ కుటుంబాలు ఎక్కువ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. భారీ ఈఎంఐలు, బై నై పే లేటర్ (BNPL) పథకాలపై ఆధారపడుతున్నాయి. ఆదాయం సరిపోకపోతే అప్పుల భారం మరింత పెరుగుతోంది. తగిన ఆదాయం లేక రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. రుణ వేధింపుల్లో బెదిరింపులు, పదేపదే ఫోన్ కాల్స్, అవమానకరమైన సందేశాలు, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి చర్యలు ఉంటాయి. వీటి వల్ల కొంత మంది అవమాన భారం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి ఘటనలు.. అందరికీ ఆర్థిక అవగాహన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.
చాలా మంది యువతకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కేవలం సాంకేతిక పరికరం మాత్రమే కాదు. అది సామాజిక హోదా, ఆర్థిక విజయానికి గుర్తుగా కూడా మారుతోంది. సోషల్ మీడియా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఒత్తిడిని పెంచుతోంది. యువత తమను స్నేహితులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇతర సోషల్ మీడియా వినియోగదారులతో పోల్చుకుంటున్నారు. ఖరీదైన వస్తువులు సామాజిక గుర్తింపును ఇస్తాయనే భావన కూడా పెరుగుతోంది. దీంతో కొందరు తమ ఆర్థిక సామర్థ్యాన్ని మించి ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ పరిస్థితి మరింత సమస్యాత్మకంగా మారవచ్చు. కొన్ని ప్రీమియం ఫోన్ల ధర.. కుటుంబం మొత్తం నెలవారీ ఆదాయంతో సమానంగా ఉంటుంది.
భారత్‌లో రిటైల్ ఫైనాన్సింగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు విధానాన్ని పూర్తిగా మార్చింది. కొనుగోలుదారులు వేగంగా డాక్యుమెంట్స్ సమర్పించి వెంటనే ఫైనాన్సింగ్ పొందుతున్నారు. డిజిటల్ విధానాలు రుణాల ఆమోద ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. చాలా మంది కొనుగోలుదారులు మొత్తం ధర కంటే నెలవారీ ఈఎంఐపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. తక్కువ ఈఎంఐ కారణంగా ఖరీదైన ఫోన్ కూడా అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ, ఆ రుణ భారం నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగుతుంది.
ఎక్కువ కాలం ఈఎంఐ చెల్లించడం నెలవారీ భారం తగ్గించవచ్చు. అయితే, అదే సమయంలో కుటుంబంపై ఆర్థిక బాధ్యత ఎక్కువకాలం కొనసాగుతుంది.
యువత వెంటనే ప్రీమియం ఫోన్లను ఉపయోగించడం ప్రారంభిస్తారు. అయితే, ఈఎంఐల అసలు ఆర్థిక భారాన్ని తరచుగా కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రులు భరించాల్సి వస్తుంది. తక్కువ, మధ్యతరగతి ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈఎంఐలు అదనపు సమస్యలను సృష్టిస్తాయి. కుటుంబాలు పొదుపు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం, విద్య, ఇతర అవసరమైన ఖర్చులు ప్రభావితమవుతాయి. ఈఎంఐలు.. కోరికలు, వాస్తవ ఆర్థిక సామర్థ్యానికి మధ్య పెద్ద అంతరాన్ని సృష్టిస్తుంది. నెలవారీ ఈఎంఐ చిన్నదిగా కనిపించినా మొత్తం ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ కుటుంబం ఆ రుణాన్ని సౌకర్యంగా చెల్లించగలదా అనేది ముందుగా ఆలోచించాలి.
Also Read: ఇథనాల్ లేని పెట్రోల్ కావాలా? ఏ స్టేషన్‌లో లభిస్తుందో చూపించే యాప్ ఇదిగో
నేటి వినియోగదారుల సంస్కృతిలో ఖరీదైన వస్తువులు వ్యక్తిగత గుర్తింపుతో ముడిపడుతున్నాయి. ముఖ్యంగా జెన్ జీ యువత దృష్టిలో ప్రీమియం ఫోన్లు ప్రతిష్టకు గుర్తులుగా మారుతున్నాయి. సోషల్ మీడియా కొత్త మోడళ్లను కొనుగోలు చేయాలనే కోరికను మరింత పెంచుతుంది. ఆర్థిక సమస్యలు ఒత్తిడి, ఆందోళన, కుటుంబ కలహాలకు ఈఎంఐలు దారితీసే అవకాశం ఉంది. అందువల్ల కుటుంబ సభ్యులు డబ్బు విషయాలపై బహిరంగంగా మాట్లాడాలి. ఫైనాన్సింగ్ తీసుకునే ముందు తమ ఆర్థిక సామర్థ్యాన్ని పరిశీలించాలి. పిల్లలకు తమ ఆర్థిక పరిస్థితి గురించి తల్లిదండ్రులు చెప్పాలి.
Also Read: ఎంత సంపాదిస్తే భారతీయులు సంతృప్తిగా ఉంటారు? డబ్బు, సంతోషం మధ్య లింక్ ఉందా?
సరైన విధంగా ఉపయోగిస్తే రుణ సౌకర్యం వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, సులభంగా లభించే ఫైనాన్సింగ్ ఆర్థిక ప్రణాళికకు ప్రత్యామ్నాయం కాదు. ఈఎంఐ తీసుకునే ముందు తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కించాలి. ఇప్పటికే ఉన్న రుణాలు, పొదుపులు, అత్యవసర ఖర్చులను కూడా పరిశీలించాలి. తాత్కాలిక ఆనందం కోసం ఆర్థిక స్థిరత్వాన్ని ప్రమాదంలో పెట్టకూడదు.
ఖరీదైన ఫోన్ కొంతకాలం ఆనందాన్ని ఇస్తుంది. కానీ రుణం దీర్ఘకాలిక ఒత్తిడిని కలిగిస్తుంది. కుటుంబాలు సామాజిక ఒత్తిడి కంటే ఆర్థిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే ఈ సమస్యకు పరిష్కారమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.