Cow Dung Products: త్రిపురలోని ఖొవై జిల్లా పశ్చిమ సోనాతలా గ్రామానికి చెందిన లిపి భౌమిక్ అనే గ్రామీణ మహిళ తన సృజనాత్మకతతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఎండిన ఆవు పేడతో కేవలం సాధారణ పనులకే పరిమి పూజా మందిరాలు, ఇళ్ల అలంకరణకు ఉపయోగపడే అద్భుతమైన వస్తువులను తయారు చేస్తూ విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా నిలుస్తున్నారు. తద్వారా ఎందరో మహిళలకు ప్రేరణగా నిలుస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
సాధారణంగా ఆవు పేడను ఇళ్లు అలికేందుకు. పిడకల తయారీకి వాడుతుంటారు. కానీ లిపి భౌమిక్ మాత్రం దానితో సరికొత్త ప్రయోగాలు చేశారు. ఎండిన ఆవు పేడను శుభ్రం చేసి, ఆకర్షణీయమైన వస్తువులుగా మలుస్తున్నారు. ఫోల్డర్లు (Folders), దేవుని విగ్రహాలు (Idols), మట్టి దీపాలను ఆవు పేడతో చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తన సృజనాత్మకతను వ్యాపారంగా మార్చుకొని.. లాభాలు గడిస్తున్నారు.
లిపి భౌమిక్ ఈ వ్యాపారాన్ని సొంతంగా ప్రారంభించడం అంత ఈజీగా జరగలేదు. ప్రారంభంలో ఆమె ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే ‘త్రిపుర రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్’ (TRLM) ద్వారా రూ. 5.10 లక్షల ఆర్థిక సహాయం అందండ ఆమెకు కొండంత శక్తిని ఇచ్చింది. ప్రభుత్వ సహకారంతో ఆమె వ్యాపారానికి బలమైన పునాది పడింది.
లిపి భౌమిక్ వ్యాపార పురోగతిని చూసేందుకు TRLM చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరిత్ కాంతి చక్మా, పలువురు సీనియర్ అధికారులు నేరుగా ఆమె యూనిట్‌ను సందర్శించారు. లిపి భౌమిక్ నైపుణ్యం, పట్టుదల, పర్యావరణహిత జీవనోపాధి వైపు ఆమె వేస్తున్న అడుగులను చూసి అధికారులు అభినందించారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి లిపి భౌమిక్ ప్రయాణం ఎంతో ప్రేరణగా నిలుస్తుందని వారు ప్రశంసించారు.
లిపి భౌమిక్ ఈ వ్యాపారానికే పరిమితం కాకుండా సమాజానికి సైతం తన వంతు బాధ్యతగా సేవ చేస్తున్నారు. ఆమె ‘లోక్‌నాథ్ సెల్ఫ్-హెల్ప్ గ్రూప్’ (SHG) లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు. అదే సమయంలో ‘కృషి సఖి’గా వ్యవసాయ రంగానికి కూడా తన సేవలను అందిస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా తోటి మహిళలను చైతన్యం చేస్తూ వ్యవసాయాభివృద్ధిలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.
Also Read: భార్యాభర్తల అద్భుత ఆలోచన.. మట్టి లేకుండానే కుంకుమపువ్వు సాగు.. నెలకు రూ. 4 లక్షల సంపాదన!
పల్లెల్లో సులభంగా లభించే ఆవు పేడను తన వ్యాపారానికి ముడి సరుకుగా మలుచుకొని లిపి భౌమిక్ చక్కటి ఉపాధిని సృష్టించుకున్నారు. ఈమె కృషిని గుర్తించిన ప్రభుత్వం ఆమెను ‘లక్షపతి దీది’గా గౌరవించింది. ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే ప్రతి గ్రామీణ మహిళకు లిపి భౌమిక్ ప్రయాణం ఒక గొప్ప స్ఫూర్తిదాయకమని ప్రశంసల జల్లు కురిపించింది.
Also Read: సిటీ ఎందుకు మామ.. పల్లెల్లో ఉంటూ రూ.లక్షల్లో సంపాదించొచ్చు.. ఈ వ్యాపారాలు ట్రై చేయ్!