Vande Bharat Express Interesting Facts: భారతీయ రైల్వేలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. వేగం, అత్యాధునిక సాంకేతికత, ప్రయాణికులకు అందించే సౌకర్యాలతో ఈ రైళ్లు దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అయితే, వందే భారత్ రైళ్లలో చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అసలు ఈ రైలు ఎలా తయారైంది? సాధారణ రైళ్లకు దీనికి మధ్య తేడా ఏంటి? దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
సాధారణ రైళ్లకు ముందు లేదంటే వెనుక ప్రత్యేక ఇంజిన్ ఉంటుంది. కానీ, వందే భారత్ రైళ్లలో అలా ఉండదు. వీటిని ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU) టెక్నాలజీతో రూపొందించారు. అంటే, రైలులోని పలు కోచ్‌లకు మోటార్లు అమర్చబడి ఉంటాయి. దీనివల్ల రైలు వేగంగా ప్రయాణించడంతో పాటు త్వరగా వేగాన్నిపెంచుకుంటుంది. కేవలం 52 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుంది.
వందే భారత్ రైలు మొదట్లో ట్రైన్ 18 పేరుతో రూపొందింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఈ రైలును తయారు చేసింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేవలం 18 నెలల్లోనే దీని రూపకల్పన, తయారీ పూర్తయ్యాయి. అందుకే, మొదట దీనికి ట్రైన్ 18 అనే పేరు వచ్చింది.
వందే భారత్ రైలు భారతీయ రైల్వే టెక్నాలజీ సత్తాకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ICF మాజీ జనరల్ మేనేజర్ డాక్టర్ సుధాన్షు మణి నేతృత్వంలో ఈ ప్రాజెక్టు ముందుకు సాగింది. విదేశాలపై ఆధారపడకుండా దేశంలోనే ఆధునిక రైళ్లను తయారు చేయవచ్చని ఈ ప్రాజెక్టు నిరూపించింది.
ప్రయాణికుల భద్రత కోసం వందే భారత్ రైళ్లలో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భారతదేశంలోనే అభివృద్ధి చేసిన ‘కవచ్’ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థను అమర్చారు. రైలు సిగ్నళ్లను దాటడం, ఎదురెదురుగా రైళ్లు రావడం లాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఢీకొనే అవకాశాన్ని తగ్గించడంలో ఇది సాయపడుతుంది.
వందే భారత్ రైళ్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ ఉంది. సాధారణంగా రైలు బ్రేకులు వేసినప్పుడు కొంత పవర్ వేస్ట్ అవుతుంది. కానీ, ఈ వ్యవస్థలో బ్రేకింగ్ సమయంలో ఉత్పత్తయ్యే శక్తిని తిరిగి విద్యుత్ రూపంలోకి మార్చి ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లకు పంపిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల 30 నుంచి 35 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది.
వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సౌండ్, జర్క్ లు తగ్గించేలా సౌండ్ ప్రూఫ్ విండోలు, సీల్డ్ గ్యాంగ్‌వేలను ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, వై-ఫై, బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ ఆధారిత వాటర్ ట్యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 180 డిగ్రీల వరకు తిరిగే సీట్లు మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
వందే భారత్ రైళ్లు మొదట తెలుపు, నీలం రంగుల కలయికతో అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆ తర్వాత రైల్వేశాఖ కాషాయ రంగు వందే భారత్ రైళ్లను కూడా ప్రవేశపెట్టింది. దీంతో ఈ రైళ్లకు కొత్త రూపం వచ్చింది.
మొదట సీటింగ్ సౌకర్యంతో పగటి ప్రయాణాలకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటికి వచ్చిన ఆదరణతో సుదూర ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అభివృద్ధి చేశారు. రాత్రిపూట ప్రయాణించే వారికి ఏసీ బెర్తులు, ఆధునిక సౌకర్యాలు అందిస్తున్నాయి.
Read Also: భారత్‌లో ఫాస్టెస్ట్, స్లోయెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలుసా?