HR Professional Layoff| ఒక కంపెనీలో ఉద్యోగులను తొలగించే బాధ్యత మీదే ఉందనుకోండి. ఆ సమయంలో వారి బాధను అర్థం చేసుకుంటూ, వారికి ఇకపై కంపెనీలో చోటు లేదని చెప్పాల్సి వస్తుంది. అలాంటి కఠినమైన పని చేసిన వ్యక్తికి కంపెనీ ప్రమోషన్ ఇస్తే ఎలా ఉంటుంది? తన పనికి గుర్తింపు లభించిందని అతడు సంతోషిస్తాడు. కానీ కొన్ని నెలల తరువాత అదే కంపెనీ ఆ యాక్టివ్ ఉద్యోగికి ఊహించని షాకిచ్చింది.
అమెరికాకు చెందిన HR నిపుణుడు బాబీ పవర్స్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇతర ఉద్యోగుల తొలగింపులను పర్యవేక్షించిన ఆయనకు మొదట ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత కొద్ది నెలలకే కంపెనీ ఆయనను కూడా సాగనంపింది. ఈ అనుభవం ఉద్యోగ భద్రతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది.
బాబీ పవర్స్ తన అనుభవాన్ని బిజినెస్ ఇన్‌సైడర్‌తో షేర్ చేశారు. కంపెనీ భారీగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియను నిర్వహించే బాధ్యతను కంపెనీ బాస్ ఆయనకు అప్పగించారు.
ఉద్యోగులను తొలగించే సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. తమకు అలాంటి పరిస్థితి ఎదురైతే కంపెనీ ఎలా వ్యవహరించాలని కోరుకుంటామో ఆలోచించారు. ఇతర కంపెనీల్లో జరిగిన తప్పులను కూడా పరిశీలించారు.
అయితే ఎవరిని కొనసాగించాలి, ఎవరిని తొలగించాలి అనే నిర్ణయం చాలా కష్టంగా మారింది. కంపెనీకి ఏ విభాగాల్లో ఉద్యోగులు అవసరమో గుర్తించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ తనను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని పవర్స్ చెప్పారు.
Also Read: ఉద్యోగానికి దరఖాస్తు చేయనే లేదు.. విద్యార్థికి రూ.50 లక్షలు జీతం ఇస్తామని రెండు కంపెనీ ఆఫర్లు
ఉద్యోగులకు ఫోన్ చేసి తొలగింపు విషయం చెప్పడం తన జీవితంలో అత్యంత కష్టమైన సంభాషణల్లో ఒకటని ఆయన తెలిపారు. కొందరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు ఇటీవలే ఇల్లు కొనుగోలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో వారికి ఉద్యోగం లేదని చెప్పడం చాలా బాధ కలిగించింది. ఉద్యోగం కోల్పోతే వారి కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆయనకు తెలుసు.
కంపెనీలో తొలగింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత బాబీ పవర్స్‌కు ప్రమోషన్ వచ్చింది. ఆయన జీతం కూడా పెరిగింది. దీంతో కంపెనీ తన పనితీరుని గుర్తించిందని భావించారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. సుమారు నెల రోజుల తర్వాత లాస్ వెగాస్‌లో జరిగిన లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్‌కు ఆయన వెళ్లారు. అక్కడ ఉండగానే బాస్ నుంచి ఫోన్ వచ్చింది.
Also Read: చాణక్య నీతి.. ఒక వ్యక్తి నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఈ 5 లక్షణాలు గమనించండి
కంపెనీ మరోసారి ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిందని బాస్ చెప్పారు. ఈసారి ఆ తొలగింపుల్లో అతడిని కూడా తొలగించబోతున్నామని బాస్ తెలిపారు. తొలగింపుల రోజు ఉదయం పవర్స్ తన ఈమెయిల్ తెరవడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే కంపెనీ ఆయన యాక్సెస్‌ను నిలిపివేసింది. సహోద్యోగులకు వీడ్కోలు చెప్పే అవకాశం కూడా ఆయనకు దక్కలేదు.
ఉద్యోగులను తొలగించే బాధ్యతను నిర్వహించినప్పుడు ఒక అనుభవం ఎదురైందని, ఉద్యోగం కోల్పోయినప్పుడు మరో అనుభవం కలిగిందని పవర్స్ తెలిపారు. ఈ రెండు పరిస్థితులు ఉద్యోగుల బాధను మరింత అర్థం చేసుకునేలా చేశాయి.
సోషల్ మీడియాలో ఉద్యోగం కోల్పోయినవారి గురించి చూసినప్పుడు గతంలోలా తొందరగా అభిప్రాయాలు ఏర్పరచుకోవడం లేదన్నారు. ఉద్యోగం కోల్పోవడం వెనుక ఎన్నో వ్యక్తిగత, ఆర్థిక కారణాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.