Gold Quality: దేశంలో రోజురోజుకీ బంగారం ధరలు భారీగా పెరిగి పోతున్నాయి. భారతదేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా మగువలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పెరుగుతున్న రేట్లను చూస్తుంటే.. ప్రస్తుతం బంగారం కొనాలంటే సామాన్యుడికి భారంగా మారింది. దీంతో కొందరు ఫేక్ బంగారంతో తెగ మోసాలకు పాల్పడుతున్నారు. బంగారం ఆభరణాలపై స్వచ్ఛత ప్రమాణాలు పాటించకుండా మార్కెట్లో అమ్ముతున్నారు. స్వచ్ఛత ప్రమాణాలకు పాటించే హాల్ మార్క్‌ను వాడకుండా విక్రయాలు కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తులం బంగారానికి కొనాలంటే రూ.లక్ష ఖర్చు చేయాల్సిందే. మేకింగ్ చార్జీలు, జీఎస్టీ వంటి అన్ని చెల్లిస్తే.. రూ.లక్ష ఖర్చు అవుతోంది. అయితే మనం బంగారం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత ప్రమాణాలను కాస్త జాగ్రత్తగా చూడాలి. గోల్డ్ క్వాలిటీని క్యారెట్లలో కొలుస్తారు. గోల్డ్ స్వచ్ఛతను బట్టి క్యారెట్లను నిర్ణయిస్తారు. ఇందులో 24, 22, 18 క్యారెట్ల బంగారం ణాణ్యతలు ఉంటాయి. ఇప్పుడు మనం గోల్డ్ నాణ్యత ప్రమాణాల గురించి తెలుసుకుందాం.
24 క్యారెట్ బంగారం:
గోల్డ్‌లో చాలా నాణ్యత ఉన్నదానిని 24 క్యారెట్ల బంగారం అంటారు. ఇందులో స్వచ్ఛమైన బంగారం ఉంది. హైక్వాలిటీ బంగారంగా దీన్ని నిర్దారిస్తారు. దీనిలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అయితే ఈ బంగారాన్ని తయారుచేయడం కష్టమైన పని. ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది. ఈ 24 క్యారెట్ల బంగారంతో బిస్కెట్ కాయిన్స్ కడ్డీలను తయారు చేస్తారు. వీటిని కేవలం పెట్టుబడి కోసం మాత్రమే విక్రయిస్తుంటారు. దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
22 క్యారెట్ల బంగారం:
మేలిమి బంగారంలో కొంచెం రాగి లేదా ఇతర లోహాలు కలిపి ఆర్నమెంట్ బంగారాన్ని తయారు చేస్తారు. ఇది 24 క్యారెట్ బంగారంతో పోలిస్తే కాస్త గట్టిగా, దృడంగా ఉంటుంది. దీనిలో 91.6 శాతం బంగారం స్వచ్ఛత కలిగి ఉంటుంది. అందుకే దీన్ని 22 క్యారెట్ బంగారం అని పిలుస్తారు. ఆభరణాల తయారీకి దీన్ని వాడుతారు. మామూలుగా అందరూ ధరించే బంగారం ఇదే. మీరు బ్యాంకులో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాలంటే.. 22 క్యారెట్ బంగారం మాత్రమే పెట్టగలరు. సాధారణంగా మార్కెట్లో 22 క్యారెట్ల బంగారాన్నే అమ్ముతారు. భారతదేశంలో ఈ రకం బంగారం అత్యంత ప్రజాదరణ పొందినది.
18 క్యారెట్ల బంగారం:
ఇందులో 25 శాతం ఇతర లోహలు ఉంటాయి. 75 శాతం గోల్డ్ ఉంటుంది. దీన్ని వైట్ గోల్డ్ గా కూడా పిలుస్తుంటారు. ఇందులో బంగారం మెరుపు చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని చూడగానే 18 క్యారెట్ల బంగారమని గుర్తు పట్టొచ్చు. 22 క్యారెట్ గోల్డ్ తో పోలిస్తే దీని ధర చాలా తక్కువ.
14 క్యారెట్ల బంగారం:
ఇది తక్కువ నాణ్యత గల బంగారం. దీనిలో 58.33% స్వచ్ఛమైన బంగారం కలిగి ఉంటుంది. ఇది ఆభరణాలకు చాలా బలంగా, ధరలో తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా వినియోగంలో ఉంది.
10 క్యారెట్ల బంగారం:
ఇది చాలా తక్కువ నాణ్యత గల బంగారం. దీనిలో 41.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.ఖరీదైన ఆభరణాల కంటే సాధారణ వస్తువుల తయారీకి దీనిని ఉపయోగిస్తుంటారు. దీని ధర తక్కువగా ఉంటుంది.
ALSO READ: Diamond Mining: మన స్వర్ణాంధ్రలో భారీగా వజ్రాలు.. దొరికితే కోటీశ్వరులే.. ఎక్కడో తెల్సా?
నకిలీ బంగారాన్ని గుర్తించడానికి హాల్ మార్క్ ముద్ర చాలా యూజ్ అవుతోంది. నాణ్యత గల బంగారంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. ఇది బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది. హాల్ మార్క్ బంగారాన్ని మాత్రమే కొనాలి. గోల్డ్ క్వాలిటీ, సెలెక్షన్, బడ్జెట్, డిజైన్ బట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తారు. 22 క్యారెట్, 18 క్యారెట్ బంగారం భారతదేశంలో ఎక్కువ ప్రజాధారణ పొందాయి. అయితే పెట్టుబడి కోసం మాత్రం 24 క్యారెట్ బంగారాని వినియోగిస్తారు.