Minister Nirmala: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల అంశం వేడెక్కింది. కొన్ని సంస్థలకు అనుకూలంగా ఈ బిల్లు తెచ్చిందని విపక్షాలు తెరపైకి కొత్త అంశాన్ని తెచ్చాయి. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. దీని ప్రభావం వ్యాపారులకేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మళ్లీ ఏటీఎంలు పుట్టుకు రావచ్చనే ప్రచారం ఊపందుకుంది.
దేశంలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించి మరో అడుగు ముందుకేసింది కేంద్రం. యూపీఐ ద్వారా జరిగే కొన్ని డిజిటల్ చెల్లింపులపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్-MDR విధించేందుకు వీలు కల్పించే అవకాశం ఉన్న సవరణ బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో ఈ బిల్లు ఇంకా పాస్ కావాలి. ఈ బిల్లుపై రకరకాల వార్తల నేపథ్యంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభ ఆమోదించిన కొత్త సవరణల వల్ల వినియోగదారులు-కొనుగోలుదారులపై ఎలాంటి ఛార్జీల భారం పడదన్నారు.
2020 నుంచి అమలులో ఉన్న జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్-Zero-MDR నిబంధనను సవరించేందుకు ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఒకవేళ రుసుము విధించినా డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులపై ఉంటుందన్నారు. సామాన్యులపై ఎలాంటి భారం పడదన్నారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు UPI లావాదేవీలను ప్రాసెస్ చేయడం ద్వారా సంపాదించవన్నారు. దీనిద్వారా వచ్చే ఆదాయాన్ని డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలను చూసే బ్యాంకులు-పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు తమ మౌలిక సదుపాయాలు, భద్రత, సాంకేతికతను ఆధునీకరించేందుకు ఉపయోగ పడుతుందన్నారు.
యూపీఐ ఛార్జీల విధానంపై తుది నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI కమిటీ త్వరలో వెల్లడిస్తుందన్నారు నిర్మలా సీతారామన్. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007లోని సెక్షన్ 10Aలోని టాక్సేషన్ అండ్ అదర్ లాస్ సవరణ బిల్లు-2026 ను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఈ నిర్ణయం జరుగుతుందన్నారు. UPIపై MDR ఫీజు ఎలా ఉంటుందనే దానిపై ప్రభుత్వం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. రెండు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులకు రూ. 2,000 దాటిన UPI లావాదేవీలపై 0.3 శాతం నుండి 0.5 శాతం వరకు MDR విధించవచ్చన్నది మొదటి పాయింట్. రూ. 2,000 పైబడిన UPI లావాదేవీల్లో కేవలం 5 శాతం మాత్రమే అయినప్పటికీ, మొత్తం లావాదేవీ విలువలో 65 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మరో ప్రతిపాదన ఏమిటంటే.. రుసుమును వ్యక్తిగత లావాదేవీల విలువకు బదులుగా వ్యాపారి వార్షిక టర్నోవర్‌కు అనుసంధానించడం, ప్రభుత్వం వసూలు చేసే మొత్తంపై గరిష్ట పరిమితి విధించే అవకాశం.
MDR రుసుముల వల్ల చిన్ని షాపులు, రిటైలర్ల కంటే ఎక్కువగా పెద్ద వ్యాపారాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే డిస్కౌంట్లకు ఎండ్ కార్డు పడనుంది. ఈ విషయంలో వినియోగదారులపై నేరుగా ఛార్జీ విధించే అవకాశం లేదు. బిల్లులు చెల్లించడానికి, కిరాణా సామాను కొనడం క్యాబ్ రైడ్‌లను బుక్ చేసుకోవడం వంటి పనులకు UPIని ఉపయోగిస్తుంటే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారులు ఇప్పటికే కార్డ్ చెల్లింపులపై ఛార్జీలు చెల్లిస్తున్నారు.
ALSO READ: షాకిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ మార్కెట్లో రేట్ల మాటేంటి?
క్రెడిట్ కార్డులకు MDR సాధారణంగా 1.5 శాతం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 3 శాతం వరకు ఉండవచ్చు, డెబిట్ కార్డ్ చెల్లింపులకు తక్కువ రుసుములు ఉంటాయి. వ్యాపారులు ఎప్పుడూ తమ మీద భారం వేసుకోరు. అది కోనుగోలుదారులపై వేస్తారు. యూపీఐ లావాదేవీపై ఛార్జీలు ఉపయోగిస్తారన్న విషయం తెలియగానే చాలామంది చిన్న చిన్న షాపులు ఆన్‌లైన్ పేమెంట్‌కు నిరాకరించారు. కేవలం మనీ మాత్రమే అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మళ్లీ మనుపటి మాదిరిగా ఏటీఎంలు రావచ్చని ప్రచారం లేకపోలేదు.
Before spreading a canard, @Jairam_Ramesh ji, please consider this:
1. Merchant Discount Rate (MDR) applies only on the merchants and not on the end users/customers. It will support the Banks & Fintech to invest more on infrastructure, innovation & security. All users of UPI… https://t.co/sleUX4ztWe— Nirmala Sitharaman (@nsitharaman) August 6, 2026