Smartphone Speed Tips: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఏ పని జరగడం లేదు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నిత్యం ఏదో ఒక రూపంలో ఫోన్ వాడుతూనే ఉన్నారు. అయితే కొన్ని నెలలు వాడిన తర్వాత చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య.. ఫోన్ స్లో కావడం. టచ్ స్పందించకపోవడం, యాప్స్ ఆలస్యంగా ఓపెన్ కావడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి ‘క్లీనర్’ లేదా ‘బూస్టర్’ యాప్స్ ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారానే ఆండ్రాయిడ్ వేగాన్ని పెంచుకోవచ్చు. ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది రోజూ ఫోన్ వాడతారు కానీ ఎప్పటికోగానీ రీస్టార్ట్ చేయరు. ఫోన్‌ను వారానికి కనీసం ఒక్కసారైనా రీస్టార్ట్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అనవసరమైన ప్రాసెస్‌లన్నీ క్లోజ్ అవుతాయి. ర్యామ్ క్లియర్ అయి ఫోన్ మళ్లీ ఫ్రెష్‌గా, వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుంది.
చాలా మంది ఫోన్లలో అవసరం లేకపోయినా ఎన్నో యాప్స్ ఉంటాయి. ఇవి స్టోరేజ్ ఆక్రమించడమే కాకుండా, బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను, ర్యామ్‌ను వాడుకుంటూ ఫోన్‌ను స్లో చేస్తాయి. అందుకే క్రమం తప్పకుండా ఫోన్‌ని చెక్ చేసి, అసలు ఉపయోగించని యాప్‌లను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
ఏదైనా యాప్ వాడేటప్పుడు ఫోన్ కొంత తాత్కాలిక డేటాను (Cache) దాచుకుంటుంది. కాలక్రమేణా ఈ క్యాచీ డేటా జీబీల్లోకి చేరి స్టోరేజ్‌ను నింపేస్తుంది. దీనివల్ల ఫోన్ పనితీరు మందగిస్తుంది. కాబట్టి ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ ఫీచర్ ద్వారా తరచూ వాడే యాప్‌ల క్యాచీ క్లియర్ చేస్తూ ఉండాలి.
ఆండ్రాయిడ్ ఫోన్లలో యానిమేషన్స్ వల్ల స్క్రీన్ స్వైప్ చేసినప్పుడు, యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు అందంగా కనిపిస్తాయి. కానీ ఇవే ఫోన్‌ను కాస్త స్లోగా మార్చుతాయి. ఫోన్ సెట్టింగ్స్‌లో ‘డెవలపర్ ఆప్షన్స్’ ఆన్ చేసి, అందులో ఉన్న విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్లను 1x నుండి 0.5xకి తగ్గించండి. ఇలా చేస్తే ఫోన్ రెస్పాన్స్ టైమ్ చాలా వేగంగా మారుతుంది.
హోమ్ స్క్రీన్ నిండా విడ్జెట్‌లు (Widgets), లైవ్ వాల్‌పేపర్లు పెట్టుకోవడం వల్ల చూడటానికి బాగున్నా.. అవి ప్రాసెసర్, బ్యాటరీపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కాబట్టి లైవ్ వాల్‌పేపర్‌ల స్థానంలో సాధారణ ఇమేజ్‌లను వాడండి. అలాగే అవసరం లేని విడ్జెట్లను తొలగిస్తే ఫోన్ స్పీడ్ పెరుగుతుంది.
ఫోన్ ఇంటర్నల్ మెమరీ 80 నుండి 90 శాతానికి పైగా నిండిపోతే ఫోన్ పనితీరు దారుణంగా పడిపోతుంది. అందుకే అనవసరమైన ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ మీడియా ఫైళ్లను డిలీట్ చేయండి. లేదంటే గూగుల్ డ్రైవ్/క్లౌడ్‌లోకి మూవ్ చేసుకోండి. ఇంటర్నల్ స్టోరేజ్‌లో కనీసం 15-20 శాతం ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవడం మంచిది.
Also Read: Airtel రూ.999 ఫ్యామిలీ ప్లాన్.. కాల్స్, అపరిమిత డేటాతో పాటు.. ఫ్రీగా యాపిల్ కంటెంట్, ఓటీటీలు!
మెుబైల్ కంపెనీలు ఇచ్చే సిస్టమ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్ స్టాల్ చేస్తూ ఉండాలి. ఈ అప్‌డేట్స్‌లో కేవలం కొత్త ఫీచర్లు మాత్రమే కాకుండా సిస్టమ్ పనితీరును మెరుగుపరిచే బగ్ ఫిక్సెస్ కూడా ఉంటాయి. ఫోన్ సాఫ్ట్‌వేర్.. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటే పాత సమస్యలన్నీ తొలగిపోయి ఫోన్ స్మూత్‌గా రన్ అవుతుంది.
Also Read: బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!