No UPI Day: యూపీఐ ఛార్జీలపై విషయంలో ఏమాత్రం దిగిరానుంటోంది కేంద్రం. ఈ విషయంలో ఆర్థికమంత్రి స్వయంగా చెప్పేశారు. దీంతో వర్తకులు, వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పరిస్థితి గమనించిన ఆ వర్గాలు తమ తడాఖా చూపించాలని నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబర్ 2న అనగా గాంధీ జయంతి రోజున నో యూపీఐ డే పాటించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆ రోజు షాపుల్లోని క్యూఆర్ కోడ్స్ పని చేయవు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం UPI లావాదేవీలపై MDR ఛార్జీలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి వ్యాపార సంఘాలు. దీనిపై పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో అక్టోబర్ 2 అనగా గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా నో యూపీఐ డే పాటించాలని నిర్ణయించాయి. వ్యాపారులు UPI చెల్లింపులను స్వీకరించరు. QR కోడ్‌లను నల్లటి వస్త్రంతో కప్పనున్నారు. మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్-ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ ఈ నిరసనకు పిలుపు ఇచ్చాయి. రూ. 2,000 పైబడిన లావాదేవీలపై విధించే 0.4 శాతం ఛార్జీకి నిరసనగా వ్యాపార సంఘాలు యూపీఐ రహిత దినంను పాటిస్తున్నట్లు ప్రకటించాయి.
మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం అక్టోబర్ 15 నుంచి వ్యాపారులు రూ. 2 వేలు దాటిన యూపీఐ చెల్లింపులు కస్టమర్ల నుంచి స్వీకరించినప్పుడు 0.4 శాతం ఛార్జీలు చెల్లించాలి. గరిష్టంగా ట్రాన్సాక్షన్ పై రూ.300గా నిర్ణయించింది. వ్యక్తుల మధ్య జరిగే పేమెంట్స్, రూ.2000 లోపు విలువైన మర్చంట్ లావాదేవీలు యథావిధిగా ఉచితంగా జరగనున్నాయి. నెలకు లక్ష వరకు ఆదాయం పొందే చిన్న వ్యాపారుల లావాదేవీలను పర్సన్-టు-పర్సన్-మర్చంట్ కింద మినహాయింపు ఇచ్చింది.
కొత్త యూపీఐ చార్జీలు ఆర్థిక భారాన్ని మోపుతాయని వ్యాపారులు చెబుతున్నమాట. చిల్లర వ్యాపారులు, పంపిణీదారులు చాలా తక్కువ లాభాలతో పని చేస్తారని అన్నారు ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్. డిజిటల్ లావాదేవీలపై అదనపు ఛార్జీ విధించడం వల్ల వ్యాపార నిర్వహణ ఖర్చు పెరుగుతుందన్నారు. డిజిటల్ చెల్లింపుల ఉద్దేశ్యం ప్రక్రియను సులభతరం చేయడం మంచిదేకానీ, అదే సమయంలో వ్యాపారులపై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. వ్యవస్థను పారదర్శకంగా మార్చడంలో వ్యాపారులు సహకరిస్తున్నప్పుడు, వారిపై ఛార్జీలు విధించడం నిజాయితీ గల వ్యాపారులను ఆర్థికంగా శిక్షించడమే అవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ALSO READ: స్టాక్ మార్కెట్ భారీ పతనం.. చివరిలో విదేశీ మదుపరులు అమ్మకాలు, అసలు కారణాలు ఇవే
యూపీఐ ఛార్జీల నుంచి తమకు మినహాయించాలని పెట్రోల్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పెట్రోలియం శాఖ అధికారులు ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ చర్చలు జరిపారు. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై 0.02 శాతం ఎండీఆర్ విధించడంపై స్టాక్ బ్రోకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డిమాండ్లను పరిశీలిస్తామని సెబీ ఛైర్మన్ తెలిపారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న యూపీఐ ఛార్జీలను ఉపసంహరించకుంటే భవిష్యత్తులో ఉధృతమైన నిరసనలు చేపడతామని ట్రేడర్ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.