UPI PAYMENTS NO PIN| దేశంలో గత కొన్ని సంవత్సరాలలో UPI డిజిటల్ చెల్లింపులు ప్రజల జీవితాన్ని మార్చేశాయి. చాయ్ కొనడం నుండి కిరాణా సామాన్ల వరకు, డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వసాధారణం. ఇప్పుడు ఈ ప్రక్రియ మరింత సులభం కాబోతోంది. ఇకపై PIN అవసరం లేకుండానే చెల్లింపులు సాధ్యమైతే ఎలా ఉంటుందో ఊహించండి. అవును త్వరలోనే ఇది సాధ్యమవుతుంది!
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI చెల్లింపులను బయోమెట్రిక్ పద్ధతులతో ధృవీకరించే పనిలో ఉంది. అంటే, మీ వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు (ఫేస్ ఐడీ) ద్వారా చెల్లింపులు చేయవచ్చు. PIN టైప్ చేయాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుతం, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, BHIM వంటి యాప్‌లలో చెల్లింపు చేయడానికి 4 లేదా 6 అంకెల PIN నమోదు చేయాలి. ఇది ఒక ముఖ్యమైన సెక్యూరిటీ లేయర్. కానీ ఈ కొత్త బయోమెట్రిక్ పద్ధతితో, మీ వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు అదే సెక్యూరిటీని, మరింత వేగంగా అందిస్తుంది.
అయితే ఈ బయోమెట్రిక్ ఆప్షనల్ మాత్రమే తప్పనిసరి కాదు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఇది ఐచ్ఛికంగా అందుబాటులో ఉంటుంది. అంటే, మీరు PINతో కొనసాగవచ్చు లేదా బయోమెట్రిక్ వేలిముద్ర/ముఖ గుర్తింపును ఎంచుకోవచ్చు. ఈ సౌలభ్యం యూజర్లకు ఎంపిక స్వేచ్ఛను ఇస్తుంది.
NPCI ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. అయినప్పటికీ, ఈ మార్పు ఒక పెద్ద అడుగు కావచ్చు, ముఖ్యంగా వృద్ధులు లేదా PINలను గుర్తుంచుకోవడం కష్టంగా భావించే వారికి. బయోమెట్రిక్ ధృవీకరణ ఉపయోగపడుతుంది. పైగా ఇది సెక్యూరిటీని కూడా మెరుగుపరుస్తుంది.
ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
మీరు QR కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు, PIN నమోదు చేయడానికి బదులుగా, మీ ఫోన్ మిమ్మల్ని వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరించమని అడుగుతుంది. మీ బయోమెట్రిక్ డేటా.. ఆధార్‌తో లింక్ అయి ఉంటుంది, ఇది NPCI ప్లాట్‌ఫామ్ ద్వారా మీ బ్యాంక్ ఖాతాకు సురక్షితంగా కనెక్ట్ అవుతుంది. డేటా ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుంది. అనధికార యాక్సెస్ నిరోధిస్తుంది.
ఈ ఫీచర్ అమలులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు, POS యంత్రాలు బయోమెట్రిక్ సెన్సార్‌లను సపోర్ట్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్యలు సవాళ్లుగా ఉండవచ్చు. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలతో కలిసి NPCI ఈ విధానాన్ని పైలట్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. ఈ ఫీచర్ మొదట ఆధార్-ఆధారిత యాప్‌లలో, తర్వాత గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్‌లలో అందుబాటులోకి రావచ్చు.
అయితే కొత్త విధానంలో బయోమెట్రిక్ డేటా గోప్యత గురించి కొంతమంది ఆందోళనలు వ్యక్తం చేశారు. ఒకసారి బయోమెట్రిక్ డేటా లీక్ అయితే, PIN లాగా మార్చలేము. అందుకే NPCI బలమైన ఎన్‌క్రిప్షన్, డేటా రక్షణ చర్యలను అమలు చేస్తోంది. డేటా.. మీ డివైస్‌లోనే సురక్షితంగా ఉంటుంది, బ్యాంకులకు పంపబడదు.
Also Read: Google Pixel 6A: ఫోన్ అప్డేట్ చేసిన కాసేపటికే మంటలు.. గూగుల్ పిక్సెల్ 6Aతో జాగ్రత్త!
ఈ మార్పు UPIని మరింత సులభం, సురక్షితం చేస్తుంది. మీ తదుపరి చెల్లింపు కేవలం ఫోన్‌ను చూడటం లేదా వేలిముద్ర వేయడం ద్వారా పూర్తవుతుంది. ఈ టెక్నాలజీ.. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.