Vande Bharat Sleeper Trains: వందే భారత్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలుత 8 కోచ్ లతో అందుబాటులోకి వచ్చిన రైళ్లు, ఆ తర్వాత 16 కోచ్ లకు పెరిగాయి. రీసెంట్ గా 20 కోచ్ ల రైళ్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. వీటితో పాటు వందే భారత్ మెట్రో, వందే భారత్ స్లీపర్ ట్రైన్లును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెట్రో ట్రైన్ కు మరికాస్త టైం పట్టేలా ఉన్నా, స్లీపర్ ట్రైన్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కానీ, ఇప్పుడు ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
డిజైన్ మార్పుతో మరింత ఆలస్యం
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వందేభారత్ 24-కోచ్ రైళ్ల కొనుగోలుపై చర్చలు జరుపుతున్నది. ఈ నేపథ్యంలో స్లీపర్ వెర్షన్ ప్రోటో టైప్ పనులు కాస్త నెమ్మదిగా కొనసాగుతున్నాయి. 200 స్లీపర్ వేరియంట్ వందే భారత్ రైళ్ల రోల్ అవుట్ కీలకమైన డిజైన్ సవరణలు, రైలు పొడవు స్పెసిఫికేషన్లపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ రైళ్ల తయారీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 60,000 కోట్లతో పలు కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చింది. సరఫరాతో పాటు నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించింది. 200 స్లీపర్ వందే భారత్ రైళ్ల కాంట్రాక్ట్ 2023లో కైనెట్ రైల్వే సొల్యూషన్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL), టిటాగర్ రైల్ సిస్టమ్స్(TRS)కు ఇచ్చింది. ఏడాది లోగా ప్రోటోటైప్ రైళ్లను ప్రదర్శించాలని ప్రణాళికలు రూపొందించినప్పటికీ, పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 10 స్లీపర్ వేరియంట్ రైళ్లను సరఫరా చేయడానికి BEML, చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)కి ప్రత్యేక కాంట్రాక్టు ఇచ్చింది. వారి ప్రోటోటైప్ కోచ్‌లు ఈ నెల ప్రారంభంలో ప్రదర్శించే అవకాశం ఉంది. పలు రకాల పరీక్షలు తర్వాత మొదటి బ్యాచ్ స్లీపర్ ట్రైన్లను ఈ సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 24 కోచ్‌ల రైళ్లను కొనుగోలు చేసేందుకు రైల్వేశాఖ ఇంట్రెస్ట్ చూపిస్తున్న నేపథ్యంలో స్లీపర్ వందే భారత్ రైళ్ల రాక ఆలస్యం అవుతోంది.
స్లీపర్ వందే భారత్ లో కళ్లు చెదిరే సౌకర్యాలు
వందే భారత్ స్లీపర్ రైల్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే విమానంలో మాదిరిగా స్పెసిలిటీస్ ఉంటాయి. ప్రతి బెర్త్ లో రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ సాకెట్లు, మొబైల్ హోల్డర్, స్నాక్ టేబుల్ ఉంటాయి. ఫస్ట్ ఏసీ ప్రయాణికులు వేడి నీటితో స్నానం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్యాంట్రీ కారులో ఓవెన్లు, బాటిల్ కూలర్లు, డెజర్ట్‌ల కోసం కంపార్ట్ మెంట్లు, బాయిలర్లు, కాంపాక్ట్ డస్ట్ బిన్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కంపార్ట్ మెంట్లను ఫైర్ రెసిస్టెంట్ గా రూపొందిస్తున్నారు. ఆటో మేటిక్ డోర్లును ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల భద్రతను పెంచడానికి క్రాష్ బఫర్లు, కప్లర్ల లాంటి క్రాష్ వర్తీ ఎలిమెంట్స్ ను అమర్చారు. దూర ప్రయాణాలకు ఈ రైలు అత్యంత అనుకూలంగా తీర్చిదిద్దుతున్నారు.
Read Also:ఖాళీగా నడుస్తోన్న సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. రైల్వే షాకింగ్ నిర్ణయం