Vegetable Vendor: అంతా డిజిటల్ యుగం.. డిజిటల్ మయం.. జేబులో నుంచి ఒక్క రూపాయి తీయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకవేళ ఏదైనా వస్తువు కోసం బయటకు వెళ్తే.. ఫోన్ సహాయంలో యూపీఐ-UPI ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. టీ, కూరగాయలు అమ్మేవారు వాటిని స్వీకరిస్తున్నారు. ఆ వ్యవహారమే కూరగాయల షాపువాడికి ఝలక్ ఇచ్చింది. ఏకంగా 29 లక్షలు చెల్లించాలంటూ జీఎస్టీ అధికారులు నోటీసులు పంపారు.
కర్ణాటకలోని హవేరికి చెందిన ఓ చిన్న కూరగాయలు అమ్మేవాడికి పన్ను నోటీసు రావడంతో షాక్ అయ్యాడు. స్థానికంగా మున్సిపల్ హైస్కూల్ మైదానానికి సమీపంలో ఒక చిన్న కూరగాయల దుకాణం నడుపుతున్నాడు శంకర్‌గౌడ. గడిచిన నాలుగేళ్లుగా కూరగాయలు అమ్ముతున్నాడు. అతని కస్టమర్లలో ఎక్కువ మంది UPI లేదా డిజిటల్ వాలెట్ల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు.
నాలుగు సంవత్సరాలలో అతడు రూ. 1.63 కోట్ల లావాదేవీలు చేశాడని, రూ. 29 లక్షల జీఎస్టీ కట్టాలని అధికారులు అతడికి నోటీసు పంపాడు. ఆ నోటీసులు చూసి షాకయ్యాడు కూరగాయలు అమ్మేవాడు.అంతేకాదు వస్తువులు-సేవల పన్ను-GST నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొన్నారు.
అసలు శంకర్ గౌడ రైతుల నుండి నేరుగా కూరగాయలు తీసుకొచ్చి చిన్న దుకాణంలో అమ్ముతాడు. రైతుల నుంచి కొనుగోలు చేసి వాటిని అమ్ముకుంటే వాటిపై GST ఉండదు. వాటిని ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేసి విక్రయిస్తే మాత్రం GST పడుతుంది. తాను ప్రతీ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేస్తానని, రికార్డులను ఉంచానని చెప్పాడు.
ALSO READ: టెక్కీల కంటే డాగ్ వాకర్ బెటర్.. నెల జీతం ఎంతో తెలుసా?
తాను రూ.29 లక్షలు ఎలా చెల్లించాలని నోటీసు రావడంపై ఆలోచనలో పడ్డాడు. ఆ మొత్తాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని అంటున్నారు. ఇటీవల కాలంలో GST అధికారులు డిజిటల్ చెల్లింపులపై వ్యాపారులను నిశితంగా పరిశీలిస్తున్నారు. GST పరిమితి దాటి వ్యాపారులు చేసినవాళ్లు పన్ను చెల్లించకపోతే నోటీసులు అందుకుంటారని ఆ శాఖ అధికారులు చెబుతున్నమాట.
ఇక నోటీసులు పంపిన తర్వాత శంకర్‌గౌడ లాంటి చిన్నచిన్న వ్యాపారులు UPI ట్రాన్స్‌యాక్షన్‌ని మానేశారు. ఇప్పుడు నగదు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలియగానే కర్ణాటక GST విభాగం రియాక్ట్ అయ్యింది. ఈ మధ్యకాలంలో చాలామంది వ్యాపారులు UPIని నివారించి నగదుకు మారుతున్నారని తమకు తెలుసని తెలిపింది.
వ్యాపారులు తమకు వచ్చిన ఆదాయాన్ని దాచడానికి ప్రయత్నిస్తే పన్ను వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. శంకర్‌గౌడ వంటి చిన్న వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు రావడంతో మిగతా చిన్న వ్యాపారుల్లో కలకలం మొదలైంది.
డిజిటల్ యుగంలో యూపీఐ ట్రాన్స్‌యాక్షన్ విస్తరణలో ప్రపంచంలో భారత్ అగ్రగామిగా నిలిచిందని ఐఎంఎఫ్ డేటా చెబుతోంది. 2016లో యూపీఐ ద్వారా సేవలు మొదలయ్యాయి. డెబిట్, క్రెడిట్ వాడకాన్ని అధిగమించింది యూపీఐ. దీని ద్వారా లావాదేవీలు మే నెలలో 18.68 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసినట్టు పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా చెబుతోంది. గతేడాది ఇదే సమయంలో 14 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ప్రతీ ఏడాది యూపీఐ ద్వారా ట్రాన్స్ యాక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి.