Honeymoon Murder Case: ఈ మధ్యకాలంలో ఎక్కువగా రియల్ స్టోరీలను బేస్ చేసుకుని స్టార్ హీరోలు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా దేశాన్ని వణికించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును ఆధారంగా చేసుకొని.. ఒక స్టార్ హీరో సినిమా చేస్తానని ముందుకు వచ్చారు. ఈ కేసులో ట్విస్ట్ లు, టర్న్ లు ఆయనను విపరీతంగా ఆకర్షించాయని, అందుకే ఈ కథతో త్వరలో మీ ముందుకు వస్తానని తెలిపారు. మరి ఆ హీరో ఎవరు? అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుతో అమీర్ ఖాన్..
ఆయన ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan). ఎప్పుడు నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే ఈయన ఇప్పుడు దేశాన్ని ఆశ్చర్యపరిచిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులోని ప్రతి అంశం ఆయనను విపరీతంగా ఆకర్షించాయట. ఇందులో రాజా రఘు వంశీ అనే వ్యక్తి హత్యకు సంబంధించి, అతని భార్య సోనమ్ పాత్ర పై అనుమానాలు కేంద్ర బిందువుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ కేసులో జరిగిన కుట్రల నేపథ్యాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు అమీర్ ఖాన్ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తానికి అయితే హత్య కేసు ఆధారంగా సినిమా చేయబోతున్న అమీర్ ఖాన్.. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ చవి చూస్తారో చూడాలి.
ఆశ్చర్యపరిచిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేస్..
అసలేం జరిగిందనే విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన రాజా రఘు వంశీ కుటుంబం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. ఈ ఏడాది మే 11న సోనమ్ తో ఆయనకు వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరు కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురై కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అదృశ్యమైన 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహెరా లోని ఒక జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండడంతో దీనిని హత్యగా భావించిన పోలీసులు.. అనంతరం సోనం కోసం గాలించగా ఆమె జూన్ 7న ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలగా.. ఆ తర్వాత ఆమెకు సహకరించిన ప్రియుడు రాజ్ కుశ్వాహ, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోనమ్ తో తాము తమ బంధాన్ని తెంచేసుకున్నట్లు నిందితురాలి కుటుంబం తెలపగా.. మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తామని సోనం సోదరుడు కూడా హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం సోనమ్ షిల్లాంగ్ జైలులో ఉంది.
అమీర్ ఖాన్ సినిమాలు..
ఇప్పుడు ఈ కథతోనే అమీర్ ఖాన్ మన ముందుకు రాబోతున్నారు. హనీమూన్ హత్య కేసును తెరపై చూపిస్తే అది దేశవ్యాప్తంగా చర్చను రేపే అవకాశం ఉందని, అందుకే మరొకసారి క్రైమ్ థ్రిల్లర్ ఇమేజ్ ని తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘మహాభారతం’ ప్రాజెక్టుపై అమీర్ ఖాన్ దృష్టిపెట్టారు. అంతేకాదు మరొకవైపు రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj)దర్శకత్వంలో వస్తున్న కూలీ(Coolie ) సినిమాలో కూడా గెస్ట్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది .
ALSO READ : HHVM Business : పవన్ కెరీర్‌లోనే హైయెస్ట్ బిజినెస్… ఇన్ని కోట్ల టార్గెట్‌ను కలెక్ట్ చేస్తారా మరి ?