Loan After Death: ప్రస్తుత కాలంలో ప్రతి మధ్యతరగతి ఉద్యోగికి ఏదో ఒక లోన్ ఉండనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ రుణాలు తీసుకునే ధోరణి ఇంకా పెరిగిందని చెప్పవచ్చు. వారి ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఇల్లు, కారు లేదా ఇతర అవసరాల కోసం లోన్స్ తీసుకుంటున్నారు. అయితే బ్యాంకులు రుణాలను మంజూరు చేయడానికి మొదట కస్టమర్ల క్రెడిట్ స్కోరు, తిరిగి చెల్లింపు చేసే విధానం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని లోన్లను మంజూరు చేస్తుంది. ఆ తర్వాత, రుణగ్రహీత EMI రూపంలో వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రుణగ్రహీత అకారణంగా మరణిస్తే ఎలా? అప్పటి నుంచి ఆ రుణం భారం ఎవరిపై పడుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు ఆ రుణాన్ని రికవరీ చేయడానికి ఏం చేస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లోన్ రికవరీకి సంబంధించి ముఖ్యమైన నియమాలు
బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు, ఆ రుణాన్ని తిరిగి పొందడానికి బ్యాంకులు కొన్ని ప్రత్యేక నిబంధనలను పాటిస్తాయి. సాధారణంగా, బ్యాంకు మొదట రుణానికి సహ-దరఖాస్తుదారుని పేరును కూడా ప్రస్తావించాలని కోరుతుంది. ఆ క్రమంలో సహ-దరఖాస్తుదారు ఉంటే, అతను రుణాన్ని కొనసాగించాలని లేదా పూర్తిగా చెల్లించాలనుకుంటున్నాడా అనే విషయం బ్యాంకు నిర్ధారించుకుంటుంది.
సహ-దరఖాస్తుదారు బాధ్యత
-రుణానికి సహ-దరఖాస్తుదారు ఉన్నప్పుడు, అతను పూర్తిగా లేదా కొంత మేరకు రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
-సహ-దరఖాస్తుదారు కూడా తిరిగి చెల్లించలేకపోతే, బ్యాంకు తర్వాత దశకు వెళ్తుంది.
హామీదారు (గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి) బాధ్యత
-కొన్ని రుణాలలో హామీదారు (guarantor) ఉంటాడు. రుణగ్రహీత చెల్లించలేకపోతే, హామీదారు ఆ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
-హామీదారు కూడా తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తే, బ్యాంకు తదుపరి దశకు వెళ్తుంది.
చట్టపరమైన వారసుల బాధ్యత ఉంటుందా..
-ఒకవేళ సహ-దరఖాస్తుదారు, హామీదారు ఇద్దరు కూడా లేకపోతే, బ్యాంకు రుణగ్రహీత చట్టబద్ధమైన వారసులను సంప్రదిస్తుంది.
-చట్టపరమైన వారసులు స్వచ్ఛందంగా రుణాన్ని తిరిగి చెల్లించడానికి ముందుకు రాకపోతే, బ్యాంకు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: Smart TV Offer: 40 ఇంచ్ స్మార్ట్ టీవీపై 50 శాతం తగ్గింపు ఆఫర్..
రుణ రికవరీ కోసం బ్యాంకుల చర్యలు
-బ్యాంకులు ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు
-సహ-దరఖాస్తుదారు, హామీదారు, లేదా చట్టపరమైన వారసులు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, బ్యాంకుకు మరో కీలకమైన హక్కు ఉంటుంది. అదే వారి ఆస్తిని స్వాధీనం చేసుకోవడం.
గృహ రుణం: రుణగ్రహీత మరణించిన తరువాత, కుటుంబ సభ్యులు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, బ్యాంకు ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. ఆ తర్వాత వేలం (auction) ద్వారా ఆ ఇంటిని విక్రయించి రుణాన్ని తిరిగి పొందుతుంది.
కారు రుణం: కారును కూడా బ్యాంకు స్వాధీనం చేసుకుని, అమ్మడం ద్వారా రుణాన్ని రికవరీ చేసుకోవచ్చు.
వ్యక్తిగత రుణాలు: వ్యక్తిగత రుణాల కోసం, రుణగ్రహీతకు ఉన్న ఇతర ఆస్తులను విక్రయించడం ద్వారా బ్యాంకులు రుణాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తాయి.
బీమా అవకాశాలు
కొన్ని రకాల రుణాలకు లోన్ ఇన్సూరెన్స్ పాలసీ (Loan Insurance Policy) ముందుగానే తీసుకుంటారు. అంటే రుణగ్రహీత మరణించినప్పుడు రుణాన్ని కవర్ చేసుకుంటారు. అంటే, బీమా సంస్థ బ్యాంకుకు రుణాన్ని చెల్లిస్తుంది. తద్వారా వారి కుటుంబంపై ఆర్థిక భారం పడదు. గృహ రుణం తీసుకునేటప్పుడు, మీకు ఇలాంటి బీమా అందుబాటులో ఉందో లేదో అని తెలుసుకుంటే మంచిది.
చట్టపరమైన చర్యలు
సార్ఫేసి చట్టం (SARFAESI Act, 2002) ప్రకారం, బ్యాంకులు ఎన్‌పీఎగా (Non-Performing Asset – NPA) మారిన రుణాలను రికవరీ చేసుకోవడానికి వారి ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కు కలిగి ఉంటాయి. బ్యాంకులు 60 రోజుల తర్వాత నోటీసు ఇచ్చి వారి ఆస్తిని వేలం వేయవచ్చు.
కుటుంబ సభ్యులు ఏం చేయాలి?
-రుణగ్రహీత మరణించిన వెంటనే, బ్యాంకును సమాచారం ఇవ్వాలి.
-హామీదారు లేదా సహ-దరఖాస్తుదారుని ఎవరు అనేదాన్ని గుర్తించాలి.
-రుణానికి బీమా ఉందో లేదో చెక్ చేయాలి.
-కుటుంబ సభ్యులు రుణాన్ని ఒకేసారి లేదా తక్కువ వడ్డీ రేటుతో సమర్థవంతంగా చెల్లించడానికి బ్యాంకుతో చర్చలు జరపాలి.