Aniket Verma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో భాగంగా గురువారం రోజు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లమధ్య జరిగిన మ్యాచ్ లో సొంత గడ్డపై హైదరాబాద్ జట్టుకు తొలి దెబ్బ తగిలింది. హైదరాబాద్ పై లక్నో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
Also Read: Kohli – RCB: కోహ్లీ జెర్సీ సెంటిమెంట్.. ఈసారి RCB కప్పు కొట్టడం గ్యారంటీ?
అయితే హైదరాబాద్ బ్యాటింగ్ సమయంలో 6వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన అతడు క్రీజ్ లో ఉన్నది కాసేపే అయినా.. సిక్సర్ల వర్షంతో ఊపు ఊపేశాడు. ఉప్పల్ స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. ఓవైపు లక్నో బౌలర్లు వరుస వికెట్లు పడగొడుతుంటే.. ఇతడు మాత్రం వారికి చుక్కలు చూపించాడు. ఒక్క ఫోర్ కూడా లేకుండానే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగిన అతడి గురించి ఇప్పుడు క్రికెట్ అభిమానులంతా ఆరా తీస్తున్నారు.
ఇంతకీ అతడు ఎవరంటే.. “అనికేత్ వర్మ”. డొమెస్టిక్ క్రికెట్ లో సూపర్ క్రికెట్ ఆడిన ఈ యువకుడు.. ఐపీఎల్ లోను రెచ్చిపోతున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ అనికేత్ కేవలం 13 బంతుల్లో 36 పరుగులతో చిన్న సైజు సునామీనే సృష్టించాడు. ఇందులో ఐదు సిక్సులు బాదాడు. ఈ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన హేన్రీచ్ క్లాసెన్ పెవిలియన్ చేరిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అనికేత్ వర్మ.. అడుగుపెట్టిన సమయం నుండే ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస సిక్సర్లతో చెలరేగాడు.
276.92 స్ట్రైక్ రేట్ తో 36 పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్ కి చెందిన 22 ఏళ్ల ఈ బ్యాటర్ ని హైదరాబాద్ ఫ్రాంచైజీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతడు ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీలో జన్మించాడు. మధ్యప్రదేశ్ తరపున తన దేశవాళీ క్రికెట్ ఆడాడు. కానీ దేశవాలి క్రికెట్ లో అంతగా రాణించలేదు. ఇక 2024-25 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అనికేత్ ఇప్పటివరకు తన సీనియర్ జాతీయ జట్టు తరఫున ఒకే ఒక టి-20 మ్యాచ్ ఆడాడు. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగల అనికేత్ వర్మ.. పురుషుల వన్డే టోర్నమెంట్ లో కర్ణాటక అండర్ – 23 పై సెంచరీ సాధించాడు.
Also Read: Rahul Dravid: వీల్‌చైర్‌లో గ్రౌండ్‌లోకి వచ్చి… ద్రావిడ్ కష్టాలు చూడండి !
ఫెయిత్ క్రికెట్ క్లబ్ తరఫున 44 బంతులలో 120 పరుగులు చేసిన వర్మ.. మధ్యప్రదేశ్ టి-20 లీగ్ లో కేవలం 41 బంతులలోనే 123 పరుగులు చేశాడు. పవర్ హిట్టింగ్ కి పెట్టింది పేరు అయిన అనికేత్ వర్మ.. ప్రస్తుతం ఐపిఎల్ లో కూడా తానేంటో నిరూపించుకుంటున్నాడు. మొదటి మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. రెండవ మ్యాచ్ లో మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా క్రీజ్ లో ఉన్నంతసేపు ఆరెంజ్ ఆర్మీ అభిమానులను అలరించాడు అనికేత్ వర్మ.