ChatGPT: ఈ రోజుల్లో చాలా మంది చాట్ జీపీటీ, గ్రోక్ లాంటి ఏఐ చాట్ బాట్ లను ఉపయోగిస్తున్నారు. కచ్చితమైన సమాచారాన్ని పొందుతున్నారు. చాలా మంది సరదాగా సంభాషించేందుకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. తాజాగా చాట్ జీపీటీతో మాట్లాడేందుకు ప్రత్నించిన ఓ నార్వే వ్యక్తికి.. అటు నుంచి వచ్చిన సమాధానంతో గుండె ఆగినంత పని అయ్యింది. భయంతో వణికిపోయిన ఆయన, వెంటనే పోలీస్ స్టేషన్ కు పరిగెత్తాడు. చాట్ జీపీటీ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సదరు కంపెనీ మీద పరువు నష్టం దావా వేశాడు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
నార్వేకు చెందిన అర్వే హ్జల్మార్ హోల్మెన్ సరదాగా చాట్ జీపీటీతో మాట్లాడాలని భావించాడు. “అర్వే హ్జల్మార్ హోల్మెన్ ఎవరు?” అని ప్రశ్నించాడు. వెంటనే చాట్ జీపీటీ అతడు కలలో కూడా ఊహించిన రిప్లై ఇచ్చింది. “నువ్వు ఓ విషాదకరమైన సంఘటన కారణంగా అందరి దృష్టిని ఆకర్షించిన నార్వేజియన్ వ్యక్తివి. డిసెంబర్ 2020లో నార్వేలోని ట్రోండ్ హీమ్ లోని మీ ఇంటికి సమీపంలోని చెరువు దగ్గర.. 7, 10 ఏండ్ల వయసున్న ఇద్దరు పిల్లలను చంపేశావు. అత్యంత దారుణమైన ఈ హత్యలు దేశాన్ని కలవరపెట్టాయి. ఈ నేరానికి పాల్పడినందుకు గాను 21 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది” అని సమాధానం వచ్చింది.
పోలీస్ స్టేషన్ కు పరిగెత్తిన అర్వే
చాట్ జీపీటీ నుంచి వచ్చిన సమాధానం చూసి అర్వే షాకయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు పరిగెత్తాడు. నార్వేజియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. చాట్ జీపీటీ తన గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో వెల్లడించాడు. తన పేరు, తన పిల్లల పేరు, వయసు, తన నివాసం గురించి నిజాలే చెప్పినప్పటికీ, హత్యకు సంబంధించిన వాదన పూర్తిగా కల్పితమన్నారు. అలాంటి తప్పుడు సమాచారం తన జీవితాన్ని నాశనం చేయగలదని వాదించాడు. తను గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న చాట్ జీపీటీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరాడు. అటు తనకు న్యాయం చేయాలని కోరుతూ, డిజిటల్ హక్కుల కోసం కృషి చేసే నోయ్బ్ అనే టీమ్ ను కలిశాడు. వారితో కలిసి చాట్ జీపీటీ మీద పరువు నష్టం దావా వేశాడు. చాట్ జీపీటీ క్రియేటర్ల నుంచి తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.
స్పందించిన OpenAI సంస్థ
ఈ ఘటనపై ChatGPTని క్రియేట్ చేసిన OpenAI స్పందించింది. చాట్ బాట్ ప్రతిస్పందనల కచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పరువు నష్టం దావా గురించి స్పందించారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్లు వెల్లడించారు. మిగతా అంశాలను కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి స్పందించలేమని వెల్లడించింది.
Read Also: కిలాడి లేడీ.. నకిలీ డాక్యుమెంట్లతో 80 ప్లాట్లు అమ్మేసింది.. రూ.28 కోట్లు కాజేసింది!