BigTV English

Today’s Gold Price : బంగారానికి ఎందుకింత డిమాండ్..?

Today’s Gold Price : బంగారానికి ఎందుకింత డిమాండ్..?
Demand For Gold

Demand For Gold:


ఎన్నటికీ వన్నె తగ్గనిది పుత్తడి. చమురు, ధాన్యం, ఇతర వస్తువుల్లా తరిగిపోయేది కూడా కాదు. ఒక్కసారి తవ్వితీసిన తర్వాత అది భూమిపైనే ఉంటుంది.. శాశ్వతంగా! నగలు, నాణేలు, బిస్కట్ల రూపంలో భద్రంగా ఉంటుంది. ఒకప్పుడు దీనిని ద్రవ్యంగా వాడేవారు. కాలక్రమంలో బంగారానికి విలువ పెరిగింది. బంగారు నాణేల స్థానంలో నగదు వచ్చింది. నగల తయారీలోనే కాదు పెట్టుబడులపరంగానూ పుత్తడికి డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ దీని వినియోగం ఎక్కువే.

నిక్షేపాలకు కేంద్రం దక్షిణాఫ్రికా
బంగారు ఖనిజం నిక్షేపాలకు దక్షిణాఫ్రికా ప్రసిద్ధి. అక్కడి విట్‌వాటర్ శాండ్ బేసిన్‌లో నిక్షేపాలు ఎక్కువగా ఉన్నట్టు చెబుతారు. ఇప్పటివరకు తవ్వి తీసిన బంగారంలో 30% అక్కడిదే. వీటితో పాటు న్యూమోంట్ బాడింగ్టన్, సూపర్ పిట్(ఆస్ట్రేలియా), పొనెంగ్(దక్షిణాఫ్రికా), గ్రాస్బెర్గ్(ఇండొనేసియా) గనులు కూడా ప్రసిద్ధి చెందినవే. అమెరికాలోని నెవాడలో కూడా బంగారు గనులు ఎక్కువ. ఇక బంగారాన్ని ఎక్కువగా తవ్వితీసే దేశం చైనా. కెనడా, రష్యా, పెరూ దేశాలు కూడా ముందంజలో ఉన్నాయి.


స్వర్ణాగ్రదేశం
ప్రపంచంలో బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశం అమెరికానే. జర్మనీ కన్నా ఇవి దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. ఇటలీ, ఫ్రాన్స్‌ నిల్వలతో పోలిస్తే మూడు రెట్లకుపైనే. నిల్వల్లో చైనాది ఆరోస్థానం అయినా.. వెలికితీతలో మాత్రం ఆ దేశానిదే అగ్రస్థానం. బంగారం గనులకు ఆస్ట్రేలియా ప్రసిద్ధి. ఉత్పత్తిలో చైనా తర్వాత స్థానం ఆ దేశానిదే.

సగం ఆభరణాలకే..
ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి 2,12,582 టన్నుల బంగారాన్ని వెలికి తీశారు. మూడింట రెండొంతుల మేర 1950 తర్వాత తవ్వి తీసిందే. ఆభరణాలపై మోజు కారణంగా ఎక్కువ బంగారం వీటికే మరలింది. 46.5శాతం.. అంటే దాదాపు 1 లక్ష టన్నులు నగల రూపంలోకి మారింది. 22.8 శాతం(48,456 టన్నులు) స్వర్ణం కడ్డీలు, నాణేల రూపంలో ఉంది. సెంట్రల్ బ్యాంకుల వద్ద 17శాతం(34,592 టన్నులు), ఇతర రూపాల్లో 15%(30,726టన్నులు) బంగారం ఉంది.

బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఆభరణాల తయారీరంగంలోనే. భూమి నుంచి వెలికితీసే స్వర్ణంలో 50% వీటికి సరిపోతుంది. జ్యూయలరీ మార్కెట్‌కు భారత్, చైనా దేశాలు ప్రసిద్ధి. మొత్తం ప్రపంచ మార్కెట్‌లో సగం వాటా ఈ రెండు దేశాలదే. ప్రజల వద్ద నగల రూపంలో 25 వేల టన్నుల బంగారం ఉన్నట్టు అంచనా. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ఇది దాదాపు 40 శాతం.

దేశంలో బంగారం ధర ఇలా.. (రూ.లలో)
(10 గ్రాములు.. 24 కేరట్)
1965 71.75
1970 184.50
1975 540
1980 1330
1985 2130
1990 3200
1995 4680
2000 4400
2005 7000
2010 18500
2015 26343
2020 48651
2022 52670

సెంట్రల్ బ్యాంకులకు కీలకం
ఆర్థిక కష్టాల్లో అక్కరకు వచ్చేది పుత్తడే. అందుకే దీనిపై పెట్టుబడులకు అంత ఆసక్తి. ఎప్పుడైనా నగదుగా మార్చుకునే వీలుంది. విలువపరంగా ఒడిదొడుకులు తక్కువ. కాలంతో పాటే విలువా పెరిగేదే కానీ తగ్గేది కాదు. దీర్ఘకాలంలో లాభం సంగతి చెప్పనక్కర్లేదు. ఈ కారణాల వల్లే సెంట్రల్ బ్యాంకులకు బంగారం నిల్వలు కీలకంగా మారాయి. 2008లో ఆర్థిక సంక్షోభం కారణంగా పుత్తడి పట్ల వాటి దృక్కోణంలో మార్పు వచ్చింది. అప్పటి నుంచే పసిడి కొనుగోళ్లను పెంచాయి. సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నాణేల రూపంలో కాకుండా కడ్డీల రూపంలో నిల్వ ఉంటుంది. సెంట్రల్ బ్యాంకులన్నీ కలిపి ఈ ఏడాది 673 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. 1967 తర్వాత ఏడాది కొనుగోళ్లలో ఇదే అత్యధికం. ఒక్క మూడో త్రైమాసికంలోనే 400 టన్నులు కొనుగోలు చేయడం విశేషం.

పసిడి నిల్వలు టాప్ టెన్ దేశాలు (టన్నులలో)
మార్చి 2022 నాటికి..
అమెరికా 8133.54
జర్మనీ 3358.52
ఇటలీ 2451.86
ఫ్రాన్స్ 2436.49
రష్యా 2298.55
చైనా 1948.32
స్విట్జర్లాండ్ 1040.01
జపాన్ 845.98
భారత్ 768.8
టర్కీ 681.07

పెరిగిన పసిడి నిల్వలు
బంగారం ధరలు పెరగడమే తప్ప తరగడమనేది ఉండదు. ఈ పెరుగుదలకు కారణం మార్కెట్. బంగారాన్ని పెట్టుబడిగా, హోదాకి చిహ్నంగా భావిస్తుంటారు. అందుకే ఈ పసుపుపచ్చ లోహానికి అంత విలువ. ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పుడు దీనిని వెంటనే నగదుగా మార్చుకోవచ్చు. ఆడపిల్లలకు స్వర్ణాభరణాలు చేయించేది ఇందుకే. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా అదే ఆలోచనతో పసిడి నిల్వలను పెంచాలని రెండేళ్ల క్రితం నిర్ణయించింది. ఏ దేశంలోనైనా బంగారం నిల్వలు పెరుగుతూ ఉంటే.. ఆ దేశం ఆర్థికంగా బలపడినట్టే లెక్క. నిల్వల శాతాన్ని 7 నుంచి 10కి పెంచుకోవాలనేది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం అమెరికా సెక్యూరిటీలను తగ్గించుకునేందుకూ సిద్ధపడ్డారు.

జూలై 2019న 618.16 టన్నుల నిల్వలు ఉండగా.. జూలై 2022 నాటికి అవి 768.8 టన్నులకు చేరాయి. ద్రవ్య సరఫరాకు సంబంధించి కీలకమైన అంశాల్లో బంగారం ఒకటి. బంగారం నిల్వలు, ప్రభుత్వ సెక్యూరిటీలు, విదేశీ మారక నిల్వలు.. ఈ మూడు అంశాల ప్రాతిపదికన భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నోట్లను జారీ చేస్తుంటుంది. ఆర్థిక పరిస్థితులను బట్టి కేంద్ర బ్యాంకులు కరెన్సీ సరఫరాను తగ్గిస్తూ, పెంచుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువపై మన దేశంలో బంగారం, కరెన్సీ విలువ ఆధారపడి ఉంటాయి. మార్కెట్‌లో బంగారం ధర, అమెరికా డాలర్ మధ్య సంబంధం విలోమ అనుపాతంలో ఉంటుంది. డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. అదే డాలర్ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది.

ఉల్కల ఫలితమే..

పసిడి భూగోళంలో ఉద్భవించిన లోహం కాదు. 200 మిలియన్ సంవత్సరాల క్రితం భారీ ఉల్కలు భూమిని ఢీకొట్టిన ఫలితంగా వచ్చిందే.

  • స్వర్ణానికి సన్నగా, సాగే గుణం ఉంటుంది. ఆభరణాల తయారీకి అనువైన లోహం. అందుకే రోడియం, ప్లాటినం తదితర విలువైన, అరుదైన లోహాలున్నా కనకానికే ఎక్కువ క్రేజ్. 28.3 గ్రాముల బంగారాన్ని సన్నటి తీగలా సాగదీస్తే 8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. లేదంటే 100 చదరపు అడుగుల రేకులా అణగగొట్టొచ్చు.
  • మన శరీరంలోనూ బంగారముంది. 70 కిలోల బరువున్న మనిషిలో 0.2 మి.గ్రాల బంగారం ఉంటుంది. ఇది మంచి విద్యుత్తు వాహకం గనుక శరీరం అంతటికీ విద్యుత్తు సంకేతాలను పంపడంలో బంగారం ఉపయోగపడుతుంది.
  • దీనిని ఆహారంలో తీసుకుంటారన్న విషయం తెలిసిందే. స్వచ్ఛమైన స్వర్ణం ఎంతమాత్రమూ విషపూరితం కాదు. నేరుగా మన జీర్ణవ్యవస్థ ద్వారా వెళ్లిపోతుంది. తుప్పుపట్టని లోహాల్లో ఇదొకటి.
  • బంగారం ఆభరణాలకే కాదు.. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలోనూ దీనిని వినియోగిస్తారు. కంప్యూటర్లు, టెలివిజన్లు, కెమెరాలు, రేడియోలు, మీడియా ప్లేయర్ల తయారీకి ఉపయోగపడుతుంది.
  • భూమిలో నిక్షిప్తమైన బంగారం దాదాపు 53 వేల టన్నులు. సముద్ర జలాల్లోనూ పుత్తడి ఉంది. కానీ దానిని లెక్కించడం క్లిష్టం. నార్త్ పసిఫిక్, అట్లాంటిక్ సముద్రజలాలు ప్రతి 100 మిలియన్ మెట్రిక్ టన్నులకు ఒక గ్రాము బంగారం లభిస్తుందని ఓ అంచనా. ఇక సముద్రం అట్టడుగున కూడా పసిడి ఉంటుంది కానీ వెలికితీత చాలా కష్టం.
  • పురాతన కాలం నుంచీ బంగారం వినియోగంలో ఉంది. బల్గేరియాలో 6 వేల ఏళ్ల నాటి స్వర్ణ కళాకృతులు వెలుగుచూశాయి.
  • పసిడి ఉత్పత్తిలో చైనాది అగ్రస్థానం. ఏటా 370 టన్నుల ఉత్పత్తి జరుగుతుంటుంది. ఆ దేశంలో వినియోగమూ ఎక్కువే.
  • బంగారం అన్నా.. స్వర్ణభరణాలను చూసినా కొందరు భయపడుతుంటారు. దానిని ఆరోఫోబియా అని వ్యవహరిస్తారు.

Related News

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Big Stories

×