Zomato Name Change: దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన కార్పొరేట్ గుర్తింపును మార్చుకుంటూ, అధికారికంగా ‘ఎటర్నల్ లిమిటెడ్’గా పేరు మార్చుకుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) నుంచి అవసరమైన అనుమతులు పొందిన తరువాత, మార్చి 20, 2025 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని సంస్థ ప్రకటించింది.
పేరు మార్పు వెనుక కారణం ఏంటి?
జొమాటో వ్యవస్థాపకుడు, CEO దీపిందర్ గోయల్ గతంలోనే సంస్థ పేరు మార్పుపై సంకేతాలు ఇచ్చారు. బ్లింకిట్ డెలివరీ సేవల్ని కొనుగోలు చేసిన తరువాత, కంపెనీ వ్యాపార దృక్పథం విస్తరించిందని, భవిష్యత్తులో ఈ మార్పు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని ఆయన అన్నారు. మేము కంపెనీ పేరును ‘ఎటర్నల్’గా మార్చడానికి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం, సంస్థ విస్తరించే విధానాన్ని ప్రతిబింబించడమే. బ్లింకిట్ ఇప్పుడు మా వ్యాపారంలో కీలక భాగంగా మారింది. అందుకే కార్పొరేట్ స్థాయిలో కంపెనీ పేరు మార్పు చేయాలని నిర్ణయించుకున్నామని గోయల్ తెలిపారు.
వేగంగా అభివృద్ధి
గత నెలలో వాటాదారులకు రాసిన లేఖలో కూడా, ఈ పేరు మార్పును, కంపెనీ ఎదుగుతున్న మార్గాన్ని వివరించారు. మా వ్యాపారం ప్రస్తుతం నాలుగు ప్రధాన విభాగాలుగా విస్తరించబడింది. జొమాటో, బ్లింకిట్, హైపర్‌ప్యూర్, డిస్ట్రిక్. వీటిలో బ్లింకిట్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో ఈ రంగంలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తున్నామని ఆయన అన్నారు.
యాప్, బ్రాండ్ పేరు అలాగే ఉంటాయా?
పేరు మార్పు గురించి వినగానే చాలా మంది వినియోగదారులకు సందేహం వచ్చింది. ఈ క్రమంలో ‘జొమాటో యాప్ పేరు కూడా మారుతుందా అని అనుకున్నారు. కానీ గోయల్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. మా వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జొమాటో బ్రాండ్ అలాగే ఉంటుంది. యాప్ పేరు కూడా మారదు, సేవల్లో ఎటువంటి మార్పులు ఉండవు.
Read Also: Smartphone Offer: పవర్‌ఫుల్ ఫీచర్లతో మార్కెట్‌లోకి …
స్టాక్ మార్కెట్‌లో
కానీ కంపెనీ పేరు మాత్రమే ఎటర్నల్ లిమిటెడ్‌గా మారుతుందని ఆయన వెల్లడించారు. అలాగే, స్టాక్ మార్కెట్‌లోని కంపెనీ టిక్కర్ ఈ మార్పును ప్రతిబింబించేలా మారుతుంది. ఇకపై జొమాటో స్టాక్ టిక్కర్ ‘ఎటర్నల్’గా పరిగణించబడుతుంది. అంతేకాదు, సంస్థ అధికారిక వెబ్‌సైట్ కూడా zomato.com నుంచి eternal.comకి మారుతుంది.
వ్యాపార వ్యూహంలో కొత్త దిశ
పేరు మార్పు కేవలం ఒక మార్పు మాత్రమే కాదు, సంస్థ వ్యాపార వ్యూహంలోనూ కొత్త దిశను సూచిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బ్లింకిట్ కొనుగోలుతో సంస్థ తన వ్యాపారాన్ని కేవలం ఆహార డెలివరీ పరంగా కాకుండా మరింత విస్తరించుకోవాలని చూస్తోంది. బ్లింకిట్ ఆధారంగా రానున్న రోజుల్లో క్యాటగిరీ విస్తరణ, కొత్త సేవలను ప్రవేశపెట్టే అవకాశాలపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
భవిష్యత్తుపై ఆసక్తికర అంచనాలు
కేవలం ఆహార డెలివరీలోనే కాకుండా, ఇతర అవసరాలకు కూడా వేగంగా స్పందించే సేవలను అందించాలనే లక్ష్యంతో జొమాటో ముందుకు సాగుతోంది. బ్లింకిట్‌తో పాటుగా హైపర్‌ప్యూర్, డిస్ట్రిక్ వంటి విభాగాలపైనా కూడా సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఈ పేరు మార్పు ద్వారా సంస్థ తన దూరప్రయాణానికి కొత్తగా అర్థం ఇస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.