Gold Robbery Guntur | గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన దివి నాగరాజు.. ద్విచక్ర వాహనంపై 5 కిలోల బంగారు ఆభరణాలను సంచిలో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు ఆ సంచిని దొంగిలించి పారిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాగరాజు విజయవాడలో జ్యువెలరీ దుకాణం నడుపుతున్న దివి రాము బంధువు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆత్మకూరు అండర్ పాస్ కూడలిలో స్కూటీపై వెళ్తున్న నాగరాజును హెల్మెట్ ధరించిన ఇద్దరు యువకులు తడిమి, బంగారు నగలు ఉన్న సంచిని లాక్కుని పారిపోయారు. ఈ సంచిలోని బంగారం విలువ సుమారు రూ. 3.40 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఘటన తర్వాత నాగరాజు బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించగా, వారు పోలీసుల సహాయంతో ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అయితే, ఆ ప్రాంతంలోని దుకాణదారులు ఇలాంటి ఘటన జరిగిందని ఎవరూ చెప్పలేదని పోలీసులు తెలిపారు. సీసీ కెమేరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: రైల్లో దొంగలు, విమానాల్లో పోలీసులు – సినిమాని తలపించే ఛేజింగ్
నాగరాజు మొబైల్ ఫోన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 8:30 నుంచి 9:15 గంటల మధ్య అతను ఎవరితో మాట్లాడాడో వివరాలు సేకరిస్తున్నారు. నాగరాజు చోరీ 9:05 గంటలకు జరిగిందని చెప్పినప్పటికీ, పెద్దమొత్తంలో బంగారం దొంగతనం జరిగితే ఆ ప్రాంతంలోని వారికి తెలియకపోవడం పోలీసులను అనుమానానికి గురిచేస్తోంది. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వెంకట్‌లు ఘటనా ప్రదేశంలో విచారణ జరిపారు. చోరీ జరిగిందా లేదా నాగరాజు స్వయంగా ఇదంతా ప్లాన్ చేశాడా? అనే అంశంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ లోనూ రోడ్డుపైనే బంగారం దోపిడీ
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో కూడా ఇటీవల బైక్ పై ఇద్దరు యువకులు బంగారం ధరించిన మహిళలను టార్గెట్ చేశారు. అయితే పలు దొంగతనాలు చేసిన ఈ ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కూలీ పనులతో సంపాదన చాలకపోవడంతో చోరీలు చేసిన ఇద్దరిని మెదక్ పోలీసులు ఫిబ్రవరి 4న అరెస్ట్ చేశారు. వారి నుండి దొంగతనం చేసిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహమ్మద్ హఫీజ్ స్నేహితుడి యూనికార్న్ బైక్ (TS 35 2215)ను ఉపయోగించి, హెల్మెట్లు ధరించి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో నాలుగు చైన్ స్నాచింగ్‌లు చేసి, రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యారు. వారు మహిళలను అడ్రస్ అడుగుతున్నట్లు నటించి, వారి మంగళసూత్రాలు తెంపుకుని పారిపోయేవారు.
పోలీసులు హవేలీ ఘనపూర్ మండలంలో వాహనాల తనిఖీ చేస్తున్నప్పుడు, అనుమానాస్పదంగా వెళ్తున్న యూనికార్న్ బైక్‌ను ఆపే ప్రయత్నం చేశారు. నిందితులు పారిపోయే ప్రయత్నం చేసినా, పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. వారు చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి ఆరు తులాల రెండు బంగారు మంగళసూత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు మంగళసూత్రాలు కూడా త్వరలో స్వాధీనం చేసుకుంటామని మెదక్ ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.