ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోయారు. సంక్రాంతికి ఊరెళ్లిన వారి ఇండ్లను టార్గెట్ చేశారు. తాళాలు బద్దలు కొట్టి అందిన కాడికి డబ్బు నగలను దోచేశారు. ఇరు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో కేటుగాళ్లు తమ చేతివాటం కొనసాగించారు. విషయం తెలిసి లబోదిబోమన్న యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాగైన తమ డబ్బు, బంగారం వెతికి పెట్టాలని వేడుకుంటున్నారు.
రాయచోటిలో ఒకే రోజు మూడు దొంగతనాలు
ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో దొంగలు రెచ్చిపోయారు. వరుస దొంగతనాలతో ప్రజలు వణికిస్తున్నారు. తాజాగా ఒకే రోజు మూడు చోట్ల దొంగలు హల్ చల్ చేశారు. మూడు ఇండ్లు పగులగొట్టి పెద్ద మొత్తంలో బంగారం, నగలు దోచుకెళ్లారు. సంక్రాంతికి ఊరెళ్లిన వారి ఇండ్ల మీద నిఘా పెట్టిన కేటుగాళ్లు, వాళ్లు సొంతూళ్లకు వెళ్లడంతో తమ పని మొదలుపెట్టారు. స్వగృహ కాలనీలో మొత్తం మూడు చోట్ల ఇండ్ల తాళాలు పగులగొట్టారు. ఇంట్లోకి చొరబడి బీరువాలను బద్దలు కొట్టారు. డబ్బుతో పాటు బంగారం, వెండి వస్తువులను దోచుకెళ్లారు.
45 తులాల బంగారం.. రూ. 5 లక్షల నగదు..
మొత్తం మూడు చోట్ల జరిగిన ఈ దొంగతనాల్లో సుమారు 45 తులాలకు పైగా బంగారం దోచుకెళ్లారు. సుమారు 5 లక్షల నగదు ఎత్తుళ్లారు. పండగకు ఊరెళ్లి తిరిగొచ్చే సరికి ఇంటి తాళాలు తెరిచి ఉండటంతో యజమానులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు విషయం చెప్పారు. దొంగతనం జరిగిన ఇండ్లను పరిశీలించిన పోలీసులు.. క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు. వరుస దొంగతనాల నేపథ్యంలో రాయచోటి ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
వరంగల్ జిల్లాలో రెచ్చిపోయిన కేటుగాళ్లు
అటు తెలంగాణలోనూ దొంగలు రెచ్చిపోయారు. వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. బంగారంతో పాటు నగదును దోచుకెళ్లారు. ఎనుమాములలోని ఇందిరమ్మ కాలనీ, గీసుకొండ, దామెర, చింతపల్లి గ్రామాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. సంక్రాంతికి ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసి కట్టర్లతో ఇంటితాళాలను పగులగొట్టారు. పెద్ద మొత్తంలో నగదు దోచుకెళ్లారు. పండుగకి ఊరెళ్లి వచ్చే సరికి ఇండ్లు ఖాళీ కావడంతో అవాక్కయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఇండ్లను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ లను పిలిపించి ఆధారాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్స్ ను సంఘటనా స్థలానికి రప్పించి తనఖీలు చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు పోలీసులు.
ఊరెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్న పోలీసులు
వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీసులు జనాలకు కీలక సూచనలు చేస్తున్నారు. ఊరెళ్లినప్పుడు ఇంటి పక్కవారికి చెప్పి వెళ్లాలని పోలీసులు సూచించారు. వాళ్లను తరచుగా ఇంటిని గమనించాలని చెప్పాలన్నారు. ఇంటికి తగిన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికి వాళ్లు తమ ఇళ్లకు సీసీ కెమెరాలు పెట్టుకునే ప్రయత్నం చేయాలన్నారు. లేదంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.
Read Also: గేదెల కోసం సీసీ పుటేజ్ వెతుకులాట.. ముగ్గురు దుర్మార్గుల అత్యాచారం సంగతి బట్టబయలు..