Kerala News: కేరళలో ఓ ఇంట్లో భారీగా ఆయుధాలు పట్టుబడం తీవ్ర కలకలం రేపింది. ఓ ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా అవన్నీ బయటపడ్డాయి. ఇంతకీ ఆ ఇంట్లో ఆ స్థాయిలో ఆయుధాలు ఎలా వచ్చాయి? దీనిపై ఇంటి సభ్యులు ఏం చెబుతున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
కేరళలోని మలప్పురం జిల్లాలో నివసిస్తున్నాడు 60 ఏళ్ల ఉన్నికమద్. ఆయన ఇంట్లో ఆయుధాలు అక్రమంగా నిల్వ చేసి రహస్యంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు ఇరుగుపొరుగువారు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆ ఇంట్లో సోదాలు చేపట్టారు. 20 ఎయిర్ గన్‌లు, మూడు రైఫిల్స్, 200 బుల్లెట్లు, 40 పెల్లెట్ బాక్స్‌లను కనిపించాయి.
దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఉన్నికమద్ ఈ స్థాయిలో ఆయుధాలు నిల్వ చేయడానికి ఎలాంటి లైసెన్సు లేదు. మరి ఆయుధాలను ఎక్కడి నుంచి తెచ్చారు? ఎలా తీసుకొచ్చారు? ఎవరి దగ్గర కొనుగోలు చేశారు? అనేది వివరాలు తెలియాల్సివుంది.
ఉన్నికమద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు లోతుగా సాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆయుధాలను అమ్మేందుకు తీసుకొచ్చారా? వ్యక్తి గతంగా ఉపయోగించేందుకా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ALSO READ: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఆరుగురు మృతి
ఆయుధాలను పరీక్షల కోసం తిరువనంతపురం ల్యాబ్‌కి పంపారు పోలీసులు. ఇదిలాఉండగా ఉన్నికమ్మద్ రెండు తుపాకులకు లైసెన్స్ మాత్రమే కలిగివున్నాడని ఓ అధికారి చెప్పారు. గతంలో పాలక్కాడ్ నార్త్ పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు.
కల్పతి న్యూబ్రిడ్జి వద్ద పోలీసులు గస్తీ తిరుగుతున్న సందర్భంలో వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి గన్స్, బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. వేట కోసం తుపాకులు ఫలానా ప్రాంతంలో కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. వారిని విచారించగా ఉన్నికమ్మద్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆ వృద్ధుడి ఇంట్లో సోదాలు చేపట్టారు.